France Palestine Recognition: పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తాము.. ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన
ABN , Publish Date - Jul 25 , 2025 | 09:21 AM
ఫాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ సంచలన ప్రకటన చేశారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని అన్నారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ మండిపడింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దని హితవు పలికింది.

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ తాజాగా కీలక ప్రకటన చేశారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా అధికారిక గుర్తింపునకు సిద్ధం అవుతున్నట్టు కూడా తెలిపారు. ఇజ్రాయెల్‌తో యుద్ధం తరువాత గాజాలో మానవ సంక్షోభంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో చిక్కుకుపోయిన వేలాది మంది సామాన్యులు ఆకలితో అలమటిస్తున్న వైనంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన కీలకంగా మారింది.
గాజాలో యుద్ధం ఆపడం అత్యవసరమని ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. సామాన్య పౌరులను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. గాజాలో శాంతిని నెలకొల్పడం సాధ్యమేనని అన్నారు. మధ్యప్రాచ్యంలో శాశ్వతంగా శాంతి నెలకొల్పేందుకు ఇది అవసరమని అన్నారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి, ఫ్రాన్స్ ప్రజల మనోభీష్టాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తక్షణ కాల్పుల విరమణ, బందీల విడుదల, మానవతాసాయం పెంపు వంటి చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. శాంతిని నెలకొల్పేందుకు మరో ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఫ్రాన్స్, ఇజ్రాయెల్, పాలస్తీనా వాసులు, ఐరోపా దేశాలు, ఇతర అంతర్జాతీయ భాగస్వాములు అంతా కలిసి శాంతి నెలకొల్పడం సాధ్యమేనని నిరూపించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
కాగా, ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మండిపడ్డారు. అక్టోబర్ 7 నాటి నరమేధం తరువాత పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడమంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడే పాలస్తీనా దేశం ఇరాన్‌కు తొత్తుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాలస్తీనా వారు విధ్వంసాన్నే కోరుకుంటున్నారని అన్నారు. మరోవైపు, ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటనపై పాలస్తీనా హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటికే 140కి పైగా దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. వీటిల్లో ఐరోపా దేశాలు కూడా ఉన్నాయి. అయితే, పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్ లాంటి శక్తిమంతమైన దేశం ముందుకు రావడంతో ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
మారుతున్న జర్మనీ యుద్ధ తంత్రం.. రోబో బొద్దింకలు, ఏఐ రోబోల అభివృద్ధిపై దృష్టి
సైబర్ దాడి.. 158 ఏళ్ల నాటి ట్రాన్స్‌పోర్టు కంపెనీ మూసివేత.. 700 ఉద్యోగులకు లేఆఫ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి