Nagrota Bypoll Result: నగ్రోటాలో బీజేపీ విజయ కేతనం.. దేవయానీ రాణా విక్టరీ
ABN , Publish Date - Nov 14 , 2025 | 03:11 PM
బీజేపీ ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుందని, నగ్రోటాతో పాటు బిహార్ ఎన్నికల్లో సాధించిన విజయమే ఇందుకు నిదర్శనమని గెలుపు అనంతరం దేవయాని రాణా వ్యాఖ్యానించారు.
శ్రీనగర్: జమ్మూ (Jammu)లోని నగ్రోటా (Nagrota) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా (Devyani Rana) కీలక విజయం నమోదు చేసుకున్నారు. జమ్మూ అండ్ కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (JKNPP) అధ్యక్షుడు హర్ష్ దేవ్ సింగ్‌పై 24,647 ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. దాంతో జమ్మూ జిల్లాలోని కీలకమైన నగ్రోటా సీటును బీజేపీ తిరిగి నిలబెట్టుకుంది. మొత్తం 11 రౌండ్లు కౌంటింగ్ జరగగా, ప్రతి రౌండ్‌లోనూ దేవయాని రాణా ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చారు.
గెలుపే బీజేపీ లక్ష్యం
బీజేపీ ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుందని, నగ్రోటాతో పాటు బిహార్ ఎన్నికల్లో సాధించిన విజయమే ఇందుకు నిదర్శనమని గెలుపు అనంతరం దేవయాని రాణా మాట్లాడుతూ అన్నారు. తన తండ్రి, దివంగత ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణాను ఆదరించిన ప్రజలే తనకు ఈ గెలుపును కట్టబెట్టటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. దేవేందర్ సింగ్ రాణా మరణంతో నగ్రోటాలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజకీయ వారసురాలిగా దేవయాని రాణాను బీజేపీ ఎన్నికల బరిలోకి దింపింది. జేకేఎన్‌పీపీ తరఫున హర్ష్ దేవ్ సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున మరో మహిళా అభ్యర్థి షపీమ్ బేగం పోటీలో ఉన్నప్పటికీ కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి బీజేపీ లీడింగ్ కొనసాగి అంతిమంగా విక్టరీని చేజిక్కించుకుంది.
నగ్రోటాలో నవంబర్ 11న జరిగిన పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 75 శాతం పోలింగ్ నమోదైంది. ఇంత భారీ సంఖ్యలో ఓటర్లు హాజరుకావడంతో జమ్మూలో భవిష్యత్తులో జరగబోయే రాష్ట్ర స్థాయి ఎన్నికలకు మంచి సంకేతంగా బీజేపీ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఎన్డీయే విజయోత్సాహం.. పార్టీ ప్రధానకార్యాలయానికి మోదీ
ఆపేదెవరు.. బీహార్‌లో నితీశ్ ఏకఛత్రాధిపత్యం..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..