Share News

Donald Trump on Pahalgam Attack: పహల్గాం దాడిపై తొలిసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Apr 26 , 2025 | 11:28 AM

పహల్గాం దాడిపై తొలిసారిగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది చాలా చెత్త పని అని కామెంట్ చేశారు. కశ్మీర్ ఉద్రిక్తతలను భారత్, పాక్‌లు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటాయన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.

Donald Trump on Pahalgam Attack: పహల్గాం దాడిపై తొలిసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Donald Trump on Pahalgam Attack

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ప్రోద్బలంతో జరిగిన పహల్గాం దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ఆ దాడి చాలా చెత్త పని అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భారత్‌కు సంఘీభావం తెలిపిన ట్రంప్.. కశ్మీర్‌లో ఘర్షణలు వందల ఏళ్లుగా సాగుతున్నాయని అన్నారు. ఈ సమస్యను ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకుంటాయన్న నమ్మకం తనకుందని అన్నారు. పోప్ అంత్యక్రియలకు వాటికన్ నగరానికి వెళ్లే ముందు ట్రంప్ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘నేను భారత్‌కు సన్నిహిత మిత్రుణ్ణి. పాక్‌తోనూ క్లోజ్ గానే ఉంటాను. అయితే, కశ్మీర్‌లో ఘర్షణలు వెయ్యి ఏళ్లుగా సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అంతకంటే ముందు నుంచి కూడా ఘర్షణలు జరుగుతూ ఉండొచ్చు. నిన్నటి దాడి మాత్రం చాలా చెత్త పని. అయితే, ఈ సమస్య భారత్, పాక్ మధ్య ఎప్పటి నుంచో ఉన్నదే. 1500 ఏళ్లుగా అక్కడి పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. నాకు భారత్, పాక్ దేశాధినేతలు ఇద్దరూ బాగా తెలుసు. ఈ సమస్యను వాళ్లు ఏదోవిధంగా పరిష్కరించుకుంటారు’’ అని ట్రంప్ అన్నారు.


మరోవైపు, అమెరికా నిఘా సంస్థ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ కూడా పహల్గాంపై స్పందించారు. ఈ దాడిని ఖండించిన ఆమె భారత్‌కు సంఘీభావం ప్రకటించారు. భారత్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. ‘‘ఈ దారుణ ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నాము. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని అంతమొందించడంలో భారత్‌కు మద్దతుగా ఉంటాము’’ అని చెప్పారు.

పహల్గాం దాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ముక్త కంఠంతో కూడా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన వారు, వారికి మద్దతునిచ్చిన వారికి కఠిన శిక్ష పడాల్సిందేనని పేర్కొంది. 15 మంది సభ్యులున్న మండలి ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం భద్రతా మండలిలో పాక్‌ తాత్కాలిక సభ్య దేశంగా ఉన్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

అదే జరిగితే సింధూ నదిలో వారి రక్తం పారుతుంది.. బిలావాల్ భుట్టో పిచ్చి కూతలు

అమెరికా కోసమే ఇదంతా.. ఉగ్రవాదంపై పాక్ రక్షణ శాఖ మంత్రి షాకింగ్ వ్యాఖ్య

విద్యార్థి వీసాల రద్దుకు బ్రేకులు

Read Latest and International News

Updated Date - Apr 26 , 2025 | 11:38 AM