Israeli Airstrike: ఇజ్రాయెల్ డ్రోన్ దాడి.. ఆరుగురు చిన్నారుల దుర్మరణం
ABN , Publish Date - Jul 13 , 2025 | 06:24 PM
ఇజ్రాయెల్ తాజాగా జరిపిన డ్రోన్ దాడిలో ఆరుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. మంచి నీళ్ల కోసం ట్యాంకర్ వద్దకు వెళ్లిన సమయంలో దాడి జరగడంతో మృతి చెందినట్టు స్థానిక ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన డ్రోన్ దాడిలో ఆరుగురు చిన్నారులు సహా పది మంది దుర్మరణం చెందారు. మంచి నీరు తెచ్చుకునేందుకు వెళ్లిన సమయంలో వారిపై దాడి జరిగినట్టు స్థానిక ఎమర్జెన్సీ సర్వీసుల అధికారులు ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. మృతదేహాలను అక్కడి నుసేరత్ అల్ అవ్దా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో గాయపడ్డ 16 మందికి అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఈ ఉదంతంపై ఇజ్రాయెల్ మిలిటరీ ఇంకా స్పందించాల్సి ఉంది.
దాడి అనంతరం అక్కడ నెలకొన్న భీతావహ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాధితులను స్థానికులు ప్రైవేటు వాహనాల్లో ఆసుపత్రులకు తరలించారు. ఇటీవల గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో తాజా ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆదివారం జరిగిన మరో మూడు దాడుల్లో సుమారు 19 మంది పాలస్తీనియన్‌లు మరణించినట్టు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. రఫాలోని ఫీల్డ్ ఆసుపత్రిలో శనివారం సుమారు 132 మంది వివిధ గాయాలతో చేరారని ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ కమిటీ తెలిపింది. వారిలో 32 మంది కన్నుమూసినట్టు వెల్లడించింది. ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన సమయంలో అధిక శాతం మందిపై దాడులు జరిగినట్టు వెల్లడించింది. మే 27న ఆహార పంపిణీ కేంద్రాలు తెరిచిన నాటి నుంచీ ఇప్పటివరకూ బుల్లెట్ గాయాల పాలైన 3400 మందికి రఫా ఫీల్డ్ ఆసుపత్రిలో చికిత్స చేసినట్టు తెలిపింది. మరో 250 మంది మరణించినట్టు వెల్లడించింది. గాజాలో దుస్థితికి ఈ మరణాలు అద్దం పడుతున్నాయని వెల్లడించింది.
ఇక శనివారం ఓ ఆహారం పంపిణీ కేంద్రం వద్ద జరిగిన దాడిలో 24 మంది కన్నుమూసినట్టు దక్షిణ గాజాకు చెందిన నస్సెర్ ఆసుపత్రి వెల్లడించింది. ప్రజలు ఆహారం సేకరిస్తున్న సమయంలో ఇజ్రాయెలీ దాళాలు కాల్పులు జరిపాయని పేర్కొంది. అయితే, ముందస్తు హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరిపినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. అనుమానాస్పదంగా ఉన్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ముందస్తుగా హెచ్చరికలు చేసినట్టు తెలిపింది.
సహాయక కేంద్రాల వద్ద మరణించిన వారి సంఖ్య 789కు చేరిందని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వీరిలో 615 మంది గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కేంద్రాల వద్దే మరణించినట్టు వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుతో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
కొన్ని ఘటనల్లో సామాన్య పౌరులు గాయపడిన మాట వాస్తవమేనని ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది. పౌరులతో ఘర్షణలను వీలైనంతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. హమాస్ నియంత్రణలోని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇచ్చిన గణాంకాలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రయత్నిస్తోందని గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ మండిపడింది.
2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడి తరువాత ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం మొదలెట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అక్కడ 90 శాతం ఇళ్లు దెబ్బతినడమో లేదా పూర్తిగా ధ్వంసమవడమో జరిగాయి. అధిక శాతం మంది నిర్వాసితులుగా మారారు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ సుమారు 58 వేల మంది కన్నుమూసినట్టు గాజా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇవీ చదవండి:
అమెరికా FBIకి చిక్కిన ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి