Devotional: అటు ఆధ్యాత్మికం... ఇటు పర్యాటకం... ఎక్కడంటే...
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:15 PM
మధ్యప్రదేశ్‌లోని అద్భుత అందాలు చూసేందుకు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సరైన సమయం. భారతదేశానికి సరిగ్గా మధ్య భాగంలో ఉండటంతో ‘హార్ట్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. సుమారు 800 దాకా పెద్దపులులు అభయారణ్యాల్లో ఉండటంతో ‘టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా’గా మధ్యప్రదేశ్ ప్రసిద్ధి.
ఖజురహో వంటి పురాతన ఆలయాలు... కన్హా, బంధవ్‌గడ్ వంటి జాతీయ ఉద్యానవనాలు... గ్వాలియర్, ఓర్చా వంటి చారిత్రక కోటలు... మహాకాళేశ్వర, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు... ఇండోర్ సరఫా బజార్... మధ్యప్రదేశ్‌కు వెళితే చారిత్రక, ప్రాచీన, ఆధ్యాత్మిక, ఆధునిక మేళవింపుతో మనసుదోచే ఆకర్షణలు ఎన్నో. ఆ విశేషాలే ఇవి...
మధ్యప్రదేశ్‌లోని అద్భుత అందాలు చూసేందుకు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సరైన సమయం. భారతదేశానికి సరిగ్గా మధ్య భాగంలో ఉండటంతో ‘హార్ట్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. సుమారు 800 దాకా పెద్దపులులు అభయారణ్యాల్లో ఉండటంతో ‘టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా’గా మధ్యప్రదేశ్ ప్రసిద్ధి. దేశంలోనే వజ్రాలను ఉత్పత్తి చేసే ఏకైక ‘డైమండ్ మైన్’ ఈ రాష్ట్రంలోనే ఉంది. గిరిజన జాతుల సాంప్రదాయాలు, వారు ఉపయోగించే వస్తువులు నేటితరానికి తెలియజేసేందుకు భోపాల్ నగరంలో ఏర్పాటు చేసిన ‘ట్రైబల్ మ్యూజియం’ సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. నాటి గిరిజన జాతుల సంప్రదాయాలు, పనిముట్లు, వాటి తయారీ, వారి కళలు, గిరిజన నృత్యాలు, దేవతామూర్తుల విగ్రహాలు... ఇలా ఎన్నో అద్భుతాలను ఈ మ్యూజియంలో చూడొచ్చు.

ఆలయాలు... అభయారణ్యాలు...
మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయాలు ఆధ్యాత్మికతకు నెలవుగా మారాయి. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, నర్మదా నదిపై ఉన్న ఓంకారేశ్వర్ ఆలయం, మధ్యయుగ ఆలయాలలో అతిపెద్దదైన ఖజురహో ఆలయ సముదాయం, అన్నపూర్ణ ఆలయం, చౌసత్ యోగిని, హర్సిద్దిమాత, మహేశ్వర్ ఆలయాలను దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ‘గాంధీ సాగర్ అభయారణ్యం’ ప్రకృతి అందానికి మారుపేరుగా నిలిచే అద్భుత ప్రదేశం. రాజస్థాన్ రాష్ట్ర సరిహద్దులను ఆనుకుని సువిశాలంగా ఉన్న ఈ అభయారణ్యంలో సఫారీ పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతి మిగులుస్తుంది.

