Ceasefire: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ముగిసింది.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Jun 24 , 2025 | 06:50 AM
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు అంగీకరించినందుకు ఇరు దేశాలకు అభినందనలు తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజులుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు కూడా తెలిపారు. ‘ఇకపై అంతా అనుకున్నట్టే జరుగుతుందని భావిస్తున్నా.. జరుగుతుంది కూడా. ఈ 12 రోజుల యుద్ధాన్ని ముగించినందుకు.. ముగించే ధైర్యసాహసాలు, ఇంటెలిజెన్స్‌ను కనబరిచిన ఇరు దేశాలకు శుభాకాంక్షలు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.
కాల్పుల విమరణ దశలవారీగా జరుగుతుందని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తొలుత ఇరాన్ కాల్పుల విరమణ ప్రారంభిస్తుందని, ఆ తరువాత 12 గంటలకు ఇజ్రాయెల్ కూడా దాడులను ఆపేస్తుందని అన్నారు. ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు గౌరవిస్తాయని కూడా తెలిపారు. యావత్ మధ్య ప్రాచ్యాన్ని నాశనం చేయగల ఈ యుద్ధం కొన్నేళ్ళ పాటు జరిగి ఉండేదని, కానీ అలా జరగలేదని చెప్పుకొచ్చారు. ఇరు దేశాలకు , మధ్య ప్రాచ్య ప్రాంతానికి దేవుడి దీవెనలు ఉంటాయని కూడా అన్నారు.
ఈ విషయంలో ఇజ్రాయెల్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. అయితే, ఇరాన్ మళ్లీ దాడులకు దిగనంతకాలం కాల్పుల విరమణ తమకు అంగీకారమేనని ఇజ్రాయెల్ పేర్కొన్నట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.
ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ఎక్కుపెట్టడంతో ఈ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రాణాలు కాపాడుకునేందుకు ఇప్పటికే కొన్ని లక్షల మంది ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇజ్రాయెల్‌కు తోడుగా అమెరికా కూడా దాడులకు దిగడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. అమెరికా బాంబర్‌లు ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ తరుణంలో ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేశారు.
కాల్పుల విరమణ జరగలేదు
ఇరాన్ మాత్రం అమెరికా అధ్యక్షుడి ప్రకటనను తోసిపుచ్చింది. ఇజ్రాయెల్‌తో ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేసింది. తమ అణుస్థావరాలపై దాడులు చేసిన అగ్రరాజ్యంపై ప్రతీకారం తప్పదని ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్‌పై దాడి.. వీటి శక్తి ఎంతో తెలిస్తే..
ఇరాన్ నిర్ణయంతో షాక్.. చైనా సాయం కోరిన అమెరికా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి