Share News

Bihar Elections Poll Survey: ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ.. ఆర్జేడీకి ఎదురుదెబ్బ

ABN , Publish Date - Nov 11 , 2025 | 08:31 PM

ఈసారి ఆర్జేడీ, కాంగ్రెస్ గెలిచే సీట్లు తగ్గవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఆ ప్రకారం చూసినప్పుడు గత ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్ సాధించిన సీట్లు ఈసారి తగ్గే అవకాశం ఉంది.

Bihar Elections Poll Survey: ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ.. ఆర్జేడీకి ఎదురుదెబ్బ
Bihar Exit polls

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. మెజారిటీ సర్వేలు ఎన్డీయేకు పట్టం కట్టాయి. 243 సీట్లలో 122 సీట్లు గెలుచుకున్న కూటమికి మెజారిటీ దక్కుతుంది. దైనిక్ జాగరణ్, మాట్రిజ్, పీపుల్స్ ఇన్‌సైట్, చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్ సహా తొమ్మిది ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. 130 నుంచి 167 వరకూ సీట్లు ఎన్డీయే దక్కించుకుంటుందని అంచనా వేశాయి. మహాగఠ్‌బంధన్‌కు 73 నుంచి 108 సీట్లు దక్కే అవకాశాలున్నాయని తెలిపాయి. ఎగ్జిట్ పోల్ అంచనాల యావరేజ్‌ను బట్టి ఎన్డీయే 147 సీట్లు వరకూ దక్కించుకుంటుంది. గ్రాండ్ అలయెన్స్ 90 వరకూ గెలుచుకుంటుంది.


సొంతంగా గెలుచుకునే సీట్లకూ కోత

ఈసారి ఆర్జేడీ, కాంగ్రెస్ గెలిచుకునే సీట్లు తగ్గవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఆ ప్రకారం చూసినప్పుడు గత ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్ సాధించిన సీట్లు ఈసారి తగ్గే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఆర్జేడీ 75 సీట్లు గెలిచి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. అయితే ఈసారి ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాల ప్రకారం ఆ సంఖ్య 57 నుంచి 69 సీట్ల మధ్య ఉండొచ్చు. కాంగ్రెస్ గతంలో 19 సీట్లు గెలుచుకోగా ఈసారి 14 సీట్లకు మించకపోవచ్చు. తక్కువలో తక్కువగా 11 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి.


ఏకైక పెద్ద పార్టీగా..

కాగా, ఈసారి బీజేపీ 67 నుంచి 70 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ ప్రకారం ఆర్జేడీ కంటే సొంతంగా బీజేపీ ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే బిహార్‌లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచే అవకాశం ఉంటుంది. ఆర్జేడీకి ప్రతిపక్ష హోదాకు ఢోకా లేనప్పటికీ ఏకైక పెద్ద పార్టీ హోదా మాత్రం బీజేపీకి కోల్పోవలసి ఉంటుంది. కాగా, నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ గత సారి కంటే ఈసారి మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తోంది. గత ఏడాది 43 సీట్లు జేడీయూకు రాగా, ఈసారి 58 నుంచి 71 సీట్లు గెలుస్తామని భావిస్తోంది. ఎన్డీయే కూటమిలో భాగంగా ఈసారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో 101 స్థానాల్లో పోటీ చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏమేరకు నిజమవుతాయనేది నవంబర్ 14న తేలనుంది. ఆరోజే బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

బీహార్ NDA హవా.. సర్వేలన్నీ నితీష్ కుమార్ వైపే.!

ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 11 , 2025 | 08:51 PM