Share News

Nepal Currency Printing: చైనాలో నేపాల్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్.. 17 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్

ABN , Publish Date - Nov 13 , 2025 | 08:01 PM

430 మిలియన్ కరెన్సీ నోట్ల ముద్రణ కాంట్రాక్ట్‌ను నేపాల్ తాజాగా చైనా ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించింది. దీంతో, ఈ రంగంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న తీరుపై మరోసారి చర్చ జరుగుతోంది.

Nepal Currency Printing: చైనాలో నేపాల్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్.. 17 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్
Nepal currency printing in China

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అంతకంతకూ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న చైనా క్రమక్రమంగా కరెన్సీ ముద్రణకూ గ్లోబల్ సెంటర్‌గా అవతరిస్తోంది. తాజాగా నేపాల్ కరెన్సీ నోట్ల ముద్రణ కాంట్రాక్ట్‌ను చైనాకు చెందిన ప్రభుత్వ రంగ కంపెనీ చేజిక్కించుకుంది. గతంలో నేపాల్ కరెన్సీ ముద్రణ భారత్‌లో జరిగేది. అయితే, భారత భూభాగాలను నేపాల్‌‌కు చెందినవిగా చూపించే సరికొత్త మ్యాపును 2015లో నేపాల్ విడుదల చేసింది. ఆ తరువాతే పరిస్థితి మారిపోయింది (Nepal Currency Notes Printing in China).

1945 నుంచి 1955 వరకూ నాశిక్‌లోని సెక్యూరిటీ ప్రెస్‌లో నేపాల్ కరెన్సీ ముద్రణ జరిగేది. ఆ తరువాత కూడా నేపాల్ నోట్లల్లో అనేకం భారత్‌లోనే ముద్రించేవారు. కానీ భారత భూభాగాలను నేపాల్ మ్యాపులో చేర్చడంతో పరిస్థితి మారింది. ఈ సవరించిన కరెన్సీ నోట్ల ముద్రణకు భారత్ నిరాకరించడంతో నేపాల్ చైనా వైపు మళ్లింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం నేపాల్ కరెన్సీ నోట్లు మొత్తం చైనాలోనే ముద్రిస్తున్నారు. 430 మిలియన్ కరెన్సీ నోట్ల (వెయ్యి రూపాయల నోట్లు) ముద్రణ కాంట్రాక్ట్‌ను నేపాల్ రాష్ట్ర బ్యాంకు చైనా ప్రభుత్వ రంగ సంస్థ సీబీపీఎమ్‌సీకి తాజాగా అప్పగించింది. ఈ కాంట్రాక్ట్ విలువ సుమారు 17 మిలియన్ డాలర్లు.


నేపాల్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయ్‌ల్యాండ్, అప్ఘానిస్థాన్‌ కూడా తమ కరెన్సీ నోట్లను చైనాలోనే తయారు చేయించుకుంటున్నాయి. ఫలితంగా కరెన్సీ నోట్ల ముద్రణకు చైనా ఓ కేంద్రంగా మారిపోయింది. నకిలీకు ఆస్కారం లేకుండా కలర్ షిఫ్టింగ్ రంగులు, వాటర్ మార్క్‌లు, హోలోగ్రాఫిక్ థ్రెడ్స్ వంటి అధ్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్న నోట్లను తక్కువ ధరకే చైనా తయారు చేస్తుండటంతో అంతా అటువైపు మళ్లుతున్నారు. దీంతో జపాన్, రష్యా, అమెరికాలకు దీటుగా చైనా కూడా నోట్ల ముద్రణకు కేంద్రంగా మారుతోంది.

2015లో డెలారూ అనే విదేశీ సంస్థను టేకోవర్ చేయడంతో సీబీపీఎమ్‌సీ దశ మారింది. ప్రైవేటు రంగంలో విశ్వసనీయ కరెన్సీ ముద్రణా సంస్థగా డెలారూకు పేరుంది. టేకోవర్ తరువాత డెలారూకు చెందిన అత్యాధునిక సాంకేతికత చైనాకు దక్కింది. దీంతో, చైనా తన ప్రాబల్యాన్ని ఆసియా నుంచి ఆఫ్రికా, యూరప్, మధ్యప్రాచ్యానికి కూడా విస్తరించగలిగింది.


ఇవి కూడా చదవండి:

భారత్‌పై మళ్లీ నిందలు వేసిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

పాక్ ఆర్మీ చీఫ్‌‌‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 08:13 PM