Bihar Elections 2025: ఆర్జేడీ ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ప్రభావం.. తేజస్వి ఏమన్నారంటే
ABN , Publish Date - Nov 07 , 2025 | 09:40 PM
ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతే ఇందుకు కారణమనే అభిప్రాయం సహజంగా వినిపిస్తుంటుంది. అయితే అది అన్నివేళలా నిజం కాదని గత రెండేళ్లలో జరిగిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ రికార్డు స్థాయిలో 64.65 శాతం నమోదు కావడంతో గతం కంటే పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి కలిసొస్తుంది, ఏ పార్టీకి ప్రతికూలం కానుందనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) జన్‌సురాజ్ పార్టీ తొలిసారి ఎన్నికల్లో అడుగుపెట్టింది. ఆ ప్రభావం ఎన్డీయే, మహాగఠ్‌బంధన్ కూటమిలోని ఎవరి అవకాశాలను గండికొట్టే అవకాశం ఉందనే అంశపై చర్చకు తెరలేపింది. దీనిపై ఆర్జేడీ నేత, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) తాజాగా స్పందించారు. ఆర్జేడీ ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఎంతమాత్రం ఉండదని చెప్పారు.
'గత ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ వల్ల మాకు మేలు జరిగిందని అనేవాళ్లు ఉన్నారు. ఈసారి ప్రశాంత్ కిషోర్ మా ఓట్లు కొల్లగొడతారని మరికొందరు ఊహాగానాలు చేస్తుండొచ్చు, అయితే అదేమీ లేదని నేను చెప్పదలచుకున్నాను. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. బిహార్ మార్పు కోరుకుంటోంది' అని తేజస్వి తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ లోక్ జన్‌శక్తి పార్టీ (LJP) ఒంటరిగా ఎన్నికల్లో దిగింది. దీంతో జేడీయూ ఓట్లు చీలి పలుచోట్లు అతి తక్కువ తేడాతో ఆ పార్టీ ఓటమి చవిచూసింది. ఈసారి ఎన్డీయే కూటమిలో చిరాగ్ పాశ్వాన్ పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. ఇదే సమయంలో 'జన్ సురాజ్' పార్టీ 'ఎల్‌జేపీ పాత్ర' తీసుకుందని చాలామంది అంచనాగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ జన్ సురాజ్ పోటీ చేస్తోంది. తృతీయ ప్రత్యామ్నాయంగా నిలిచే సత్తా తమకుందని ప్రశాంత్ కిషోర్ పదేపదే చెబుతున్నారు.
కొత్త వ్యవస్థ రాబోతోంది..
బిహార్‌లో మార్పు రాబోతోందని తొలి విడత పోలింగ్ అనంతరం ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. నవంబర్ 14 (కౌంటింగ్ డే) కొత్త సిస్టమ్ ఏర్పాటు కాబోతోందని తెలిపారు. అయితే నిరుద్యోగులు, విద్యావంతులైన మధ్యతరగతి యువకుల మొగ్గు ప్రశాంత్ కిషోర్‌కు ఉందని, ఆమేరకు ప్రధాన కూటముల ఓట్లకు జన్ సురాజ్ వల్ల ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉండొచ్చని పరిశీలకులు చెబుతున్నారు.
ఓటింగ్ శాతం పెరగడానికి ప్రభుత్వ వ్యతిరేకతే కారణమా?
ఓటింగ్ శాతం పెరిగితే అందుకు ప్రభుత్వ వ్యతిరేకతే కారణమనే అభిప్రాయం సహజంగా వినిపిస్తుంటుంది. అయితే అది అన్నివేళలా నిజం కాదని గత రెండేళ్లలో జరిగిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఆ మాటెలా ఉన్నా.. తేజస్వి మాత్రం ఒకటే బలంగా చెబుతున్నారు. పోలింగ్ సరళిపై ప్రతిచోట తనకు మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అవినీతి నుంచి బిహార్‌కు విముక్తి కలగాలని, ఐటీ, టెక్స్‌టైల్, ఫుడ్ ప్రోసెసింగ్, ఆగ్రో-బేస్డ్ ఇండస్ట్రీలకు బీహార్ హబ్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎంపీ ఖాతాలోంచి రూ.56 లక్షలు దోచేశారు
రహస్య అణు పరీక్షలు పాక్‌కు కొత్తకాదు... స్పందించిన భారత్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి