Gratitude in Worship: కృతజ్ఞతే ఆరాధనకు ఆత్మ
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:01 AM
కృతజ్ఞత భావం లేకుండా ఆరాధనకు ప్రాణం ఉండదు. సృష్టికర్త ప్రసాదించిన ప్రతి వరానికీ మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి
సందేశం
కృతజ్ఞత మనం చేసే ఆరాధనలన్నిటికీ ఆత్మలాంటిది. ఎవరైనా మనకు మేలు చేస్తే, దాన్ని మనస్ఫూర్తిగా గుర్తిస్తూ, జ్ఞాపకం చేసుకుంటూ, ఆ మేలు చేసినవ్యక్తి పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. అదే విధంగా... ఈ సువిశాలమైన ప్రపంచాన్ని మనకోసం సృష్టించిన... విశ్వప్రభువైన అల్లాహ్ కు కృతజ్ఞతలు చెప్పుకోవడం కూడా మన విధి. మనం పీల్చే శ్వాస ఆయన వరప్రసాదమే. మనం జీవించడానికి అనువుగా ఎన్నో వనరులను మనకు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి ప్రతిక్షణం ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి. అలాంటి కృతజ్ఞతాభావం లేనివారిలో విశ్వాసం స్థిరంగా ఉండదు. వారి ఆరాధనల్లో సంకల్పశుద్ధి కూడా ఉండదు.
ముఖ్యమైన పునాది
మనలో ఆత్మను నింపి, కళ్ళను, చెవులను, హృదయాన్ని సమకూర్చిన అల్లాహ్‌కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని అంతిమ దివ్యగ్రంథమైన ఖుర్‌ఆన్ చెబుతోంది. దేవునికి, అతని దాసునికి మధ్య ఉండే సంబంధానికి ముఖ్యమైన పునాది కృతజ్ఞత. అది మనసా, వాచా, కర్మణా ఉండాలి. మనలో స్థిరపడాలి. దానికోసం మానవుడు తనకు దేవుడు ప్రసాదించిన వరాలను అనుక్షణం తలచుకుంటూ ఉండాలి. అందం, ఆరోగ్యం, సంపద, విద్య... ఇలా అనేక వరాలను సృష్టికర్త మానవుడికి ఇచ్చాడు. మనకు ఉన్న వనరులను ఉపయోగించుకొనే బుద్ధిబలాన్ని కూడా అందించాడు. అవి చూసుకొని ఆనందిస్తూ, గర్వపడుతున్న మనిషి... వాటిని ప్రసాదించిన సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలపడం మరచిపోతున్నాడు. మన హృదయంలో కృతజ్ఞతాభావాన్ని మేలుకొలపాలంటే... భగవంతుడు మనకు ఎన్నో మహాభాగ్యాలను ప్రసాదించాడనే భావన కలగాలి. ఆ భావనను ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుకోవాలి. నిత్యం దైవాన్ని స్మరించుకుంటూ... దైవంపట్ల, మనకు సాయం చేసినవారిపట్ల కృతజ్ఞతా భావంతో మెలిగేవారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ప్రపంచంలో సంతోషానికి కారకులవుతారు.
సువిశాలమైన ప్రపంచాన్ని మనకోసం సృష్టించిన దైవానికి కృతజ్ఞత చెప్పుకోవడం మన విధి. మనం పీల్చే శ్వాస ఆయన వరప్రసాదమే.
-మహమ్మద్ వహీదుద్దీన్
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..
Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్