Canada: కెనడా స్టడీ పర్మిట్లలో భారీ కోత
ABN , Publish Date - May 24 , 2025 | 05:10 AM
భారీ స్థాయిలో వలసల నేపథ్యంలో కెనడా అనుసరిస్తున్న కఠినమైన వీసా నిబంధనల కారణంగా ఆ దేశానికి వెళ్లి చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కేవలం 30,640 పర్మిట్లు జారీ
గత ఏడాదితో పోలిస్తే 31ు తగ్గుదల
భారతీయ విద్యార్థులకు గట్టి షాక్
ఒట్టావా, మే 23: భారీ స్థాయిలో వలసల నేపథ్యంలో కెనడా అనుసరిస్తున్న కఠినమైన వీసా నిబంధనల కారణంగా ఆ దేశానికి వెళ్లి చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. స్టడీ పర్మిట్లలో కెనడా ఈ ఏడాది భారీగా కోత పెట్టింది. ఇమిగ్రేషన్ రిఫ్యూజెస్ అండ్ సిటిజన్షిప్ కెనడా (ఐఆర్సీసీ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి)లో భారతీయ విద్యార్థులకు కేవలం 30,640 పర్మిట్లు జారీచేశారు. ఇది గత ఏడాది ఇదే కాలానికి సంబంధించి జారీచేసిన పర్మిట్లతో పోలిస్తే 31 శాతం తగ్గుదల కనిపిస్తోంది. దేశంలోకి భారీగా వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్యను నియంత్రించేందుకు కెనడా ప్రభుత్వం 2023 నుంచి చర్యలు తీసుకుంటోంది. ఆ ఏడాది మొత్తం 6,81,155 స్టడీ పర్మిట్లను జారీచేయగా.. వాటిల్లో భారతీయులే 2,78,045 ఉన్నారు. అదే 2024 నాటికి మొత్తం సంఖ్యను 5,16,275కు తగ్గించారు.
అందులో భారతీయ విద్యార్థుల సంఖ్య 1,88,465కు పడిపోయింది. భారీ స్థాయిలో వలసలు ఉండడంతో కెనడా ప్రభుత్వం విద్యార్థుల పర్మిట్ల విషయంలో నియంత్రణ విధించాలని నిర్ణయించింది. దేశంలో పెరుగుతున్న గృహ సంక్షోభం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. దీంతో పాటు ఆరోగ్య, రవాణా మౌలిక సదుపాయాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. కొత్త ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్నీ ఇటీవల కీలక ప్రకటన చేశారు. విదేశీ విద్యార్థులు, పనిచేసే వారితో సహా దేశంలో తాత్కాలిక నివాసితుల సంఖ్య 2028 నాటికి దేశ జనాభాలో 5 శాతానికి మించకూడదన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఐఆర్సీసీ.. 2025కు సంబంధించి స్టడీ పర్మిట్లను 4,37,000కు పరిమితం చేసింది. తొలుత దీన్ని 4,85,000 అనుకున్నారు. కెనడాలో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య అధికంగా ఉంటుంది. 2022లో మొత్తం విదేశీ విద్యార్థుల్లో మనవాళ్ల సంఖ్య 41 శాతం వరకు ఉండటం గమనార్హం.