Share News

Shiva Essence: ఆ తత్త్వం ఊహాతీతం

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:04 AM

శివతత్త్వం అత్యంత నిగూఢమైనది, దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆత్మ పరిశుద్ధి అవసరం. శివుడు త్యాగానికి, క్షమకు, నిజమైన భక్తికి ప్రతీకగా నిలుస్తాడు

Shiva Essence: ఆ తత్త్వం ఊహాతీతం

చింతన

శివతత్త్వం నిగూఢమైనది, ఊహాతీతమైనది. దాన్ని పూర్తిగా, లోతుగా అర్థం చేసుకోవడం సులభం కాదు. బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు, విష్ణువు నడిపిస్తాడు. శివుడు లయం చేసుకుంటాడు. ‘లయం చేసుకోవడం’ అంటే ముక్తిని ప్రసాదించడం. ఆ ముక్తి కోసమే మునులు నిరంతరం తపస్సు చేస్తారు. ఆదిదేవుడు చాలా అమాయకుడు. భక్తులు అడిగినవన్నీ... అర్హత కూడా చూడకుండా ఇచ్చేస్తూ ఉంటాడు. దాన్ని సజ్జనులు ముక్తిని పొందడానికి ఉపయోగించుకుంటారు. దుర్మార్గులు దాన్ని స్వలాభం కోసం వాడుకొని... వికృత చేష్టలు, చెడ్డ పనులు చేస్తూ, విలాసాలలో గడిపేస్తారు. శంకరుడు త్యాగశీలి. అందుకే క్షీరసాగర మథనంలో పుట్టిన హాలాహలాన్ని స్వీకరించి, తన గళంలో బంధించాడు. మహావిష్ణువేమో అతిలోక సౌందర్యవతి, సంపద స్వరూపమైన లక్ష్మీదేవిని స్వీకరించాడు.


నిరాడంబరుడు...

లోకాలను ఏలే విశ్వనాథుడికి తలపై కిరీటం కూడా ఉండదు. ఒంటికి బూడిద రాసుకొని, పులిచర్మాన్ని వస్త్రంగా ధరించి, ఎద్దును వాహనంగా చేసుకొని, కొండల మీద నిత్యం ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయనకు సర్పాలే ఆభరణాలు. జటాజూటమే అలంకారం. ఇలాంటి వేషధారణతోనే పార్వతీదేవిని పెళ్ళి చేసుకోవడానికి వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ‘‘ఈ అర్థనగ్న పురుషుడా... లోకోత్తర సౌందర్యవతి అయిన పార్వతీదేవికి కాబోయే భర్త’’ అని. చివరకు పార్వతీదేవి కూడా కాస్త చిరాకుపడింది. అప్పుడు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు ఆ పరమేశ్వరుడి పాదాలకు నమస్కరించి, పవిత్ర జలాలతో కాళ్ళు కడిగి, భక్తిపూర్వకంగా పెళ్ళి పీటలపైకి నడిపించాడు. మహా జ్ఞాని అయిన విష్ణువుకు తెలుసు... ముల్లోకాలూ పరమేశ్వరుడి పాదధూళికి సరిపోవని. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే... మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ద్వేషం, కోపం ఉన్నచోట ఆయన ఉండలేడు. దయ, క్షమాగుణం ఉన్న చోటే ఈశ్వరుడు ఉంటాడు. ఈ గుణాలు లేకుండా... ‘నేను ప్రతిరోజూ పంచాక్షరీ పారాయణం చేస్తాను, పక్కింట్లో కోసిన పూలతో పూజ చేస్తాను, బిందెల కొద్దీ నీళ్ళతో అభిషేకం చేస్తాను’ అంటే కుదరదు. అది శుద్ధ దండుగ. ఈశ్వరుడు ఎంత అభిషేక ప్రియుడైనా... ఆయనకు కమండలంలో కాసిన్ని నీళ్ళు చాలు. ఇక పూలంటే అర్థం ‘నీ హృదయం అనే పుష్పం’ అని. అంతేతప్ప - దొరుకుతున్నాయి కదా అని ఓ బండెడు పూలు, పత్రాలు తెచ్చి స్వామి ఆలయాన్ని నింపెయ్యకూడదు.


అర్ధనారీశ్వర పరమార్థం

ఇక, అర్ధనారీశ్వర తత్త్వంలోని పరమార్థం ఏమిటంటే... అది భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమానురాగాలకు ప్రతీక. ఏ కాపురంలో భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం, ప్రేమానురాగాలు ఉంటాయో... అక్కడ పరమేశ్వరుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. పార్వతికి శివుడు తన ఎడమవైపే ఎందుకు స్థానం ఇచ్చాడు? మన శరీర భాగాలలో అత్యంత విలువైనది గుండె (హృదయం) అని మనకు తెలుసు. అందుకే పార్వతిని తన హృదయంలో దాచుకున్నాడు. అంతేకాదు, హృదయ స్థానం మాతృమూర్తికి ప్రతీక. అందుకే తల్లిని గౌరవించే ఎవరికైనా ఈశ్వర కృప మెండుగా ఉంటుంది.

లోకాలను ఏలే విశ్వనాథుడికి తలపై కిరీటం కూడా ఉండదు. ఒంటికి బూడిద రాసుకొని, పులిచర్మాన్ని వస్త్రంగా ధరించి, ఎద్దును వాహనంగా చేసుకొని, కొండల మీద నిత్యం ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయనకు సర్పాలే ఆభరణాలు.

-డాక్టర్‌ కసుమర్తి నాగేశ్వరరావు


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 12:04 AM