Gold: పిల్లాడి కడుపులో 100 గ్రాముల బంగారం
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:03 PM
Gold Bar Inside Boy Stomach: అతడ్ని ఎక్స్ రే చేసిన డాక్టర్లు అంత పెద్ద బంగారం బారు కడుపులో ఉండంతో ఆశ్చర్యపోయారు. మొదట మందుల ద్వారా దాన్ని బయటకు రప్పించే ప్రయత్నం చేద్దామని భావించారు. 2 రోజులు గడిచినా అది బయటకు రాలేదు.

బంగారం ధరలు జెట్టు స్పీడులో దూసుకుపోతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష రూపాయలకు చేరింది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫంక్షన్ల కోసం పెద్ద మొత్తంలో బంగారం కొనాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పేద, మధ్య తరగతి వాళ్లు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఓ వైపు బంగార ధరలు పెరిగి పేద, మధ్య తరగతి వాళ్లు ఇబ్బందులు పడుతుంటే.. ఓ పిల్లాడి కడుపులో ఏకంగా పది లక్షల రూపాయలు విలువ చేసే బంగారం బయటపడింది. కడుపులో బంగారం చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన క్షియాన్ అనే 11 ఏళ్ల బాలుడు కొద్దిరోజుల క్రితం 100 గ్రాముల బంగారం బారుతో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పొరపాటున దాన్ని మింగేశాడు. అది కాస్తా పెద్ద పేగుల్లోకి వెళ్లి ఆగింది. బయటకు రాలేదు. దీంతో అతడి కడుపు ఉబ్బిపోయింది. నొప్పి కానీ, ఇతర ఏ ఇబ్బంది కలుగలేదు. పిల్లాడు బంగారం మింగేశాడని తెలియగానే తల్లిదండ్రులు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడ్ని ఎక్స్ రే చేసిన డాక్టర్లు అంత పెద్ద బంగారం బారు కడుపులో ఉండంతో ఆశ్చర్యపోయారు.
మొదట మందుల ద్వారా దాన్ని బయటకు రప్పించే ప్రయత్నం చేద్దామని భావించారు. 2 రోజులు గడిచినా అది బయటకు రాలేదు. అది అలాగే ఉంటే ప్రేగు దెబ్బ తింటుందని భావించిన డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి సిద్దమయ్యారు. ఎండోస్కోపీ ప్రొసిజర్ ద్వారా 30 నిమిషాల్లో బంగారాన్ని బయటకు తీశారు. ఆపరేషన్ జరిగిన 48 గంటల్లోనే పిల్లాడు సాధారణంగా తినటం మొదలెట్టాడు. డాక్టర్లు అతడ్ని ఇంటికి పంపేశారు. కాగా, 2021లో వియత్నాంలో ఓ తొమ్మిదేళ్ల పిల్లాడు అనుకోకుండా స్క్రూలు, ఆయస్కాంతం మింగేశాడు. డాక్టర్లు ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు.
ఇవి కూడా చదవండి
Justice Surya Kant: న్యాయ వ్యవస్థపై ప్రతీ రోజూ దాడి జరుగుతోంది..