Share News

P. Chidambaram : త్రిభాషా విద్యలో హిందీ తప్పనిసరా?

ABN , Publish Date - Mar 01 , 2025 | 05:24 AM

నిష్కారణ యుద్ధాలు ఒక ఉన్నత లక్ష్య సాధనకు సంకల్పించినవి కావు, కాబోవు. అవి పక్షపాత పూరితమైనవి అవడం కద్దు. తాము విశ్వసించే భావజాలానికి మద్దతుగా చేసే యుద్ధాలవి.

P. Chidambaram : త్రిభాషా విద్యలో హిందీ తప్పనిసరా?

నిష్కారణ యుద్ధాలు ఒక ఉన్నత లక్ష్య సాధనకు సంకల్పించినవి కావు, కాబోవు. అవి పక్షపాత పూరితమైనవి అవడం కద్దు. తాము విశ్వసించే భావజాలానికి మద్దతుగా చేసే యుద్ధాలవి. భారతీయ జనతా పార్టీకి ఇటువంటి నిష్కారణ యుద్ధాలు ప్రారంభించే ప్రవృత్తి బాగా ఉన్నది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అందుకు మంచి ఉదాహరణలు. ఒక అవసరాన్ని తీర్చేందుకు ఉద్దేశించబడినవి కావు ఆ చట్టాలు. హిందువులు, హిందూయేతర మతస్థుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం, విభేదాలు సృష్టించే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌– భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ చట్టాలకు ఎనలేని ప్రాధాన్యమిచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం మరో నిష్కారణ యుద్ధానికి శంఖారావం చేసింది. ఈ తాజా యుద్ధం భాషమీద. ‘త్రిభాషాసూత్రం’ (టీఎల్‌ఎఫ్‌) పేరున ఉన్న పాఠశాల విద్యా విధానాన్ని తొలుత రాధాకృష్ణన్ కమిటీ ప్రతిపాదించింది. ఏ రాష్ట్రమూ దానిని అంగీకరించలేదు, అమలుపరచలేదు. ప్రతిపాదన ప్రతిపాదనగానే ఉండిపోయింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. స్వాతంత్ర్య తొలి సంవత్సరాలలో పాఠశాలల నిర్మాణానికి, ఉపాధ్యాయుల నియామకానికి ప్రభుత్వాలు సహజంగా ప్రథమ ప్రాధాన్యమిచ్చాయి. బాలలు అందరినీ బడులల్లో చేర్పించేందుకు, వారి విద్యాభ్యాసం పాఠశాల విద్య పూర్తయ్యే దాకా కొనసాగేలా చేసేందుకు ద్వితీయ ప్రాధాన్యమిచ్చారు. ఆ తరువాత, కేవలం భాషలు నేర్పడంలోనే కాకుండా గణితం, విజ్ఞానశాస్త్రం, చరిత్ర, భూగోళశాస్త్రం, సాంఘికశాస్త్రం మొదలైన విషయాలలో కూడ బోధన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఆ విద్యా కర్తవ్యాలు అసంపూర్ణంగా, అసఫలంగా మిగిలిపోలేదూ?


భాషా బోధన ఒక ప్రమాదకర అంశంగా పరిణమించింది. అందుకు కారణం విద్యా సంబంధితమైనది కాదు. రాజ్యాంగ అధికరణ 343 వల్ల ఆ సమస్య ఏర్పడింది హిందీ దేశ అధికార భాషగా ఉంటుందని, అయితే ఇంగ్లీషు 15 సంవత్సరాల వరకు పాలన, బోధనా భాషగా కొనసాగుతుందని ఆ అధికరణ పేర్కొంది. ఆ 15 సంవత్సరాల గడువు 1965లో ముగిసింది. ఆ నాటి కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా జనవరి 26, 1965 నుంచి హిందీ ఏకైక అధికార భాష అవుతుందని ప్రకటించింది. హిందీయేతర భాషల వారు తక్షణమే తీవ్రంగా ప్రతిస్పందించారు. నిరసించారు. ఉద్యమించారు. హిందీ వ్యతిరేకత దావానలమయింది. తమిళనాడు భగ్గుమంది. ఒక ద్రావిడ పార్టీ అధికార కేతనం ఎగురవేసింది. హిందీయేతర భాషాలవారు కోరుకున్నంతవరకు ఇంగ్లీషు సహ అధికార భాషగా కొనసాగుతుందని దేశ ప్రజలకు జవహర్‌లాల్‌ నెహ్రూ హామీ ఇచ్చారు. 1965లో అధికార భాషా సంక్షోభం ముమ్మరమయిన దశలో ఇందిరాగాంధీ, అవును ఆమె ఒక్కరు మాత్రమే, ధైర్యంగా, సాహసోపేతంగా హిందీ దురభిమానులను ధిక్కరించారు. విజ్ఞతతో వ్యవహరించారు. దేశ ప్రజలకు తన తండ్రి నెహ్రూ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఆ హామీకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. విజ్ఞత ఉన్న రాజనీతిజ్ఞత అది.


