Share News

Electric Airplane: ఈవీ విమానం వచ్చేసింది

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:28 AM

ఈవీ బైకులు, ఈవీ కార్లు ఇప్పటికే వచ్చాయి.. ఇప్పుడు ఏకంగా ఈవీ విమానమే వచ్చేసింది. అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్‌ అనే కంపెనీ విమానయానరంగ చరిత్రలో తొలిసారిగా ఈవీ విమానాన్ని రూపొందించి...

 Electric Airplane: ఈవీ విమానం వచ్చేసింది

  • 130 కి.మీ.ల దూరానికి రూ.694 ఖర్చు

  • అమెరికాలో తొలి ప్రయాణం సక్సెస్‌

  • ‘ఆలియా సీఎక్స్‌ 300’గా నామకరణం

  • ఒకసారి చార్జింగ్‌తో 250 నాటికల్‌ మైళ్లు

  • భవిష్యత్తులో గగనతల ట్యాక్సీగా సేవలు!

వాషింగ్టన్‌, జూన్‌ 23: ఈవీ బైకులు, ఈవీ కార్లు ఇప్పటికే వచ్చాయి.. ఇప్పుడు ఏకంగా ఈవీ విమానమే వచ్చేసింది. అమెరికాకు చెందిన బీటా టెక్నాలజీస్‌ అనే కంపెనీ విమానయానరంగ చరిత్రలో తొలిసారిగా ఈవీ విమానాన్ని రూపొందించి, విజయవంతంగా నడిపింది. ‘ఆలియా సీఎక్స్‌ 300’ అనే పేరున్న ఈ విమానాన్ని అమెరికాలోని ఈస్ట్‌ హ్యాంప్టన్‌ నుంచి కెన్నడీ విమానాశ్రయం వరకూ నలుగురు ప్రయాణికులతో ఇటీవలే నడిపించి చూశారు. ఈస్ట్‌ హ్యాంప్టన్‌ నుంచి కెన్నడీ ఎయిర్‌పోర్టు వరకూ మధ్య దూరం 70 నాటికల్‌ మైళ్లు (130 కి.మీలు). ఈ దూరాన్ని ఆలియా 30 నిమిషాల్లో అధిగమించింది. దీనికైన ఖర్చు 8 డాలర్లు (రూ.694) మాత్రమే. అంటే, కిలోమీటరుకు ఐదు రూపాయల 30 పైసలు. సాధారణంగా ఈ దూరానికి ఒక హెలికాప్టరులో ప్రయాణిస్తే కనీసం 160 డాలర్లు (రూ.13,885) అవుతుందని, దాంట్లో 20వ వంతు ఖర్చుతోనే ఈవీ విమానంలో వెళ్లటం సాధ్యమైందని బీటా టెక్నాలజీస్‌ సీఈఓ కేల్‌ క్లార్క్‌ వెల్లడించారు. పైలట్‌కు ఇచ్చే వేతనం, విమానం నిర్వహణ వ్యయం వంటి ఇతరత్రా ఖర్చులున్నా.. ఈవీతో మొత్తం ఖర్చు గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు. విమానం లోపల ఎటువంటి శబ్దం ఉండదని, కాబట్టి, ప్రయాణికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా చాలా సులువవుతుందని తెలిపారు.


ఈ ఏడాదిలోపు ఆలియా సీఎక్స్‌కు అమెరికా ‘ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌’ గుర్తింపు తెచ్చుకోవాలని బీటీ టెక్నాలజీస్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఆలియాలో ఒకసారి చార్జింగ్‌ చేస్తే 250 నాటికల్‌ మైళ్ల దూరం (463 కి.మీ) ప్రయాణించవచ్చని, స్వల్పదూర ప్రయాణాలకు ఈ తరహా విమానాలు సరిపోతాయని క్లార్క్‌ తెలిపారు. గగనతల ట్యాక్సీల్లా కూడా ఇవి పని చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఎయిర్‌ట్యాక్సీల వినియోగం పెరుగుతుందని అంచనా. 2028లో అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో.. క్రీడాభిమానులు నగరంలోని ట్రాఫిక్‌ చిక్కుల బారిన పడకుండా ఎయిర్‌ ట్యాక్సీలను నడిపేందుకు ఒలింపిక్స్‌ కమిటీ ఆర్చర్‌ ఏవియేషన్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

Updated Date - Jun 24 , 2025 | 07:31 AM