శ్రావణ మాసం.. సర్వ శుభ ప్రతిరూపం
ABN , Publish Date - Jul 27 , 2025 | 10:14 AM
వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో శ్రావణ మాసంలో ప్రతీరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ప్రతీ శుక్రవారం ఇల్లాళ్లు మహాలక్ష్ముల్లా కళకళలాడుతూ... తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

వ్రతాలు, పూజలు, శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో శ్రావణ మాసంలో ప్రతీరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ప్రతీ శుక్రవారం ఇల్లాళ్లు మహాలక్ష్ముల్లా కళకళలాడుతూ... తమ కుటుంబం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు చేకూరుతాయన్నది నమ్మకం.
విష్ణుమూర్తి శ్రవణా నక్షత్ర సమయంలో ఆవిర్భవించాడు. ఈ మాసంలోనే ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడుగా, హయగ్రీవుడుగా ఉన్నాడు. విశేషమేమంటే మాఘమాసంలో ఆదివారాలు, కార్తీక మాసంలో సోమవారాలు, మార్గశిరమాసంలో గురువారాలు... ఇలా ఒక్కో మాసంలో ఒక్కో రోజు పవిత్రదినాలుగా భావిస్తారు. కానీ శ్రావణ మాసంలో అన్ని రోజులూ పవిత్రమైనవే.
ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారాల్లో గురుదేవుని ఆరాధన, శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు, శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవుణ్ణి పూజించడం తరతరాల నుంచి సాంప్రదాయంగా వస్తోంది. రోజూ చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీపౌర్ణమి, హయగ్రీవ జయంతి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య వంటి పండుగలు వస్తాయి. వీటితో ఈ మాసమంతా సందడిగా మారుతుంది.
పంచామృతాలతో శివునికి అభిషేకం
శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు అన్నింటినీ శివాభిషేకానికి కేటాయిస్తారు. ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేేస్త సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఆ నమ్మకంతోనే అభిషేకం చేసి ఉపవాస దీక్షలు చేపట్టి... తాంబూలం, దక్షిణ ఇచ్చి శివుడికి హారతిస్తారు. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త, కలువ, తుమ్మి వంటి శివుడికి ఇష్టమైన పూలతో పూజలు చేయడం పరిపాటి.
మంగళగౌరీ వ్రతం
శ్రావణమాసంలో మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారుచేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైనవారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. మంచి భర్త రావాలని అవివాహితలు, తమ వైవాహిక బంధం చక్కగా సాగాలని వివాహితలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.
శ్రావణమాసం మొదలైన అయిదో రోజున వచ్చే పండుగ నాగపంచమి నాడు శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం ఆచారం. ఈ రోజు పాలు, మిరియాలు, పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, శిల, చెక్కలతో చేసిన నాగ పడగలకు అభిషేకం చేస్తారు.
శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పర్వదినం వరలక్ష్మీ వ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని చేస్తుంటారు. పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆయురారోగ్యాలు బాగుంటాయని విశ్వాసం. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరించి... వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు వాయనాలిచ్చి, ఆశీస్సులు తీసుకుంటారు. సాయంత్రం వేళ పేరంటం చేసి తాంబూలం, శనగలు పంచిపెడతారు. ప్రతీ ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా భావించి గౌరవిస్తారు.
శ్రావణ పౌర్ణమి
యజ్ఞపవీత ధారణ సంప్రదాయం ఉన్న వారు శ్రావణ పౌర్ణమినాడు నూతన యజ్ఞపవీతాన్ని ధరిస్తారు. శ్రావణ పౌర్ణమినాడు రాఖీ పౌర్ణమి, రక్షాబంధన ఉత్సవం చేస్తారు. అన్నాచెల్లెళ్ల అనురాగ బంధాల ప్రతీక ఇది. అన్నివేళల తమకు రక్షణగా నిలవాలని కోరుకుంటూ స్ర్తీలు సోదరుల ముంజేతికి రాఖీ కట్టి ఆశీస్సులు అందుకుంటారు. సోదరులకు తీపి తినిపించి ప్రేమతో ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని భక్తులు కోలహలంగా నిర్వహించుకుంటారు. శ్రావణ బహుళ అష్టమి తిథి రోజున వచ్చే శ్రీకృష్ణుని పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు. చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా ఈ వేడుకను చేస్తారు. సాయంత్రం వేళలో నైవేద్య కార్యక్రమాలు పూర్తయ్యాక ఉట్టి గట్టి ఆనందోత్సాహాల నడుమ పాల్గొంటారు.
శ్రావణ మాసం మొత్తం ఇలా పండుగలు, వ్రతాలు, నోములతో అలరారుతుంది. ఈ మాసంలో ప్రతి రోజూ పండగే అయినా వరలక్ష్మీవ్రతం, శ్రావణ పౌర్ణమి, కృష్ణాష్టమి వంటి పర్వదినాల నాటి సందడి చూసి తీరాల్సిందే.
- శ్రీమల్లి, 98485 43520