Devotional: చరిత్రాత్మక ‘స్కంధ’ పుష్కరిణి...
ABN , Publish Date - Nov 23 , 2025 | 09:35 AM
చోళ రాజులు వారసులుగా కార్వేటినగర సంస్థానాదీశులు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. సుమారు 300 ఏళ్ల క్రితం వారు తవ్వించిన అతి పెద్ద పుష్కరిణి ఇప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండటం విశేషం.
ఏదైనా దేవాలయానికి వెళితే... భక్తులు అక్కడి పుష్కరిణిలో స్నానమాచరించడం సర్వసాధారణం. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద పుష్కరిణిగా ‘స్కంధ పుష్కరిణి’కి పేరుంది. కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన దాని విశేషాలే ఇవి...
చోళ రాజులు వారసులుగా కార్వేటినగర సంస్థానాదీశులు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. సుమారు 300 ఏళ్ల క్రితం వారు తవ్వించిన అతి పెద్ద పుష్కరిణి ఇప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండటం విశేషం.

6.25 ఎకరాల్లో...
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పుష్కరిణిగా భావించే ‘స్కంధ పుష్కరిణి’ చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండల కేంద్రంలో ఇది ఉంది. దీని పరిధి మొత్తం 14 ఎకరాలు కాగా... పుష్కరిణి మాత్రమే 6.25 ఎకరాల్లో విస్తరించి ఉంది. చోళ రాజుల వారసులుగా పేర్కొనే కార్వేటినగర సంస్థానంలో విపరీతమైన కరవు ఏర్పడినప్పుడు... అక్కడి ప్రజలు వలస వెళ్లకుండా ఉండేందుకు వెంకట పెరుమాళ్ రాజావారు ఈ పుష్కరిణిని తవ్వించినట్టుగా చరిత్రకారులు చెబుతారు.
దీనిని తవ్వినవారికి నాణేలను కూలీగా ఇచ్చేవారట. అంటే ఈ లెక్కన అప్పట్లోనే ఉపాధిహామీ పథకాన్ని అమలు చేసినట్లుగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పుష్కరిణిని నాలుగు వైపులా కచ్చితమైన కొలతలతో నిర్మించగా, ఎటు చూసినా నీళ్లు ఒకే ఎత్తులో కనిపించడం విశేషం. మెట్లపై వివిధ కళా చిత్రాలతో ఆ రోజుల్లోనే చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ప్రజల తాగునీటి అవసరాల కోసం తవ్వించిన ఈ పుష్కరిణి అనంతర కాలంలో వేణుగోపాలస్వామి, సుబ్రమణ్యస్వామి దేవాలయాలకు పుష్కరిణిగా మారి భక్తులకు సేవలందిస్తోంది. ఇది విశాలంగా, స్వచ్ఛమైన నీటితో ఉండటంతో భక్తులను, పర్యాటకుల్ని అమితంగా ఆకర్షిస్తోంది. ఈ చారిత్రక స్కంధ పుష్కరిణి ప్రస్తుతం టీటీడీ పరిధిలో ఉంది.

అనేక వేడుకలకు వేదిక...
ఇక్కడ ఏటా రెండుసార్లు వేణుగోపాలస్వామి, సుబ్రమణ్యస్వామి తెప్పోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడికిసమీపంలోనే ఉన్న ద్రౌపది ఆలయ ఉత్సవాలకు ఇక్కడి నుంచే అలుగును అత్యంత భక్తిశ్రద్ధలతో తీసుకెళతారు. ప్రతీ ఏడాది నిర్వహించే అగ్ని తిరునాళ్ల ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు అగ్నిని తొక్కడానికి... ఇక్కడి నుంచే అలంకరణ చేసుకుని వెళతారు. అయ్యప్ప మాల వేసినవారు కూడా రోజూ ఈ పుష్కరిణిలోనే పవిత్ర స్నానాలు చేస్తారు.
రాజా వారి ప్యాలెస్... పాఠశాలగా...
ఈ పుష్కరిణితో పాటు కార్వేటినగరం మండలంలోనే వేణుగోపాలస్వామి ఆలయాన్ని, రాజా ప్యాలెస్‌ను వెంకటపెరుమాళ్ రాజావారు నిర్మించినట్లు చెబుతారు. ఆ సంస్థానాధీ శుల చివరి వారసుడు కుమారస్వామి రాజా, ప్యాలెస్‌ను ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విరాళంగా ఇచ్చేశారు. ప్రస్తుతం అక్కడ ‘రాజా కుమారస్వామి రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల’ పేరుతో హైస్కూల్ నడుస్తోంది. ఈయన పుత్తూరు నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యేగా పనిచేసి, 1952లో మరణించారు. ఈయన 1940 మార్చి నుంచి 1951 వరకు కార్వేటినగర సంస్థానాన్ని పాలించారు. అప్పటికి తెలుగు రాష్ట్రం ఏర్పడలేదు. మద్రాసు ప్రెసిడెన్సీలోనే ఆయన ఎమ్మెల్యేగా చేశారు. తవ్వించి వందల ఏళ్లు గడిచినా... అలనాటి చరిత్రాత్మక స్కంధ పుష్కరిణిలో స్నానమాచరించేందుకు భక్తులు, పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు.
- కరీముల్లా షేక్, చిత్తూరు
ఫొటోలు: శివకుమార్