Share News

Salt Consumption: ఉప్పును తెగ వాడేస్తున్న ఇండియన్స్.. రోజు ఎంత తీసుకుంటున్నారో తెలుసా..

ABN , Publish Date - Jul 13 , 2025 | 09:03 PM

భారతీయుల రోజువారీ జీవితం గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఓ సంచలన విషయాన్ని తెలిపింది. అది ఏంటంటే ఇండియన్స్ రోజు తీసుకోవాల్సిన దాని కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నారని స్పష్టం చేసింది. దీని వల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది.

Salt Consumption: ఉప్పును తెగ వాడేస్తున్న ఇండియన్స్.. రోజు ఎంత తీసుకుంటున్నారో తెలుసా..
Salt Consumption

భారతీయుల గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఓ షాకింగ్ విషయాన్ని తెలిపింది. దేశంలో అనేక మంది తెలియకుండానే పరిమితికి మంచి ఉప్పు తీసుకుంటున్నారని (Salt Consumption) వెల్లడించింది. దీని వల్ల రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ వంటి సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఇది క్రమంగా నిశ్శబ్ద మహమ్మారిగా తయారవుతుందని హెచ్చరించింది. ఈ క్రమంలో మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే వ్యాధుల బారిన పడక తప్పదని సూచించింది.


ఎంత ఉప్పు సురక్షితం?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. కానీ, భారతదేశంలో ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు సగటున రోజుకు 9.2 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారు. ఇది సిఫారసు చేసిన పరిమితి కంటే దాదాపు రెట్టింపు అని చెప్పవచ్చు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో అయితే సగటు ఉప్పు వినియోగం 5.6 గ్రాములుగా ఉంది. ఇది కూడా సురక్షిత స్థాయి కంటే ఎక్కువే. కానీ నగరాలతో పోల్చుకుంటే మాత్రం గ్రామాల్లో వినియోగం తక్కువగా ఉంది.


ఉప్పు తగ్గించేందుకు కొత్త ప్రయత్నం

ఈ సమస్యను పరిష్కరించేందుకు ICMR, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (NIE).. పంజాబ్, తెలంగాణలో మూడేళ్ల ఉప్పు తగ్గింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా కమ్యూనిటీ ఆధారిత ఆహార సలహా కార్యక్రమాల ద్వారా సోడియం తీసుకోవడం తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేస్తున్నారు. అధిక ఉప్పు వినియోగం రక్తపోటుకు ప్రధాన కారణం అవుతుందని NIE సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శరణ్ మురళి తెలిపారు. తక్కువ సోడియం ఉప్పును ఉపయోగించడం వల్ల రక్తపోటు సగటున 7/4 mmHg తగ్గుతుందని ఆయన అన్నారు.


ఆరోగ్యకరమైన పరిష్కారం

తక్కువ సోడియం ఉప్పు (Low-Sodium Salt - LSS)లో సోడియం క్లోరైడ్‌ను పాక్షికంగా పొటాషియం లేదా మెగ్నీషియంతో భర్తీ చేస్తారు. ఇది ఒక ఆశాజనక పరిష్కారంగా ఉంటుంది. అయితే, దీని లభ్యత, ధర ప్రజలకు పెద్ద సవాలుగా ఉన్నాయి. చెన్నైలో 300 రిటైల్ దుకాణాల్లో నిర్వహించిన సర్వేలో కేవలం 28% దుకాణాల్లోనే LSS అందుబాటులో ఉంది.

సూపర్‌ మార్కెట్లలో 52% దుకాణాలు దీనిని అందిస్తున్నప్పటికీ చిన్న కిరాణా దుకాణాల్లో కేవలం 4% మాత్రమే దీనిని విక్రయిస్తున్నాయి. LSS ధర సాధారణ ఉప్పు కంటే రెట్టింపు. 100 గ్రాములకు రూ.5.6, సాధారణ ఉప్పు రూ.2.7తో పోలిస్తే. LSS లభ్యత తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం డిమాండ్ లేకపోవడం అని అంటున్నారు. ఇది అవగాహన లోపాన్ని సూచిస్తుంది.


అవగాహన పెంచేందుకు

ఈ సమస్యపై అవగాహన పెంచేందుకు, NIE #PinchForAChange అనే సోషల్ మీడియా క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం రోజువారీ ఆహారంలో దాగి ఉన్న ఉప్పు గురించి ప్రజలకు తెలియజేస్తూ, తక్కువ సోడియం ప్రత్యామ్నాయాలను ఉపయోగించమని ప్రోత్సహిస్తుంది. ఇది కేవలం ఉప్పు తగ్గించడం గురించి మాత్రమే కాదు.. ఆహారపు అలవాట్లను మార్చడం, ఆరోగ్య అవగాహనను పెంచడం, అలాగే గుండె సమస్యలను తగ్గించుకోవడాన్ని సులభతరం చేయడం గురించని చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 09:17 PM