RIC Talks: రష్యా, చైనాతో కూటమి పునరుద్ధరణకు ప్రయత్నాలు.. స్పందించిన భారత్
ABN , Publish Date - Jul 18 , 2025 | 07:27 AM
రష్యా-ఇండియా-చైనా కూటమి ఏర్పాటుపై చర్చలు జరుగుతాయన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పందించాయి. ప్రస్తుతానికి ఎలాంటి సమావేశానికి అంగీకరించలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో కలిసి రష్యా, చైనాలు కూటమి (ఆర్‌ఐసీ) కట్టాలన్న ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పందించాయి. ఈ దిశగా తాము ఎలాంటి మీటింగ్‌కు ఇంకా అంగీకరించలేదని స్పష్టం చేశాయి. ‘రష్యా-ఇండియా-చైనా కూటమి ఫార్మాట్‌లో ఎలాంటి మీటింగ్‌కు ప్రస్తుతం మేము అంగీకరించలేదు. మీటింగ్ ఎర్పాటుపై ఎలాంటి చర్చలు ప్రస్తుతం జరగట్లేదు’ అని పేర్కొన్నాయి (Russia-India-China Troika).
ఇక ఆర్‌ఐసీపై విదేశాంగ శాఖ కూడా స్పష్టత ఇవ్వలేదు. ‘అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలు చర్చించేందుకు దేశాలు కలిసి వస్తాయి. అలాంటి సమావేశాలు జరిగినప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన తేదీపై చర్చలు జరుగుతాయి. అలాంటిదేమైనా ఉంటే మీడియాకు చెబుతాము’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
పాశ్చాత్య ప్రాబల్యానికి సరితూగే శక్తిగా రష్యా, చైనా, ఇండియా కూటమిగా ఏర్పడాలన్న భావన ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ దిశగా చర్చలు ప్రారంభించాలని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ కొంత కాలం క్రితం అన్నారు.
‘రష్యా, ఇండియా, చైనా కూటమి ఫార్మాట్‌లో చర్చల కోసం ఆసక్తిగా ఉన్నాను. రష్యా మాజీ ప్రధాని యెవ్‌జెనీ ప్రిమకోవ్ నేతృత్వంలో మూడు దేశాలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. మినిస్టీరియల్ లెవెల్‌లో 20కి పైగా మీటింగ్స్ జరిగాయి’ అని లావ్రోవ్ జూన్‌లో పేర్కొన్నారు.
ఇక రష్యా ప్రయత్నాలపై చైనా కూడా సానుకూలంగా స్పందించింది. నిద్రాణంగా ఉన్న ఈ కూటమిని మేలుకొల్పితే మూడు దేశాలకు ప్రయోజనకారకమని అభిప్రాయపడింది. ప్రపంచదేశాల భద్రతకు ఇది అవసరమని కూడా పేర్కొంది.
ఈ చర్చలను పునఃప్రారంభించేందుకు రష్యా డిప్యుటీ విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రే రుడెంకో ప్రయత్నిస్తున్నట్టు అక్కడి మీడియా పేర్కొంది. చైనా, భారత్‌తో చర్చలు జరుపుతున్నారని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ ప్రతినిధి చేసిన కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి
రష్యాతో వాణిజ్యంపై నాటో చీఫ్ వార్నింగ్.. స్పందించిన భారత్
ఓటు హక్కు వయోపరిమితిని తగ్గించేందుకు సిద్ధమైన యూకే.. ఇక 16 ఏళ్లకే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి