US Cardiology New Discovery: యుఎస్ కార్డియాలజీ కొత్త ఆవిష్కరణ.. గుండె వయస్సు తెలుసుకునే సరికొత్త టూల్.!
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:36 PM
USలోని కార్డియాలజీ నిపుణులు ఒక కొత్త ఆన్‌లైన్ టూల్‌ను రూపొందించారు. ఇది మీ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, డయాబెటిస్ పరిస్థితి, మిగిలిన ఆరోగ్య వివరాలను ఉపయోగించి మీ గుండె వయస్సును అంచనా వేస్తుంది.

ఇంటర్నెట్ డెస్క్: మనం సాధారణంగా మన వయసును క్యాలెండర్ ప్రకారం మాత్రమే తెలుసుకుంటాం. కానీ, మీ గుండె వయసు మాత్రం వేరుగా ఉండవచ్చు. అమెరికాలోని ప్రముఖ కార్డియాలజీ నిపుణులు ఒక కొత్త ఆన్‌లైన్ సాధనాన్ని తయారుచేశారు. ఇది మీ రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటిస్, ధూమపానం వంటి ఆరోగ్య అంశాలను పరిశీలించి మీ ‘గుండె వయస్సు’ను అంచనా వేస్తుంది.
గుండె వయస్సు అంటే ఏమిటి?
గుండె వయస్సు అనేది ఒక వ్యక్తి గుండె ఎంత ఆరోగ్యంగా ఉందో సూచిస్తుంది. ఇది వారి వయస్సు కంటే పెద్దదిగా ఉంటే, వారి గుండెకు ఎక్కువ ఒత్తిడి ఉందని, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అర్థం. ఉదాహరణకు, మీరు 50 సంవత్సరాలు ఉన్నా మీ గుండె 60 సంవత్సరాల వయసులో ఉండొచ్చు లేదా తక్కువ వయసులో ఉండొచ్చు. ఇది మీ జీవనశైలి, ఆరోగ్య అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది.
అధ్యయనంలో ఏమి కనుగొన్నారు?
ఈ కొత్త సాధనాన్ని అమెరికలోని 14,000 మందిపై పరీక్షించినప్పుడు, చాలా మంది గుండె వయస్సు వారి వాస్తవ వయసుకన్నా 4 నుంచి 7 సంవత్సరాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అంటే వారి గుండె ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు అర్థం. నల్లజాతి పురుషుల గుండె వయస్సు సగటున వారి వయసుకంటే 8.5 సంవత్సరాలు ఎక్కువగా ఉంది. హిస్పానిక్ పురుషుల గుండె వయస్సు సగటున 7.9 సంవత్సరాలు ఎక్కువగా ఉంది. తక్కువ విద్య ఉన్నవారి గుండె వయస్సు మరింత ఎక్కువగా ఉండటం గుర్తించారు.
మీరు గుండె వయస్సు ఎలా తెలుసుకోవాలి?
US కార్డియాలజిస్టులు తయారు చేసిన ఉచిత ఆన్‌లైన్ సాధనంలో మీరు మీ ఆరోగ్య సమాచారాలు (రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటిస్, ధూమపానం వంటి వివరాలు) ఇచ్చి, మీ గుండె వయస్సును అంచనా వేయవచ్చు. ఈ సాధనం 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్సు గల పెద్దలకు ఉపయోగపడుతుంది. ఇది కేవలం సలహా కోసం మాత్రమే ఉపయోగించాలి. ఈ సాధనంలో ఇతర ఆరోగ్య పరిస్థితులు లేదా మహిళల ప్రత్యేక పరిస్థితులు పరిగణలోకి తీసుకోలేదు. అందువల్ల పూర్తిగా డాక్టరు పర్యవేక్షణ అవసరం.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
న్యూరోసర్జన్ల హెచ్చరిక.. ఈ ఫుడ్స్ తింటే మీ బ్రెయిన్ ఖతం
తెల్లవారుజామున 3 - 5 గంటల మధ్య మెళకువ వచ్చేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
For More Health News