అది నెహ్రూ హామీయే అయినా అంతకంటే ఎక్కువగా, ముఖ్యంగా పరిపాలనా ఆవశ్యకతలు అధికారభాషలుగా హిందీ, ఇంగ్లీషుకు కట్టుబడి ఉండేలా చేశాయి. ఇతర భారతీయ భాషల వలే హిందీ కూడా సమగ్రంగా వికసించిన భాష కాదు. సైన్స్‌, న్యాయశాస్త్రం, ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు, ఇంజినీరింగ్‌, విదేశీ సంబంధాలు, అంతర్జాతీయ వ్యవహారాలు మొదలైన వాటిని సమర్థంగా నిర్వహించేందుకు వెసులుబాటు లేని భాష. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాసన నిర్మాణానికి, పాలనా వ్యవహారాల నిర్వహణకు ఇంగ్లీషు మీదనే ఆధారపడ్డాయి.

ఇదిలావుండగా ప్రభావశీలమైన పర్యవసానాలు బహుముఖీనంగా ఉన్న మూడు పరిణామాలు సంభవించాయి. అవి: ఒకటి– 1975లో ‘విద్య’ను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చడం. దీనివల్ల పాఠశాల విద్యకు సంబంధించినంతరవకు రాష్ట్రాల స్వతంత్ర ప్రతిపత్తికి తీవ్ర విఘాతం కలిగింది; రెండు– 1991లో మన దేశం ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలను ఆమోదించి, అనుసరించడం; దీనివల్ల ఇంగ్లీష్‌ భాష ప్రాబల్యాన్ని అంగీకరించడం అనివార్యమయింది; మూడు– మరిన్ని ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నేర్పాటు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేయడం. ఈ డిమాండ్‌ మరింత అధికంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.


సరే, ప్రస్తుత వివాదం నూతన విద్యా విధానం–2020 లోని వివిధ విషయాలకు, ముఖ్యంగా త్రిభాషా సూత్రంకు సంబంధించినది. ఈ త్రిభాషా సూత్రం ప్రకారం ప్రాంతీయ/ రాష్ట్ర భాషను పాఠశాలల్లో ‘ప్రథమ’ భాషగా బోధించాలి. ఇంగ్లీషు ‘ద్వితీయ’ భాష. అయితే ‘మూడో’ భాష ఏమిటి? కేంద్ర విద్యామంత్రి చిత్తశుద్ధి లేని వాగాడంబర వాదన ఒకటి చేశారు. నూతన విద్యా విధానం ఒక జాతీయ విధానం కనుక ప్రతి రాష్ట్రమూ ఆ విధానాన్ని అమలుపరచడం రాజ్యాంగ విహితమైన బాధ్యత అని ఆయన అన్నారు. అంతేకాకుండా పాఠశాల బాలలకు మూడో భాష కూడా బోధించాలని నూతన జాతీయ విద్యా విధానం నిర్దేశించిందని. అయితే ఆ మూడో భాష విధిగా హిందీ అని స్పష్టీకరించలేదని పేర్కొన్నారు. మరి తమిళనాడు జాతీయ విద్యా విధానాన్ని అమలుపరిచేందుకు, మూడో భాష బోధించేందుకు తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నించడంలో ఆయన చాలా అమాయకత్వాన్ని అభినయించారు.


ధర్మేంద్ర ప్రసాద్‌ ప్రశ్నకు సమాధానాలు స్పష్టమే: (1) నూతన విద్యా విధానం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానం మాత్రమే. అది రాజ్యాంగ నిర్దేశితమైనది కాదు; (2) తమిళనాడులో ప్రభుత్వాలు మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం ప్రభుత్వ పాఠశాలల్లో రెండు భాషల బోధన, మూడు కాదు. రెండు భాషల బోధన మాత్రమే జరగాలని తమిళనాడు ప్రభుత్వాలే కాకుండా తమిళ పౌర సమాజమూ గట్టిగా కోరుతున్నది. అయితే ప్రైవేట్‌ పాఠశాలలు మూడో భాషగా హిందీ బోధించడం పట్ల తమిళనాడు ప్రభుత్వాలు ఎప్పుడూ ఎటువంటి అభ్యంతరం తెలుపలేదు. అవరోధమూ కల్పించలేదు. తమిళనాడులో సీబీఎస్‌ఈ (642), ఐసీఎస్‌ఈ (77), ఐబీ(8)కి అనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలల్లోను మూడో భాషగా హిందీ బోధిస్తున్నారు. వేలాది బాలలు హిందీ నేర్చుకుంటున్నారు. దక్షిణ్‌ భారత్‌ హిందీ ప్రచార్‌ సభ ఇత్యాది విద్యా సంస్థల ద్వారా లక్షలాది బాలలు హిందీ నేర్చుకోవడానికి తమిళనాడు ప్రభుత్వాలు ఏ విధంగాను అడ్డుపడడం లేదు.


