Rising Lung Cancer: ఊపిరి తీస్తున్న పొగాకు
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:32 AM
ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదవుతున్న క్యాన్సర్ మరణాల్లో అత్యధికం ఏ క్యాన్సర్ వల్లనో తెలుసా

ధూమపానంతో పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్లు
90% లంగ్ క్యాన్సర్ కేసులకు అదే కారణం
ఎంఎన్‌జేలో గత ఏడాది వెయ్యి మందికి చికిత్స
బాధితుల్లో 80% పురుషులు.. 20% మంది స్త్రీలు
ప్యాసివ్ స్మోకింగ్‌తోనూ మహమ్మారి బారిన..
నేడు అంతర్జాతీయ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినం
హైదరాబాద్ సిటీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదవుతున్న క్యాన్సర్ మరణాల్లో అత్యధికం ఏ క్యాన్సర్ వల్లనో తెలుసా?.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌వల్లేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి! అందుకే ఏటా ఆగస్టు 1వ తేదీని.. ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహన కలిగించే రోజుగా నిర్వహిస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం.. పొగాకు ఉత్పత్తులే. ధూమపానానికి, పొగాకు ఉత్పత్తులకు బానిసలవుతున్న యువత సంఖ్య భారీగా పెరుగుతుండడంతో ఏటా లంగ్ క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ప్రముఖ ఆస్పత్రి ఎంఎన్‌జే క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో గత ఏడాది 16 వేల క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. అందులో 1000కి పైగా కేసులు లంగ్ క్యాన్సర్‌వే. బాధితుల్లో చాలా మంది (దాదాపు 90ు మంది) క్యాన్సర్ బాగా ముదిరి.. నాలుగో దశలో ఉన్నప్పుడు వస్తుండడం వల్ల వారిని కాపాడడం కష్టమవుతోంది. మిగతా 10 శాతం మంది కూడా క్యాన్సర్ మూడో దశలో ఉన్నప్పుడు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం కారణంగా దాని బారిన పడినవారు దాదాపు 90ు మంది దాకా ఉంటున్నారు. పొగతాగకపోయినా.. జన్యుపరమైన, పర్యావరణ కారణాలతో కొందరు ఆ మహమ్మారి బారిన పడుతున్నట్టు వైద్యులు తెలిపారు. నిత్యం వాహన కాలుష్యానికి గురవుతూ.. రసాయనిక పరిశ్రమల నుంచి వచ్చే పొగను పీల్చేవారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పుందని హెచ్చరించారు. లంగ్ క్యాన్సర్ బాధితుల్లో పురుషులు 80 శాతం మంది ఉంటుండగా.. మహిళలు 20 శాతం మంది ఉంటున్నారు. కాగా.. పొగతాగడం మానేసిన తర్వాత శరీరం మళ్లీ సాధారణ స్థితికి రావడానికి దాదాపు 20 సంవత్సరాలు పడుతుందని ఎంఎన్‌జే డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు.
వారికీ ముప్పే..
ఒక వ్యక్తి ధూమపానానికి బానిసైతే.. ఆ వ్యసనం ఆ వ్యక్తికే కాక, చుట్టుపక్కలున్నవారికి కూడా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. సిగరెట్/చుట్ట వంటివి తాగేవారి పక్కనే ఉన్నవారి ఊపిరితితుల్లోకి కూడా ఆ పొగ వెళ్లి (ప్యాసివ్ స్మోకింగ్) వారు కూడా లంగ్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. సుదీర్ఘకాలం పాటు ఇలా సెకండ్‌హ్యాండ్/ప్యాసివ్ స్మోకింగ్‌కు గురయ్యేవారిలో 20ు నుంచి 30ు మంది లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించగలిగితే మరణాన్ని నివారించడానికి అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కానీ.. చాలామంది బాధితులు క్యాన్సర్ లక్షణాలను పట్టించుకోకుండా ఆలస్యం చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఎడతెగని దగ్గు, ఎలాంటి ప్రయత్నం లేకుండా బరువు తగ్గిపోవడం, విపరీతమైన అలసట వంటి లక్షణాలు ఉన్నప్పుడు.. వైద్యులను సంప్రదించాలని.. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ(సీటీ) స్కాన్, బయాప్సీ వంటివాటి ద్వారా ఊపిరి తిత్తుల క్యాన్సర్లను ముందే గుర్తించవచ్చని సూచిస్తున్నారు.
స్మోకింగ్ మానేసిన 20 నిమిషాల నుంచే..
20 నిమిషాల్లో: హృదయ స్పందన వేగం సాధారణ స్థితికి రావడం మొదలవుతుంది. బీపీ తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది.
8 గంటల్లో: రక్తంలో ఆక్సిజన్ సాధారణ స్థితికి చేరి.. కార్బన్‌మోనాక్సైడ్ స్థాయులు తగ్గుతాయి.
48 గంటల్లో: వాసన, రుచి గ్రహించే సామర్థ్యం మెరుగవుతుంది. శరీరంలో అప్పటిదాకా పేరుకుపోయిన నికోటిన్ బయటకు వెళ్లిపోతుంది.
72 గంటల్లో: శ్వాస పీలుస్తున్నప్పుడు హాయిగా ఉంటుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం కొంచెం మెరుగుపడుతుంది.
2-12 వారాల్లో: రక్త ప్రసరణ గణనీయంగా మెరుగుపడుతుంది. నడిచేటప్పుడు, వ్యాయామం చేసే సమయంలో శ్వాస సమస్యలు రావు.
3-9 నెలల్లో: దగ్గు సమస్య తగ్గుతుంది. ఊపిరి బాగా పీల్చుకోగలుగుతాం. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది.
ఏడాదికి: పొగతాగేవారితో పోలిస్తే.. గుండెపోటు ముప్పు సగానికి తగ్గిపోతుంది.
ఐదేళ్లకు: స్ట్రోక్ ప్రమాదం.. ధూమపానం చేయనివారితో సమాన స్థాయికి చేరుతుంది.
పదేళ్లకు: ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే ముప్పు 50ు తగ్గిపోతుంది. ఇతర క్యాన్సర్ల బారిన పడే ముప్పు కూడా గణనీయంగా తగ్గుతుంది.
పదిహేనేళ్లు: గుండెజబ్బులు, గుండెపోటు బారిన పడే ముప్పు.. ఎప్పుడూ ధూమపానం చేయనివారితో సమానం అవుతుంది.