Dalai Lama Reincarnation: ఆ విషయంలో జోక్యం వద్దు.. భారత్‌కు చైనా స్పష్టీకరణ
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:18 PM
దలై లామా వారసుడి ఎంపికపై తుది నిర్ణయం తమదేనని చైనా మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్ జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. తన వారసుడిని ఎంపిక చేసే హక్కు దలై లామాకు మాత్రమే ఉందన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కామెంట్స్ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా వారసుడి ఎంపికపై చైనా తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. టిబెట్ అంశాల్లో జోక్యంపై తమ అభ్యంతరాలను భారత్ దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొంది. టిబెట్ విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని, ఇరు దేశాల బంధాలు దెబ్బతినకుండా భారత్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తన వారసుడిని ఎంపిక చేసుకునే హక్కు, అధికారం దలై లామాకు మాత్రమే ఉందని ఇటీవల కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనా తాజా ప్రకటన విడుదల చేసింది.
దలై లామా వారసుడి ఎంపిక విషయంలో తుది ఆమోదం తెలిపే హక్కు తమకు ఉందని చైనా స్పష్టం చేసింది. ఇది రాజరిక కాలం నుంచి వస్తున్న విధానమని స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ వైఖరిని గౌరవించాలని పేర్కొంది. టిబెట్ మతపరమైన వ్యవహారాల్లో తుది నిర్ణయం తమదేనని వెల్లడించింది.
దలై లామా ఎంపికపై గురువారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించిన విషయం తెలిసిందే. దలై లామాతో పాటు ఆయన ఏర్పాటు చేసిన బౌద్ధ వ్యవస్థకే వారసుడి ఎంపికపై హక్కు ఉంటుందని అన్నారు. ‘బౌద్ధులకు దలై లామా అత్యంత గౌరవనీయమైన వ్యక్తి. తన తదుపరి ఎవరని ఆయన మాత్రమే నిర్ణయిస్తారు’ అని అన్నారు. ఈ విషయంలో చైనా గతంలో చేసిన ప్రకటనలను కూడా తోసిపుచ్చారు. అవి నిరాధారమని అన్నారు. జులై 6న ధర్మశాలలో దలై లామా 90వ జన్మదిన వేడుకల్లో కూడా ఆయన భారత ప్రతినిధిగా పాల్గొంటారు.
ప్రస్తుతం టిబెట్ దలై లామాగా ఉన్న టెన్జిన్ గ్యాట్సో 1959లో భారత్‌కు వచ్చారు. టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్న నేపథ్యంలో ఆయన భారత్‌కు వచ్చారు. తన వారసుడి ఎంపికపై ఆయన ఇటీవలే స్పందించారు. ఇది పూర్తిగా తన నిర్ణయమేనని అన్నారు. బీజింగ్ జోక్యానికి స్థానం లేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. 2015లో తాను ఏర్పాటు చేసిన ట్రస్టుకు ఈ విషయంలో పూర్తి అధికారాలు ఉన్నాయని అన్నారు. మరెవ్వరికీ ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు లేదని తేల్చి చెప్పారు.
కానీ దలై లామా ప్రకటనను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తోసిపుచ్చారు. దలై లామా వారసుడి ఎంపికకు చైనా ప్రభుత్వ ఆమోదముద్ర తప్పనిసరి అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఆకాశ్ మిసైల్ కొనుగోలుకు బ్రెజిల్ ఆసక్తి
ఎఫ్-35 జెట్‌ను స్వదేశానికి తరలించనున్న బ్రిటన్.. చిన్న భాగాలుగా విడగొట్టి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి