Honey Bee venom: తేనెటీగల విషం రొమ్ము క్యాన్సర్‌కు ఔషధంగా పనిచేస్తుందా? తాజా అధ్యయనంలో సంచలన విషయాలు.!
ABN , Publish Date - Jul 30 , 2025 | 01:20 PM
తేనెటీగ విషం రొమ్ము క్యాన్సర్‌కు ఔషధంగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, తేనెటీగల విషం నిజంగా రొమ్ము క్యాన్సర్‌కు ఔషధంగా పనిచేస్తు్ందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: తేనెటీగను ఇంగ్లీషులో హనీ బీ అంటారు. ఇవి పువ్వుల నుండి మకరందాన్ని సేకరించి తేనెను ఉత్పత్తి చేసే కీటకాలు. ఇవి సామాజిక జీవులు. ఇవి పెద్ద సమూహాలుగా తేనెపట్టులలో నివసిస్తాయి. తేనెటీగల్లో రకాలు కూడా ఉన్నాయి. రాణి తేనెటీగ, మగ తేనెటీగ, పనిచేసే తేనెటీగలు. తేనెటీగలు పువ్వుల నుండి మకరందం, పుప్పొడిని తింటాయి. తేనెటీగలు పర్యావరణానికి, వ్యవసాయానికి, మానవాళికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి తేనెను ఉత్పత్తి చేస్తాయి.
తేనెలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సహజ స్వీటెనర్ మాత్రమే కాదు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. తేనె రోగనిరోధక శక్తిని పెంచడానికి, గాయాలను నయం చేయడానికి, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ, తేనెటీగ కుడితే, సాధారణంగా ఆ ప్రదేశంలో నొప్పి, వాపు, ఎరుపు ఏర్పడతాయి. కొందరికి తేనెటీగ విషానికి అలర్జీ ఉండడం వలన తీవ్రమైన ప్రతిచర్యలు కూడా రావచ్చు. అలాంటప్పుడు, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
అయితే, శాస్త్రవేత్తలు తేనె మాత్రమే కాదు.. తేనెటీగలు కుట్టడంలో ఉండే విషం కూడా ఓ శక్తివంతమైన ఔషధంగా పనిచేయగలదని తేల్చారు. తేనెటీగ విషం రొమ్ము క్యాన్సర్‌కు ఔషధంగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్ట్రేలియాలోని హ్యారీ పెర్కిన్స్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు చేసిన అధ్యయనంలో, తేనెటీగల విషంలో ఉండే మెలిటిన్ అనే ఒక ప్రత్యేకమైన పదార్థం (పెప్టైడ్) రొమ్ము క్యాన్సర్ కణాలను తక్కువ సమయంలో నాశనం చేయగలదని తేలింది. ముఖ్యంగా ఇది ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ (TNBC) అనే అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ రకాన్ని ఎదుర్కోవడంలో చాలా ప్రభావవంతంగా పనిచేసింది. ఈ రకం క్యాన్సర్‌ను చికిత్స చేయడం చాలా కష్టం.
అధ్యయనంలోని ముఖ్యాంశాలు:
మెలిటిన్ తక్కువ సమయంలో క్యాన్సర్ కణాల మెంబ్రేన్‌ను ధ్వంసం చేస్తుంది.
క్యాన్సర్ కణాల పెరుగుదల నియంత్రించే సిగ్నల్స్‌ను నిలిపేస్తుంది.
సాధారణ కణాలపై మెలిటిన్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది, అంటే ఇది టార్గెట్‌గా క్యాన్సర్ కణాలపై మాత్రమే పని చేస్తుంది.
కీమోథెరపీ మందులతో మెలిటిన్‌ను కలిపి ఉపయోగిస్తే, మందులు క్యాన్సర్ కణాల్లోకి బాగా చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది.
ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో క్యాన్సర్ పెరుగుదల తగ్గినట్టు తేలింది.
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన పెర్త్‌లోని తేనెటీగల నుండి సేకరించిన విషం ఎక్కువ ప్రభావవంతంగా కనిపించింది. అదే సమయంలో, బంబుల్బీ తేనెటీగల విషం క్యాన్సర్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు.
శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
తేనెటీగల విషంలోని మెలిటిన్‌ను ఔషధంగా ఉపయోగించాలంటే ఇంకా మరిన్ని పరిశోధనలు అవసరమని చెబుతున్నారు. మోతాదు, భద్రత, దీర్ఘకాల ప్రభావాలు వంటివన్నీ పరిశీలించాల్సిన అంశాలేనని చెప్పారు. తేనెటీగల విషం సహజంగా లభించే శక్తివంతమైన ఔషధ పదార్థంగా భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే అవకాశం ఉందని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఇది పూర్తిగా సక్సెస్ అయితే రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కొత్త యుగానికి నాంది కావచ్చన్నారు.
Also Read:
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ మోసాలపై జాగ్రత్త.!
కట్ చేసిన అవకాడోను తాజాగా ఎలా ఉంచాలి?
For More Lifestyle News