Chirag Paswan: ఎగసిన యువ కెరటం.. బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ సూపర్ షో..
ABN , Publish Date - Nov 14 , 2025 | 02:27 PM
బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అసాధారణ పోరాటం చేసింది. ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌జేపీ దాదాపు 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.
ఊహించినట్టుగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. 200కు పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే కూటమిని బలంగా ముందుకు తీసుకెళ్లారు. అయితే ఈ హేమాహేమీల మధ్య ఓ యువ కెరటం కూడా బలంగా తన ఉనికిని చాటుకుంది. తాజా ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అసాధారణ పోరాటం చేసింది. ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించింది (Chirag Paswan Bihar).
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌జేపీ దాదాపు 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాలనూ ఈ పార్టీ గెలుచుకుంది. బీహార్ రాజకీయాల్లో ఒక గొప్ప నాయకుడైన రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని ఆయన తనయుడు చిరాగ్ నిలబెట్టుకునే దిశగా సాగుతున్నారు. ప్రధాని మోదీ, సీఎం నితీశ్‌తో సమానంగా 43 ఏళ్ల చిరాగ్ కూడా బీహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. అయితే చిరాగ్ రాజకీయ ప్రస్థానం అనుకున్నంత సులభంగా సాగలేదు (LJP leader Chirag).
2020 అసెంబ్లీ ఎన్నికల్లో 130 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌జేపీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. ఓట్ల షేర్ అంశంలో మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ సీట్లు మాత్రం సాధించలేకపోయింది. అయితే ఆ ఎన్నికల్లో అనేక సీట్లలో జేడీయూ ఓట్లను దెబ్బతీసింది. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ తరహాలో చిరాగ్ పాశ్వాన్‌కు చర్మిషా లేదంటూ రాజకీయ నేతలు, ప్రజలు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ చిరాగ్ వెనకడుగు వేయకుండా కష్టపడ్డారు. ప్రజలతో మమేకయ్యారు (Bihar election performance).
2024 లోక్‌సభ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది (Bihar political landscape). పోటీ చేసిన 5 స్థానాల్లోనూ గెలిచింది. అంత విజయం సాధించినప్పటికీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ 20 స్థానాలకు మించి ఎల్‌జేపీకి ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో చిరాగ్.. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీతో చర్చలు ప్రారంభించారు. చివరకు ఎన్డీయే పక్షాలు దిగి వచ్చి చిరాగ్ పార్టీకి 29 స్థానాలు కేటాయించాయి. ఎన్డీయే ప్రభుత్వంలో చిరాగ్ పాశ్వాన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.
ఇవీ చదవండి:
ఆపేదెవరు.. బీహార్‌లో నితీశ్ ఏకఛత్రాధిపత్యం..
అమిత్ షా చెప్పింది నిజమే.. బీహార్‌లో ఎన్డీయే కూటమి ఆధిక్యం 180 ప్లస్..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..