Robotics: ఎగిరే రోబో!
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:57 AM
ఒకప్పుడు సినిమాలకు, సైన్స్ నవలలకు మాత్రమే పరిమితమైన రోబోలు.. ఇప్పుడు దైనందిన జీవితంలోకి వచ్చేస్తున్నాయి.

ఇటలీ శాస్త్రవేత్తల తయారీ
ఐరన్ కబ్-3గా నామకరణం
పారిస్, జూలై 1: ఒకప్పుడు సినిమాలకు, సైన్స్ నవలలకు మాత్రమే పరిమితమైన రోబోలు.. ఇప్పుడు దైనందిన జీవితంలోకి వచ్చేస్తున్నాయి. వాటిని మరింత అభివృద్ధి పరుస్తూ.. ప్రపంచంలోనే తొలిసారిగా ఎగిరే హ్యూమనాయిడ్ రోబోను తయారు చేశారు ఇటలీ శాస్త్రవేత్తలు. ఇటాలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఈ పరిశోధకులు ఐరన్ కబ్-3 పేరుతో ఈ కొత్త తరహా రోబోను రూపొందించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఈ రోబో భూమి మీది నుంచి 50 సెంటీమీటర్ల ఎత్తుకు ఎగిరి అక్కడే కొద్దిసేపు స్థిరంగా ఉంది. 70 కిలోల బరువు ఉండే ఐరన్ కబ్ ముఖం ఒక చిన్నపిల్లాడిలా ఉంటుంది. అందుకే ఆ పేరు. గాలిలో ఎగరటం కోసం రోబోకు నాలుగు జెట్ ఇంజిన్లు అమర్చారు.
రెండు ఇంజిన్లు చేతుల కింద ఉంటే.. మరో రెండు రోబో వెనుక భాగంలో ఉన్న జెట్‌ప్యాక్‌లో ఉంటాయి. ఈ ఇంజిన్ల నుంచి వెలువడే బలమైన ఉద్గారాలే రోబోను పైకి లేపుతాయి. ఉద్గారాల వేడిని తట్టుకోవటానికి వీలుగా ఐరన్ కబ్‌కు టైటానియం ‘వెన్నెముక’ను అమర్చారు. రోబోకు తాను ఎక్కడ ఉన్నాననేది తెలియటం కోసం దాంట్లో సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఇక రోబో కాళ్లు, చేతులు కదల్చటానికి వీలుగా పరిశోధకులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అ రోబో తయారీకి రెండేళ్ల సమయం పట్టింది. ఐరన్ కబ్-3ని మరింత అభివృద్ధిపరిచే దిశగా ఇటలీ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల వేళ సహాయ చర్యల్లో వీటిని ఉపయోగించవచ్చని భావిస్తున్నారు.