Heart Health Study: అధిక ఫ్యాట్ పాలు తాగితే గుండె ఆరోగ్యం పాడవుతుందా.. నిజాలు తేల్చేసిన నిపుణులు..
ABN , Publish Date - Nov 07 , 2025 | 09:11 PM
పాలు, పాల ఉత్పత్తులు వినియోగించే వారిపై కార్డియా ఓ అధ్యయనం చేసింది. యుక్త వయస్సులో ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులు వినియోగించినప్పుడు వారి గుండె ధమనుల్లో క్యాల్షియం పేరుకుపోవడానికి గల సంబంధాన్ని సైంటిస్టులు పరిశోధించారు. ఎందుకంటే దమనుల్లో క్యాల్షియం పేరుకుపోవడం అనేది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: పాలు, పాల ఉత్పత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు సహా శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు వీటి నుంచి లభిస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లల ఎదుగుదలకు పాలు ఎంతగానో తోడ్పడతాయి. అయితే, చాలా మందిని ఓ భయం ఏళ్ల తరబడి నుంచి వెంటాడుతోంది. అధికంగా ఫ్యాట్ ఉన్న పాలు తాగితే దమనుల్లో కొవ్వు పేరుకుపోయి గుండె సంబంధిత సమస్యలు వస్తాయని ఆందోళనకు గురవుతుంటారు. అయితే, ఇందులో ఎంతవరకు నిజముందనే విషయాలను పరిశోధకులు తేల్చేశారు. తాజాగా జరిగిన అధ్యయనంలో దీనికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పాలు, పాల ఉత్పత్తులు వినియోగించే వారిపై కార్డియా (Coronary Artery Risk Development in Young Adults) ఓ అధ్యయనం చేసింది. యుక్త వయస్సులో ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులు వినియోగించినప్పుడు వారి గుండె ధమనుల్లో క్యాల్షియం పేరుకుపోవడానికి గల సంబంధాన్ని సైంటిస్టులు పరిశోధించారు. ఎందుకంటే దమనుల్లో క్యాల్షియం పేరుకుపోవడం అనేది గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అయితే, ఫుల్ ప్యాట్ పాలు గుండెకు ఎలాంటి నష్టం కలిగించకపోగా దమనుల్లో కాల్షియం పేరుకుపోకుండా కొంతమేర రక్షణ కల్పిస్తుందని తేల్చారు.
1980 దశకం నుంచి 3 వేల మందికి పైగా వ్యక్తులను ఈ పరిశోధనలో భాగం చేశారు. దాదాపు 25 ఏళ్లపాటు వారిపై అధ్యయనం చేశారు. ప్రయోగంలో పాల్గొన్న 3,110 మందిలో కేవలం 904 మందిలోనే క్యాల్షియం పేరుకుపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత పరిశోధకులు మరింతగా అధ్యయనం చేసి వారి ఆహారపు అలవాట్లను పరిశీలించగా.. ఫుల్ ఫ్యాట్ పాలు, పాల ఉత్పత్తులు తీసుకున్న వారి దమనుల్లో క్యాల్షియం అతి తక్కువగా పేరుకుపోయిందని గుర్తించారు. దీంతో తక్కువ ఫ్యాట్ కలిగిన పాలు, పాల ఉత్పత్తులు వాడిన వారితో పోలిస్తే ఎక్కువగా ఫ్యాట్ ఉన్న పాలు, పెరుగు, చీజ్ వంటివి వాడిని వారిలో నష్టం తక్కువగా ఉందని తేల్చారు.
అయితే, ఫుల్ ఫ్యాట్ పాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఈ అధ్యయనం నిరూపించలేదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనం కేవలం ఫ్యాట్ పాలు, పాల ఉత్పత్తులు వినియోగించే వారి దమనుల్లో పేరుకుపోయే క్యాల్షియం గురించి మాత్రమే వివరిస్తుందని అంటున్నారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జన్యు సంబంధ అంశాలు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని సూచిస్తున్నారు. సమతుల్య ఆహారంతోపాటు పాల ఉత్పత్తులు తీసుకోవాలే కానీ అధికంగా వాటిని వియోగించమూ మంచిది కాదని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
భారతీయుల్లో ఎక్కువగా కనిపించే బానపొట్ట! కారణం ఇదేనా..
బీపీ ఏ మేరకు పెరిగితే హార్ట్ ఎటాక్ ముప్పు మొదలవుతుందంటే..