Hyderabad IT Employees: హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల్లో 84 శాతం మందికి ఫ్యాటీ లివర్ వ్యాధి.. నివేదికలో సంచలన విషయాలు..
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:08 PM
హైదరాబాద్‌లోని దాదాపు 84 శాతం ఐటీ ఉద్యోగులు మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (MAFLD)తో బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి JP నడ్డా ఇటీవల లోక్‌సభకు తెలిపారు. అయితే, ఇందుకు సంబంధించిన కారణాలు ఏవో, నివేదికలో ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్:హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 84 శాతం మందికి ఫ్యాటీ లివర్ వ్యాధి (Fatty Liver Disease) ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల లోక్‌సభలో వెల్లడించారు. ప్రత్యేకంగా హైదరాబాదు, బెంగళూరు వంటి ఐటీ హబ్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులలో 71 శాతం మంది ఊబకాయంతో (బరువు ఎక్కువగా ఉండటం) బాధపడుతున్నారు. 34 శాతం మందికు మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్య ఉంది. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే పరిస్థితి. ఉదాహరణకు గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, కాలేయం (లివర్) పాడయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
కారణాలు ఏమిటి?
నిపుణుల ప్రకారం, ఈ ఆరోగ్య సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు:
ఎక్కువసేపు కూర్చొని పని చేయడం
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆరోగ్యానికి హానికరమైన ఆహారం తినడం
అధిక పని ఒత్తిడితో జీవించడం
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు:
ఈ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని ప్రోగ్రామ్‌లు చేపట్టింది. ముఖ్యంగా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ (NP-NCD). దీని కింద వివిధ రకాల జాగ్రత్తలు, స్క్రీనింగ్‌లు, అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారం గురించి అవగాహన పెంచుతుంది. వ్యాయామం, బరువు నియంత్రణ గురించి ప్రచారం చేస్తోంది.
గ్రామీణ ప్రాంతాలకు ఫ్యాటీ లివర్ వ్యాధి
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నివేదిక ప్రకారం, ఫ్యాటీ లివర్ వ్యాధి (MAFLD) ఇప్పటి వరకూ పట్టణాల్లో ఎక్కువగా కనిపిస్తుండగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం, దీనిని సమర్థంగా ఎదుర్కొనడానికి రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తోంది.
నిపుణుల హెచ్చరిక:
ఫ్యాటీ లివర్ వ్యాధులు తప్పనిసరిగా శ్రామికశక్తి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. దీర్ఘకాలంలో దేశ ఆరోగ్య గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి, ప్రజలందరూ కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ కొంతసేపు వ్యాయామం చేయాలి
ఆహారపు అలవాట్లపై జాగ్రత్త. మితంగా, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి
ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
ఒత్తిడి తగ్గించుకునే అలవాట్లు ( యోగా, మెడిటేషన్) చేయాలి
ప్రజల ఆరోగ్యం దేశ అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
ఈ వంటమనిషికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా సాటిరాలేరు.. మహిళా లాయర్ పోస్టు వైరల్
ప్రపంచంలో 13 దేశాల్లో నాస్తికుల మెజారిటీ.!