Morning Coffee: కాఫీ విషయంలో డాక్టర్ సూచన.. నెట్టింట రేగుతున్న కలకలం
ABN , Publish Date - Nov 22 , 2025 | 06:59 PM
ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగొచ్చంటూ ఓ డాక్టర్ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ పోస్టుతో షాకయిపోయిన జనాలు తమ సందేహాలను ఆయన ముందుంచారు. వాటిల్లో చాలా ప్రశ్నలకు డాక్టర్ ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉదయాన్నే కాఫీ తాగాలని చాలా మందికి ఉంటుంది. కానీ పరగడుపున కాఫీ తాగేందుకు చాలా మంది సందేహిస్తుంటారు. దీని వల్ల ఎసిడిటీ వస్తుందని, హార్మోన్ల సమతౌల్యత దెబ్బతింటుందని నమ్ముతారు. జీర్ణవ్యవస్థ పాడవుతుందని భయపడతారు. అయితే, ఇలాంటి భయాలేమీ పెట్టుకోకుండా ఉదయం పరగడుపున కాఫీ తాగొచ్చంటూ ఓ డాక్టర్ పెట్టిన పోస్టు నెట్టింట కలకలం రేపుతోంది (Liver Doc on Early Morning Coffee).
హెపటాలజిస్ట్ అయిన డా. సిరియాక్ అబీ ఫిలిప్స్ నెట్టింట లివర్ డాక్‌గా పాప్యులర్. నిత్యం అనేక పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన కాఫీ విషయంలో పెట్టిన పోస్టుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది సందేశాలను కూడా ఆయన నివృత్తి చేశారు.
కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ వచ్చినట్టు అనిపిస్తోందని ఓ వ్యక్తి తెలిపారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని ఆ నెటిజన్‌కు లివర్ డాక్ సూచించారు. కాఫీతో ఎసిడిటీకి అవకాశం తక్కువని, ఇందుకు ఇతర కారణాలు ఉండొచ్చని అన్నారు.
ఉదయం పరగడుపున కాఫీ తాగితే డోపమైన్ లెవెల్స్ ఎగుడుదిగుడు అవ్వొచ్చని కొందరు అన్నారు. అయితే, ఇలాంటి భావన పూర్తిగా తప్పు అని లివర్ డాక్ స్పష్టం చేశారు.
చక్కెర వేసిన కాఫీలో ప్రయోజనాలు తక్కువేమో అనే సందేహాన్ని కొందరు వెలిబుచ్చారు. అయితే, చక్కెర వేసినా వేయకపోయినా కాఫీ ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ఇక కప్పు కాఫీ తాగి జిమ్‌లో కసరత్తులు చేస్తే అదనపు ప్రయోజనాలు కలుగుతాయని కొందరు అన్నారు. ఈ వాదనను లివర్ డాక్ నిర్ద్వంద్వంగా తోసి పుచ్చారు. దీనికి బదులు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న పానీయాలు మెరుగైన ఫలితాలు ఇస్తాయని చెప్పారు.
రోజుకు ఎన్ని కప్పుల కాఫీ అయినా తాగొచ్చా? అని ఓ వ్యక్తి ప్రశ్నించారు. అలా అస్సలు చేయొద్దని లివర్ డాక్ సమాధానం ఇచ్చారు. రోజుకు ఐదు కప్పులకు మించి కాఫీ అస్సలు తాగొద్దని అన్నారు. ఇలా నెటిజన్లకు కలిగిన అనేక సందేహాలు తీర్చడంతో ప్రస్తుతం ఈ టాపిక్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
కూలిన తేజస్ జెట్.. పాక్ జర్నలిస్టు సంబరం.. షాకింగ్ వీడియో
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