Share News

US TRF Terror Outfit: పహల్గాం దాడి చేసిన టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా.. స్వాగతించిన భారత్

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:00 AM

పహల్గాం దాడికి కారణమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని భారత్ స్వాగతించింది. ఉగ్రవాద కట్టడిలో భారత్, అమెరికా మధ్య సహకారానికి ఇది నిదర్శనమని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

US TRF Terror Outfit: పహల్గాం దాడి చేసిన టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా.. స్వాగతించిన భారత్
TRF terror tag US

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడికి పాల్పడిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని భారత్ స్వాగతించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అమెరికా మధ్య ఉన్న సహకారానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించింది.

ఉగ్రవాదంపై పోరులో వివిధ దేశాల మధ్య సహకారం అవసరమని భారత్ ఎప్పటినుంచో చెబుతోందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సరైన సమయంలో టీఆర్ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించారని పేర్కొంది. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో భారత్ ఉపేక్షించదని పేర్కొంది. ఉగ్రవాద సంస్థలు, వారి వెనుకున్న వారికి బుద్ధి చెప్పేందుకు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని పేర్కొంది.

ఇక ఈ పరిణామంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కూడా స్పందించారు. భారత్, అమెరికా మధ్య సహకారానికి ఇది నిదర్శనమని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోకు ధన్యవాదాలు తెలిపారు.


పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాకు అనుబంధంగా ఉన్న టీఆర్‌ఎఫ్ ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం టీఆర్ఎఫ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పహల్గాం దాడి బాధితులకు న్యాయం కోసం ట్రంప్ కట్టుబడి ఉన్నట్టు ఈ చర్యతో స్పష్టమైందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు, అమెరికా ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు ట్రంప్ సర్కారు కట్టుబడి ఉందని అన్నారు.

పహల్గాం దాడిలో 26 మంది సామాన్య పౌరులు కన్నుమూశారు. వీరిలో దాదాపు అందరూ పర్యాటకులే. బాధితుల మతం ఏదో తెలుసుకున్నాకే ఉగ్ర మూకలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ దారుణంపై దర్యాప్తు ప్రారంభించిన జాతీయ దర్యాప్తు సంస్థ.. టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సజ్జద్‌ను ఈ కుట్రకు మాస్టర్ మైండ్‌గా గుర్తించింది.


ఇవి కూడా చదవండి:

ట్రంప్ కాళ్ల వాపుపై స్పందించిన వైట్ హౌస్.. వృద్ధుల్లో కనిపించే సాధారణ సమస్యేనని క్లారిటీ

రష్యా, చైనాతో కూటమి పునరుద్ధరణకు ప్రయత్నాలు.. స్పందించిన భారత్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 12:16 PM