Cancer: ఆర్థిక ఇబ్బందుల్లో క్యాన్సర్ రోగుల కుటుంబాలు
ABN , Publish Date - Apr 09 , 2025 | 10:43 PM
క్యాన్సర్ రోగుల కుటుంబాలు చికిత్స కోసం అయ్యే భారీ ఖర్చుల వల్ల ఆర్థిక ఇబ్బందుల్లోకి జారిపోతున్నట్లు కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ అండర్‌స్టాండింగ్ (సీఐఈయూ) నివేదిక తెలిపింది.

ముంబయి: క్యాన్సర్ రోగుల కుటుంబాలు చికిత్స కోసం అయ్యే భారీ ఖర్చుల వల్ల ఆర్థిక ఇబ్బందుల్లోకి జారిపోతున్నట్లు కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ అండర్‌స్టాండింగ్ (సీఐఈయూ) నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం, భారతదేశంలో క్యాన్సర్ చికిత్స ఖర్చులు సామాన్య రోగులకు అందుబాటులో ఉండాలని ఢిల్లీకి చెందిన ఈ సంస్థ సూచించింది. ఏటా వివిధ రోగాల కారణంగా 3.2 నుంచి 3.9 కోట్ల మంది ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్నారని అంచనా. అధిక వైద్య ఖర్చులు, తక్కువ బీమా సదుపాయాలు కుటుంబాలపై తీవ్ర ఒత్తిడిని చూపుతున్నాయి. ఖరీదైన బయోలాజిక్ ఔషధాలకు ప్రత్యామ్నాయంగా, తక్కువ ధరలో లభించే బయోసిమిలర్లను ప్రోత్సహించాలని సీఐఈయూ సిఫారసు చేసింది. ఈ బయోసిమిలర్లు భారతీయులకు సరసమైన ధరలో చికిత్స అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నివేదిక వెల్లడించింది. 2022లో ఆరోగ్య రంగంలో వ్యక్తిగత ఖర్చు వాటా దాదాపు 63 శాతంగా నమోదైంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలలో ఒకటిగా ఉంది. సొంత ఖర్చులు ఎక్కువ కావడం, బీమా సహాయం సరిపడకపోవడం వల్ల లక్షల మంది ఆర్థికంగా కుంగిపోతున్నారని సీఐఈయూ పేర్కొంది. బయోసిమిలర్లు తక్కువ ఖర్చుతో క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులకు చికిత్స అందించే అవకాశాన్ని కల్పిస్తాయని నివేదిక హైలైట్ చేసింది.
పెరుగుతున్న జీవనశైలి రుగ్మతలు..
దేశంలో ప్రాణాంతక వ్యాధులతో పాటు జీవనశైలి సంబంధిత రుగ్మతల సంఖ్య కూడా పెరుగుతోంది. 2022 నాటికి సుమారు 42 శాతం వయోజనులు మరియు వృద్ధులు ఏదోఒక వ్యాధితో జీవిస్తున్నారు. రక్తపోటు, మధుమేహం వంటివి ఇందులో సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతుండటం వల్ల సరసమైన చికిత్స అవసరం మరింత ఎక్కువైంది. బయోసిమిలర్లు, బయోలాజిక్ ఔషధాలను సమానంగా పనిచేస్తూ, తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయని నివేదిక విశ్లేషించింది. “క్యాన్సర్, ఆటోఇమ్యూన్ వ్యాధుల వంటి సంక్లిష్ట పరిస్థితులకు చికిత్స ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో బయోసిమిలర్లు రోగులకు ఆర్థిక భారాన్ని తగ్గించి, చికిత్సను సులభతరం చేస్తాయి” అని నివేదిక వివరించింది. బయోసిమిలర్ల వాడకం చికిత్స ఖర్చులను తగ్గించడమే కాకుండా, ఎక్కువ మందికి వైద్య సేవలను అందుబాటులోకి తెస్తుంది. అయితే, పేటెంట్ ఎవర్‌గ్రీనింగ్ వంటి అడ్డంకులు బయోసిమిలర్ల లభ్యతను ఆలస్యం చేస్తున్నాయి. ఔషధ సంస్థలు చిన్న మార్పులతో పేటెంట్లను పొడిగిస్తుండటం ఈ ప్రక్రియకు అడ్డుగా నిలుస్తోంది. ఈ సమస్యను అధిగమించడంలో భారతీయ చట్టాలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఇంకా సవాళ్లు మిగిలే ఉన్నాయని నివేదిక సూచించింది.