Israel Tactical Pause: గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:06 PM
గాజాకు మానవతా సాయం అందేందుకు వీలుగా ఇజ్రాయెల్ మిలిటరీ దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించింది. గాజాలో జన సాంద్రత అధికంగా ఉన్న ఓ మూడు ప్రాంతాల్లో పగటి పూట దాడులు జరగవని హామీ ఇచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్న వేళ ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజాకు ఆహారం, ఔషధాలు చేర్చేందుకు వీలుగా ఓ మూడు ప్రాంతాలపై దాడులకు స్వల్ప విరామం ప్రకటించించింది. ప్రతి రోజు కొన్ని గంటల పాటు దాడులకు విరామం ఇచ్చి మానవతా సాయం అందేందుకు సహకరిస్తామని ఆదివారం తెలిపింది. జన సాంద్రత అధికంగా ఉన్న చోట్ల ఈ స్వల్ప కాలిక కాల్పుల విరమణ అమలవుతుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇజ్రాయెల్ ప్రకటన ప్రకారం, గాజాలోని అల్ మావాసీ, దయిర్ అల్ బలాహ్, గాజా సిటీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 8 గంటల వరకూ ఇజ్రాయెల్ ఎలాంటి మిలిటరీ చర్యలను చేపట్టదు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం దాడులు ఎప్పటిలాగే కొనసాగుతాయి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ఇది అమల్లో ఉంటుంది. ఇక గాజాకు సాయాన్ని తరలించేందుకు కొన్ని ప్రత్యేక మార్గాలను ఎంపిక చేసి సురక్షితమైనవిగా గుర్తిస్తామని వెల్లడించింది.
ఈ మార్గాల్లో ప్రతి రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకూ ఆహారం, ఔషధాలు, ఇతర అవసరాలను తరలించొచ్చని పేర్కొంది. సామాన్య పౌరుల రాకపోకలను ఈ మార్గాల్లో అనుమతిస్తున్నట్టు వెల్లడించింది. జులై 27 నుంచి ఈ మార్గాలు శాశ్వత ప్రాతిపదికన అందుబాటులోకి రానున్నాయి. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇజ్రాయెల్ వర్గాలు తెలిపాయి.
మరోవైపు, ఇజ్రాయెల్ శనివారం నుంచి హెలికాఫ్టర్‌ల ద్వారా గాజాకు నిత్యావసర వస్తువులను చేర్చడం ప్రారంభించింది. ఇతర దేశాలు మానవతా సాయాన్ని ఎయిర్ డ్రాప్ చేసేందుకు శుక్రవారమే అనుమతించింది. ఈ నేపథ్యంలో యూకే సహా పలు దేశాలు గాజాకు భారీ ఎత్తున అవసరమైన వస్తువులను తరలిస్తున్నాయి. ఈజిప్టు నుంచి కూడా నిత్యావసరాల తరలింపు ప్రారంభమైంది. గాజాపై ఆహారం సంక్షోభం ముంచుకొస్తోందన్న ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు, అంతర్జాతీయ ఒత్తిడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తాత్కాలిక దాడుల విరమణకు అంగీకరించింది.
ఇవి కూడా చదవండి:
కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
వలసలపై ట్రంప్ హెచ్చరికలు.. ఈ ఆక్రమణను అడ్డుకోవాలని ఐరోపా దేశాలకు పిలుపు
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి