Dalai Lama: దలై లామా వారసుడి ఎంపికపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన ఇండియా
ABN , Publish Date - Jul 04 , 2025 | 07:36 PM
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా వారసుడు ఎవరన్న చర్చ పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా స్పందించింది. మతపరమైన విషయాల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోదని విదేశాంగ శాఖ ప్రతినిధి తాజాగా వెల్లడించారు.

ఇంటర్నెట్ డెస్క్: టిబెట్ ఆధ్యాత్మిక మత గురువు దలై లామా వారసుడి ఎంపికపై చైనా అభ్యంతరాల నడుమ భారత్ తాజాగా కీలక ప్రకటన చేసింది. మతపరమైన అంశాలు, సంప్రదాయాల విషయంలో ప్రభుత్వం స్పందించదని తేల్చి చెప్పింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ‘దలై లామా ప్రకటన గురించి వచ్చిన వార్తలను మేము చూశాము. అయితే, మతపరమైన అంశాలు, విశ్వాసాల విషయాల్లో భారత ప్రభుత్వం స్పందించదు. భారత్‌లో ఉండే వారందరికీ మతపరమైన విషయాల్లో స్వేచ్ఛ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇదే తీరు కొనసాగుతుంది’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.
టిబెట్ తదుపరి దలై లామా ఎవరన్న విషయంపై చర్చ పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ మేరకు స్పందించారు. చైనా టిబెట్‌ను ఆక్రమించుకున్నాక అక్కడ నుంచి అనేక మంది బౌద్ధులు భారత్‌కు వలసొచ్చారు. అయితే, మతపరమైన విషయాల్లో తమది తటస్థ వైఖరి అని భారత్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది.
అంతకుమునుపు, ఈ విషయంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ దలై లామాకు తన వారసుడిని ఎంపిక చేసుకునే అధికారం, హక్కు ఉన్నాయని అన్నారు. తదుపరి దలై లామా ఎంపికకు తమ ఆమోదం తప్పనిసరి అని చైనా పేర్కొనడంపై మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. దలై లామా కేవలం టిబెటన్లకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఆధ్యాత్మిక గురువు అని అన్నారు.
ఈ కామెంట్స్‌పై స్పందించిన చైనా టిబెట్ విషయాల్లో భారత్ ఆచితూచి స్పందించాలంటూ ప్రకటన విడుదల చేసింది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి ఇబ్బంది లేకుండా వ్యవహరించాలని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో జోక్యం వద్దు.. భారత్‌కు చైనా స్పష్టీకరణ
ఆకాశ్ మిసైల్ కొనుగోలుకు బ్రెజిల్ ఆసక్తి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి