Share News

Germany Defense: మారుతున్న జర్మనీ యుద్ధ తంత్రం.. రోబో బొద్దింకలు, ఏఐ రోబోల అభివృద్ధిపై దృష్టి

ABN , Publish Date - Jul 24 , 2025 | 10:25 AM

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో జర్మనీ తన పంథాను మార్చుకుంటోంది. కొత్త ఆయుధాలను కూడా సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా పలు అంకుర సంస్థలను ప్రోత్సహిస్తోంది. నిఘా కోసం రోబో బొద్దింకలు, ఏఐ రోబోల అభివృద్ధిపై దృష్టి పెట్టింది.

Germany Defense: మారుతున్న జర్మనీ యుద్ధ తంత్రం.. రోబో బొద్దింకలు, ఏఐ రోబోల అభివృద్ధిపై దృష్టి
Germany defense startups

ఇంటర్నెట్ డెస్క్: ఐరోపా దేశాలు రెండు ప్రపంచ యుద్ధాలను చవిచూశాయి. ఈ మహాయుద్ధాలకు కేంద్రంగా ఉన్న జర్మనీ ఆ తరువాత శాంతిమంత్రం పఠించింది. జర్మనీ నేతల్లో రక్షణ రంగంపై అనాసక్తి పెరిగింది. ఫలితంగా కొత్త తరం ఆయుధాల ఉత్పత్తి, అభివృద్ధికి అక్కడి ప్రభుత్వ ప్రాధాన్యత ఇవ్వలేదు. తమ రక్షణావసరాల కోసం అమెరికాపైనే అధికంగా ఆధారపడింది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆపై ట్రంప్ అధికారంలో రావడం కారణంగా తమ రక్షణ బాధ్యతలను తామే చేపట్టేందుకు జర్మనీ మరోసారి సిద్ధమైంది. సంప్రదాయక ఆయుధాలతోపాటు కొత్త తరం ఆయుధ, నిఘా వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రోబో బొద్దింకలు, ఏఐ రోబోల తయారీలో అంకుర సంస్థలను విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తోంది.

హెల్సింగ్, ఏఆర్‌ఎక్స్ రోబోటిక్స్ వంటి అంకుర సంస్థలకు జర్మనీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలుస్తోంది. వాటికి నిధుల లభ్యతను కూడా పెంచుతోంది. హెల్సింగ్ మార్కెట్ విలువ ఇటీవల 12 బిలియన్ డాలర్లకు చేరుకోవడం ఇందుకు నిదర్శనం. అమెరికా అణ్వాయుధాన్ని కనుగొన్న రీతిలో అత్యాధునిక కొత్తతరం ఆయుధాలతో యుద్ధ తంత్రాన్ని మార్చేసే దిశగా జర్మనీ అడుగులు వేస్తోంది.


రక్షణ రంగంలోని సంప్రదాయక సంస్థలతో పాటు స్టార్టప్ సంస్థలను ప్రోత్సహంచేందకు జర్మనీ ప్రభుత్వం వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టంది. ముఖ్యంగా ప్రభుత్వ అనుమతుల జారీని మరింత సులభతరం చేసింది. అత్యాధునిక యుద్ధ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్న స్టార్టప్ సంస్థలను ప్రభుత్వంతో వీలున్నంతగా అనుసంధానం చేయాలంటూ అధికారులను జర్మనీ ఛాన్సలర్ ఆదేశించారు. ఇక ప్రభుత్వ టెండర్లలో పాల్గొనేందుకు నిబంధనలను మరింత సరళీకరించారు. ఐరోపా వెలుపల ఉన్న సంస్థలకు ఈ టెండర్లలో పాల్గనకుండా నిషేధించారు.

ఈ క్రమంలో జర్మనీ స్టార్టప్ సంస్థలు కొత్త తరహా ఆయుధాలను సిద్ధం చేస్తున్నాయి. అత్యాధునిక సెన్సార్లు అమర్చిన బొద్దింకలతో నిఘా కార్యకలాపాలు నిర్వహించే దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ దిశగా స్వార్మ్ బయోటాక్టిక్స్ వంటి ప్రాజెక్టులకు జర్మనీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కీటకాలపై కెమెరాలను అమర్చి యుద్ధ క్షేత్రంలో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు.


అయితే, కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేసే క్రమంలో జర్మనీ, ఇతర ఐరోపా దేశాలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. రక్షణ రంగ అవసరాలకు సంబంధించి దేశాల మధ్య వ్యత్యాసాలు, అమెరికా సంస్థలతో పోటీ పడేలా అంకుర సంస్థలను ప్రోత్సహించడం ఐరోపా దేశాలకు కష్టంగా మారింది. జర్మనీ పెట్టుబడిదారుల్లో రక్షణాత్మక ధోరణి కూడా ఈ పరిస్థితికి ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఏఐ, రోబోటిక్స్ వైపు జర్మనీ క్రమంగా మళ్లుతోంది.

ఇవి కూడా చదవండి:

సైబర్ దాడి.. 158 ఏళ్ల నాటి ట్రాన్స్‌పోర్టు కంపెనీ మూసివేత.. 700 ఉద్యోగులకు లేఆఫ్

రెండు దశాబ్దాలుగా కోమాలో ఉన్న సౌదీ రాకుమారుడి కన్నుమూత

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 24 , 2025 | 01:19 PM