Tirulmala Srivaru: చిటికెలో తిరుమల శ్రీవారి దర్శనం.. ఇదిగో ఇలాగా
ABN , Publish Date - Jul 27 , 2025 | 03:53 PM
ఎటువంటి టికెట్ లేకుండా.. ఇంకా చెప్పాలంటే.. ముందస్తు ప్రణాళిక లేకుండా తిరుమల వెళ్లే వారికి ఆ దేవదేవుని దర్శించుకునేందుకు సులువైన మార్గాలు చాలా ఉన్నాయి.

తిరుమలలో కొలువు తీరిన ఆ దేవదేవుడు, కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్నారు. ఆ స్వామి వారిని దర్శించుకునేందుకు వారంతా ముందస్తు ప్రణాళికతో తిరుమలకు తరలి వస్తారు. కానీ ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా ఆ కొండల్లో కొలువైన ఆ కోనేటి రాయుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు రకాల సులువైన ఏర్పాట్లు చేసింది. అవి ఏమంటే..
ప్రతి రోజూ తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు క్యూ లైన్‌లో తమ ఆధార్ కార్డును చూపించి, ఈ టోకెన్లను పొందవచ్చు.
చిన్న పిల్లలున్న వారికి ప్రత్యేక కోటా ఉంటుంది. ఏడాది లోపు పిల్లలున్న తల్లిదండ్రులకు సుపథం మార్గంలో ఉచిత దర్శనాన్ని కల్పిస్తారు.
వృద్ధులూ, దివ్యాంగుల కోసం ఆన్‌లైన్‌లో రోజుకు 750 టికట్లు కేటాయిస్తారు.
అనారోగ్యంతో ఉన్న వారిని బయోమెట్రిక్ ద్వారం నుంచి లోపలికి పంపుతారు. ఈ విషయాన్ని ముందుగా వైకుంఠం - 1 దగ్గరున్న టికెట్ తనిఖీ సిబ్బందికి తెలియజేయాలి.
భారత సైన్యంలో పని చేసేవారికి అంటే ఫీల్డ్ స్టాఫ్‌కు రూ. 300 టికట్ నేరుగా ఇస్తారు.
టీటీడీకి చెందిన అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసిన వారికి సుపథం మార్గంలో ప్రవేశం కల్పిస్తారు. రోజుకు ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుంది.
తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్న సప్తగోప్రదక్షిన మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తారు. దీనికి రూ 1,600 టికెట్ చెల్లించి టికెట్ తీసుకోవాలి. హోమం అనంతరం అక్కడి అధికారి స్టాంప్ వేసి ఇస్తే ఇద్దరికి రూ. 300 టికెట్లు ఇస్తారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీయులకు, ప్రవాస భారతీయులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. భారత్ నుంచి తిరుగు ప్రయాణం నెలలోపు ఉంటే పాస్ పోర్టులో ఆ తేదీనీ, ఇమిగ్రేషన్ స్టాంపునీ చూపిస్తే రూ. 300 టికెట్ ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్ నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్) ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అనుమతిస్తారు. రోజుకు 100 మందికి ప్రవేశం ఉంటుంది. దీనికి ప్రవాసాంధ్రులు అర్హులు.
తిరుమలలో కల్యాణం చేసుకున్న వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు కల్యాణోత్సవం టికెట్లు కేటాయిస్తారు. అందుకు వివాహ ధృవీకరణ పత్రంతోపాటు పోటోలను చూపించాలి. తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతంలో పెళ్లి చేసుకున్న కొత్త దంపతులైనా ఈ ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు.
శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టుకు రూ. 10 వేలు విరాళం ఇచ్చి, రూ. 500 చెల్లించి టికెట్ తీసుకునే భక్తులకు శ్రీవాణి దర్శన టికెట్లను ఇస్తారు. 1500 శ్రీవాణి టికెట్లలో ఆన్‌లైన్‌లో 500, రేణుగుంట విమానాశ్రయంలో 200, తిరుమల జేఈవో కార్యాలయం వెనుక ఉన్న శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో 800 టికెట్లు ఇస్తారు.
తెలుగు రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి సభ్యులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఇచ్చే సిఫార్సు లేఖలతో వీఐపీ బ్రేక్ దర్శనంతోపాటు వసతి సదుపాయం కల్పిస్తారు.
అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలతో ఈ అవకాశం దొరుకుతుంది. రోజుకు దాదాపు 4 వేల వరకు ఈ టికెట్లను జారీ చేస్తారు. ముఖ్యమైన ఉత్సవాలు, భక్తుల రద్దీ సమయాల్లో వీటిని రద్దు చేసే అధికారం టీటీడీకి ఉంటుంది.
శ్రీవారికి విరాళాలు అందించే దాతలకు టీటీడీ ప్రత్యేక దర్శనాలకు అనుమతి ఇస్తుంది. అందులో రూ. లక్ష నుంచి రూ. కోటిన్నర వరకూ విరాళాలను అందించిన వారికి డోనర్ పుస్తకాన్ని అందజేస్తారు. కుటుంబలోని ఐదుగురికి ఈ దర్శన భాగ్యం కలుగుతుంది.
ఇక గోవింద నామ కోటి రాసిన యువతకు వీఐపీ దర్శనం చేసుకొనే అవకాశాన్నిస్తోంది. 25 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న యువకులు అందుకు అర్హులు.
వీటిని కూడా చదవండి..
శ్రావణ మాసం.. సర్వ శుభ ప్రతిరూపం
ఈ రాశి వారికి మార్పులు బదిలీలు కొంత అసౌకర్యం కలిగిస్తాయి
For More Devotional News And Telugu News