నూతన విద్యా విధానం–2020లో మంచి అంశాలూ ఉన్నాయి, అంగీకారయోగ్యం కాని విషయాలూ ఉన్నాయి. ఎన్‌ఈపీలోని వివాదాస్పద విషయాలలో ఒకటి త్రిభాషా సూత్రం. దీన్ని హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలలో అమలుపరచడం లేదు. అయితే హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలలో ఈ త్రిభాషా సూత్రాన్ని అమలుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు, కాదు, అమలు జరిపేలా ఒత్తిడి చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా రాష్ట్రాలలోని ప్రభుత్వ పాఠశాలలో హిందీ మాత్రమే బోధించే ఏక భాషా విధానాన్ని సార్థకంగా అనుసరిస్తున్నారని మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఉత్తరాది రాష్ట్రాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న బాలలు మరే ఇతర భాషను నేర్చుకోవడం లేదు. కారణమేమిటి? ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులు కొద్ది మంది మాత్రమే ఉండగా హిందీయేతర భారతీయ భాషలను బోధించే ఉపాధ్యాయులు అసలు లేనేలేరని చెప్పడం సత్య దూరం కాదు. ప్రైవేట్‌ పాఠశాలలు సైతం సంతోషంగా ప్రభుత్వ పాఠశాలలనే అనుసరిస్తున్నాయి. హిందీ భాషను మాత్రమే బోధిస్తున్నాయి. ఆంగ్ల భాష బోధిస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నప్పటికీ అవేవీ బాలలకు మూడో భాషను నేర్పడం లేదు. మూడో భాష బోధిస్తున్న పాఠశాలలూ లేకపోలేదు. ఆ మూడో భాష ప్రతి చోటా నిశ్చయంగా సంస్కృతమే. పంజాబ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలల్లో మూడో భాషగా హిందీ బోధిస్తున్నారు. పంజాబీ, గుజరాతీ, మరాఠీ భాషలకు హిందీ సన్నిహిత బంధుత్వం ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే. సరే, ఈ విషయాలు అలా ఉంచితే ఆంగ్ల భాషా బోధన ప్రమాణాలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. నాణ్యత పూర్తిగా కొరవడిన బోధనా పద్ధతులతో మన బాలలు ఆ అంతర్జాతీయ భాషను ప్రశస్తంగా నేర్చుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఇంగ్లీషు బోధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న బాలలు ఆంగ్ల భాషా తరగతి గది వెలుపల ఆ భాషను ఒక్క ముక్క కూడా మాట్లాడలేరు, చదవలేరు, అర్థం చేసుకోలేరు, రాయలేరు. ఇదొక కఠోర సత్యం. తమిళనాడుతో సహా అన్ని రాష్ట్రాలకూ ఈ సత్యం వర్తిస్తుంది.


త్రిభాషా సూత్రాన్ని అంగీకరించి అమలుపరచాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్‌ సతాయిస్తున్నారు. త్రిభాషా సూత్రం పేరిట మూడో భాషగా హిందీ నేర్పాలన్నదే ఆయన ఉద్దేశం, నిర్దేశం కూడా. దక్షిణాది రాష్ట్రంపై ఇటువంటి ఒత్తిడి తెచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రెండు భాషల (ప్రాంతీయ భాష, ఇంగ్లీషు) బోధనను పరిపూర్ణంగా విజయవంతం చేయాలి. మన సమాజంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యాలు ప్రశస్తంగా ఉన్నవారు చాలా చాలా తక్కువ. వ్యవహారిక ఇంగ్లీషు మాట్లాడగలిగే వారే తక్కువ కాగా మంచి ఇంగ్లీషు మాట్లాడగలిగేవారు చాలా అరుదు. త్రిభాషా సూత్రం ప్రకారం రెండో భాషగా అంగీకృతమైన ఇంగ్లీషును ఉత్కృష్ట ప్రమాణాలతో బోధింపచేయడంలో ఘోరంగా విఫలమయిన ప్రభుత్వం దేశవ్యాప్తంగా బాలలకు మూడో భాష నేర్పడంలో సంపూర్ణంగా సఫలమయ్యేందకు ఎందుకు ఆరాటపడుతోంది?

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Mar 01 , 2025 | 05:28 AM