చంబల్ నది ఈ అభయారణ్యం వద్ద రెండుగా చీలి ప్రవహిస్తుంది. ఇది పర్యాటకులకు ఒక ఆకర్షణీయ ప్రదేశంగా మారింది. భోపాల్ నగరానికి మధ్యలో ఉన్న ‘వన్ విహార్ జాతీయ పార్కు’లో కొండపై నిలబడితే నగరం మొత్తాన్ని చూడొచ్చు. మధ్యప్రదేశ్‌లోని మరో పర్యాటక ప్రాంతం వింధ్య పర్వత శ్రేణుల్లో వెలసిన మాండూ పట్టణం. ఈ పట్టణంలో ఎక్కడ చూసినా ఎత్తయిన గుట్టలపై రాతితో నిర్మించిన పురాతన కోటలు, రాజప్రాసాదాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు కనిపిస్తాయి. సహజ ప్రకృతి సౌందర్యాలతోపాటు, చారిత్రక విశేషాలకు నెలవు మాండూ. మాండూలో జహాజ్ మహల్ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఓడను తలపించే భారీ రాతి కోట వాస్తు చాతుర్యం, శిల్పకళా నైపుణ్యం ప్రతీ ఒక్కరిని కట్టిపడేస్తుంది. రెండు తటాకాల మధ్య ఉన్న మహల్ దూరం నుంచి చూస్తే నీటిలో తేలియాడుతున్న ఓడలాగా కనిపిస్తుంది.
ప్రకృతి అందాలకు నెలవు ‘పచ్ మఢీ’...
ఎత్తైన కొండలు, కొండల నడుమ లోతైన లోయలు, కొండల పైనుంచి పాలనురుగులా జాలువారే జలపాతాలు, దట్టమైన అడవులు, అడవుల్లో యధేచ్ఛగా సంచరించే వన్యప్రాణులు, కొండ గుహల్లో ప్రాచీన మానవులు చిత్రించిన చిత్రాలు... ఇలా ఎటు చూసినా ప్రకృతి గీసిన చిత్రాల్లాంటి దృశ్యాలకు నెలవు మధ్యప్రదేశ్‌లోని ‘పచ్ మఢీ’. పాంచ్ (ఐదు) మఢీ (గుహాలు) అనే అర్ధంలో వచ్చిందే పంచ్ మఢీ. పాంచ్మఢీ కాలక్రమంలో పచ్ మఢీగా మారిపోయింది. సాత్పుర పర్వతశ్రేణుల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశం ‘దుప్గడ్ వ్యూ పాయింట్’. పచ్ మఢీ చుట్టూ విస్తరించిన ‘సత్పురా జాతీయ అభయారణ్యం’లో అరుదైన జాతులకు చెందిన వృక్షాలు, వన్యప్రాణులు కనిపిస్తాయి.

‘ఇండియన్ జాయింట్ స్క్విర్రల్’గా పిలిచే ఉడతలతో పాటు పులులు, చిరుతలు, ఇతర జంతుజాతులు ఈ అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరుగుతూ సఫారీకి వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తాయి. పంచ్‌మఢీలో ప్రకృతి అందాలతోపాటు అనేక చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలున్నాయి. వీటిలో జటాశంకర్ గుహలో వెలసిన శైవక్షేత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చౌరాగఢ్ శివాలయంలో ఏటా శివరాత్రినాడు జరిగే వేడుకలకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. పచ్ మఢీ సమీపంలోని భీమ్బెట్కా (భారీ ఆకారంలో భీముడు కూర్చున్నట్లు కనిపించే రాతి శిలలు), ఉదయగిరి గుహల్లో ప్రాచీన మానవులు చిత్రించిన అపురూప చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.
గౌతముడికి ‘సాంచీ’ గౌరవం..
భారతదేశంలోని పురాతనమైన, ప్రసిద్ధ బౌద్ధ కట్టడాల్లో ‘సాంచి’ ఒకటి. వందల ఏళ్లు గడిచినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. భారతీయ వాస్తు శిల్పం అద్భుతంగా నిలిచిన సాంచి సందర్శన పర్యాటకుల మదిని శాంతి మార్గం వైపు నడిపిస్తుంది. సాంచీ స్థూపాన్ని గౌతమ బుద్ధుడి గౌరవార్థం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించాడు. కాలక్రమంలో దెబ్బతిన్నా మరమ్మతులు చేశారు. మన జాతీయ చిహ్నమైన మూడు సింహాల గుర్తు ఈ స్తూపంలో ఉన్న అశోక స్తంభం నుంచే తీసుకున్నారు. స్తూపంపై ఉన్న బుద్ధుడి విగ్రహాలు, శిల్పాలు సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ స్తూపానికి నలు దిక్కుల నాలుగు ద్వారాలు ఉన్నాయి. ఇవి బుద్ధుడి జీవితం, జాతక కథలు, బుద్ధుడి జన్మవృత్తాంతాన్ని తెలియజేస్తాయి. సాంచి స్థూపాన్ని ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. సాయంత్రం వేళ ఇక్కడ జరిగే సౌండ్ అండ్ లైట్ షో ఆకట్టుకుంటుంది.
- యస్. సోమేశ్వర్, 98490 35654
పర్యాటకుల గమ్యస్థానం
మధ్యప్రదేశ్‌ను పర్యాటకుల గమ్యస్థానంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడ్డ నీటి వనరుల వద్ద టెంట్ సిటీలు నిర్మిస్తున్నాం. అలాగే వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రాబోయే కాలంలో నర్మదా నదిలో క్రూయిజ్ టూరిజానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ఈ క్రూయిజ్ ప్రయాణం పర్యాటకులకు గొప్ప అనుభూతినిస్తుంది. దేశంలోనే అతి పొడవైన క్రూయిజ్ ప్రయాణం ఇదే అవుతుంది. త్వరలోనే హెలీ టూరిజం సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
- శివ శేఖర్ శుక్లా,
మధ్యప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి