Share News

Microsoft Shuts Down: ఆర్థిక, రాజకీయ పతనం వల్లే మైక్రోసాఫ్ట్ ఔట్..!

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:53 PM

గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. పాకిస్థాన్ కు బై.. బై చెప్పేయడం ఆ దేశంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. 25 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై చెబుతూ మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ దేశ రాజకీయ, ఆర్థికరంగ ప్రముఖులకు మింగుడుపడ్డంలేదు.

Microsoft Shuts Down:  ఆర్థిక, రాజకీయ పతనం వల్లే  మైక్రోసాఫ్ట్ ఔట్..!
Microsoft shuts down

ఇంటర్నెట్ డెస్క్: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్‌కు బై.. బై చెప్పేయడం పాకిస్థాన్ లో తీవ్ర ప్రకంపనలు పుట్టిస్తోంది. 25 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై చెబుతూ మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకోడం ఆ దేశ రాజకీయ, ఆర్థికరంగ ప్రముఖులకు మింగుడుపడ్డంలేదు. పాక్‌ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ ఆరిఫ్‌ అల్వీ, మైక్రోసాఫ్ట్ నిష్క్రమణపై స్పందించారు. దేశంలో రాజకీయ అస్థిరత కారణంగా అవకాశాలను కోల్పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్లో తన కార్యకలాపాలను ముగించాలని మైక్రోసాఫ్ట్‌ తీసుకున్న నిర్ణయం మన (పాకిస్థాన్) ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.


2022లో బిల్‌గేట్స్‌, పాక్‌ పర్యటనకు వచ్చినప్పుడు తనను కలిశారని ఆరిఫ్ చెప్పారు. ఆ సందర్భంలో పాక్ లో పెట్టుబడులు పెట్టాలని కోరగా, బిల్ గేట్స్ సానుకూలంగా స్పందించారని.. వెంటనే ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌‌తో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యా నాదేళ్లను మాట్లాడించారని గుర్తు చేసుకున్నారు. అనంతరం భారీ పెట్టుబడులకు ప్రణాళికలు రచించామని, అయితే, కొంత కాలానికే ప్రభుత్వం మారడం.. తదనంతర పరిణామాల వల్ల మైక్రోసాఫ్ట్‌ వియత్నాం వైపు వెళ్లిపోయిందని ఆయన అన్నారు. పాక్‌ ఇప్పుడు సుడిగుండంలో చిక్కుకుపోయిందన్న ఆరిఫ్.. నిరుద్యోగం, నిపుణులు విదేశాలకు తరలిపోవడం, కొనుగోలు శక్తి బాగా తగ్గడం వంటివి పాకిస్థాన్ ఆర్థిక పునరుద్ధరణకు పెద్ద సమస్యగా మారిపోయాయని పాక్ మాజీ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు.


కాగా, 25 ఏళ్లపాటు పాకిస్థాన్‌లో కొనసాగిన మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ తన ప్రపంచ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా పాకిస్థాన్‌లో తన కార్యకలాపాలను అధికారికంగా మూసివేసింది. క్లౌడ్ బేస్డ్ మోడల్‌కు మారడం, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత వంటి చర్యల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ మాజీ అధిపతి జావాద్ రెహ్మాన్ మూసివేతను ధృవీకరించారు. పాకిస్థాన్ లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, రాజకీయ అస్థిరత, అధిక పన్నులు, కరెన్సీ సమస్యలు, ఇంకా వాణిజ్య పరిమితులకు లోబడి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని జావాద్ అభిప్రాయపడ్డారు.


ఇవి కూడా చదవండి:

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్‌ మీడియా కేసుల్లో రిమాండ్‌

టీటీడీలో రిటైర్మెంట్‌ కలవరం

For More AP News and Telugu News

Updated Date - Jul 06 , 2025 | 05:33 PM