Share News

కోడె కడితే కోటి వరాలు..

ABN , Publish Date - Feb 23 , 2025 | 06:57 AM

దక్షిణకాశీగా... హరిహర క్షేత్రంగా... కోడెకడితే కోటి వరాలిచ్చే ఎములాడ రాజన్నగా... రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయం ప్రసిద్ధి. దక్షిణకాశీగా పేరుగాంచిన ఈ ప్రసిద్ధ శైవక్షేత్రం మహాశివరాత్రికి ముస్తాబవుతున్న సందర్భంగా ఆలయ విశేషాలివి...

కోడె కడితే కోటి వరాలు..

దక్షిణకాశీగా... హరిహర క్షేత్రంగా... కోడెకడితే కోటి వరాలిచ్చే ఎములాడ రాజన్నగా... రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయం ప్రసిద్ధి. దక్షిణకాశీగా పేరుగాంచిన ఈ ప్రసిద్ధ శైవక్షేత్రం మహాశివరాత్రికి ముస్తాబవుతున్న సందర్భంగా ఆలయ విశేషాలివి...

పూర్వం నారద మహాముని భూలోకంలో సంచరిస్తూ పాపాలతో బాధపడుతున్న జనాలను చూసి... వారికి పాప విముక్తి కల్పించమని పరమశివున్ని వేడుకుంటాడు. స్వామి మొదట కాశీలో ఆ తరువాత చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం మీదుగా వేములవాడలో ఉద్భవించినట్లు కథనాలు ఉన్నాయి. దక్షయజ్ఞంలో బాహువులు కోల్పోయిన సూర్యుడు ఇక్కడ ధర్మగుండంలో స్నానం ఆచరించి బాహువులు పొందాడని... అందుచేత దీనిని భాస్కర క్షేత్రంగా పిలుస్తారనే మరో కథనం ప్రాచుర్యంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని ‘చెంబులవాటిక’ అని పిలిచేవారు. అది కాలక్రమంలో వేములవాడగా మారిందట. ఈ ప్రాంతాన్ని క్రీ.శ 750 నుంచి 973 వరకు చాళుక్యరాజులు పాలించగా వారిలో మొదటి నరసింహుడికి రాజాదిత్య అనే బిరుదు ఉందని, ఆయన హయాంలో కట్టిన గుడి కనుక ఇక్కడ శ్రీస్వామివారు శ్రీరాజరాజేశ్వరుడు అయ్యారనేది మరో కథనం.


ధర్మగుండం విశిష్టత

వేములవాడ క్షేత్రంలో వున్న కోనేరును ధర్మగుండంగా పిలుస్తారు. రాజరాజనరేంద్రుడు కుష్టువ్యాధితో బాధపడుతూ ఈ క్షేత్రాన్ని సందర్శించి ధర్మగుండంలో స్నానం ఆచరించడంతో వ్యాధి నయం అయినట్లు స్థలపురాణం చెబు తోంది. అందుకే దీర్ఘకాలిక చర్మవ్యాధులతో బాధపడుతున్నవారు ధర్మగుండంలో స్నానాలు చేస్తే వ్యాధి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. స్వామివారి సన్నిధిలో నిద్రచేస్తామని మొక్కుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి, తడిదుస్తులతో స్వామిని దర్శించుకుని, తలనీలాలిస్తారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలతో మొక్కులు చెల్లించుకుంటారు.

book1.2.jpg


దేవతలకు నిలయం

వేములవాడలో శ్రీరాజరాజేశ్వర స్వామి వారితో పాటుగా అనుబంధంగా అనంతకోటి పద్మనాభస్వామి, శ్రీసీతారామస్వామి వారు వైష్ణవ దేవతామూర్తులు కొలువుదీరడం మరో విశేషంగా చెప్పవచ్చు. భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వర, కేదారేశ్వర, వేణు గోపాల స్వామి, మహాలక్ష్మీ, కనకదుర్గ, మామిడిపెల్లి శ్రీసీతారామచంద్రస్వామి, అగ్ర హారం శ్రీజోడాంజనేయస్వామి దేవాలయా లున్నాయి. రాజన్నను దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.


కోడెమొక్కుల రాజన్న...

రాజన్న ఆలయంలో తరతరాలుగా విశిష్టమైన ఆచారం ఉంది. సంతానం లేని దంపతులు తమకు కొడుకు పుడితే కోడెను కట్టేస్తామని మొక్కుకుంటారు. సంతానం కలిగిన తరువాత కోడె దూడను రాజన్నకు సమర్పించుకుంటారు. అలాగే పాడిపంటలు, పిల్ల పాపలు బాగుండాలని ఇంటివద్ద పెంచి పోషించిన కోడెలను రాజన్నకు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. కోడెమొక్కు చెల్లించుకుంటే కోటి వరాలు ఇస్తాడని భక్తుల నమ్మకం. రాజన్న ఆలయానికి చెందిన అద్దె కోడెలను టికెట్‌ తీసుకుని మొక్కు చెల్లించుకునే వెసులుబాటు ఉంది.

book1.jpg


అందుబాటులోకి ఆన్‌లైన్‌ సేవలు...

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇటీవల ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఆలయంలో శ్రావణ మాసంలో బ్రేక్‌దర్శనం ఉంటుంది. రాజన్న ప్రధాన ఆలయంతో పాటు భీమేశ్వర, నగరేశ్వర, బద్దిపోచమ్మ ఆలయాల్లో జరిగే శాశ్వత పూజల వివరాలు, వసతి గదులు, నిత్య పూజల వివరాలను ‘వేములవాడ డాట్‌ తెలంగాణ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌’ అనే వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు.

book1.4.jpg


ఎలా చేరుకోవాలి?

హైదరాబాద్‌ నుంచి 150 కిలోమీటర్లు, కరీంనగర్‌ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో వేములవాడ వుంది. రాజన్న ఆలయానికి హైదరాబాద్‌ నుంచి ప్రతి అరగంటకు, కరీంనగర్‌ నుంచి ప్రతి 10 నిమిషాలకు బస్సు సౌకర్యం వుంది.

- అమరగొండ కిషన్‌, వేములవాడ (కల్చరల్‌)

‘‘దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రిని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు వస్తారు. రాజన్న ఆలయ గుడి చెరువులోని పార్కింగ్‌ స్థలంలో శివార్చన వేదికను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.’’

- వినోద్‌రెడ్డి, ఆలయ ఈవో

Updated Date - Feb 23 , 2025 | 06:57 AM