Hyderabad: గంజాయి నై.. హాషిష్ ఆయిల్ హై
ABN , Publish Date - Apr 24 , 2025 | 10:20 AM
హైదరాబాద్ నగరం మరో మత్తు మాఫియాకు కేందంగా మారే అవకాశాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. హాషిష్ ఆయిల్ అనే మత్తు మాఫియాకు మొదట్లోనే చెక్ పెట్టేశారు. అయితే.. ఈ మాఫియా నగరంలోకి మత్తు పదార్ధాలను తీసుకురాకుండా అన్ని ప్రధాన వీధుల్లో తనిఖీలు చేస్తున్నారు.

- హాషిష్ ఆయుల్ విక్రయానికి ఆసక్తి
- రవాణా సులభం కావడమే కారణం
- రైలు, బస్సు మార్గాల్లో నగరానికి
- కిలో రూ.2లక్షలకు కొని రూ.10 లక్షలకు విక్రయం
హైదరాబాద్ సిటీ: నగరంలో హాషిష్ ఆయిల్ మత్తు మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. పోలీసులు దాడులు చేస్తూ డ్రగ్స్, గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నా కొత్త కొత్త మార్గాల్లో స్మగ్లర్లు మత్తు దందాను విస్తరిస్తున్నారు. నెలకు రూ.100 కోట్లకు పైగా మత్తు మాఫియా వ్యాపారం నగరంలో జరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఈ సంఖ్య రూ.500 కోట్ల వరకు ఉండేది. ఇటీవల నార్కోటిక్, హెచ్ న్యూ, టాస్క్‌ఫోర్స్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మికదాడులతో మాదక ద్రవ్యాల సరఫరా కొంత తగ్గుముఖం పట్టింది. గతంలో గంజాయిని ఎక్కువగా సరఫరా చేసిన స్మగ్లర్లు ఇప్పుడు గంజాయి ఆయిల్(హాషిష్ ఆయిల్)ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వార్తను కూడా చదవండి: MP Kavya: ఆ పనులు వేగంగా పూర్తిచేయాలి
దాన్ని వాటర్ బాటిల్, పాలిథిన్ కవర్లలో కిలోల చొప్పున నింపి బ్యాగుల్లో పెట్టుకొని సులభంగా బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాల్లో రవాణా చేసే అవకాశం ఉండటంతో స్మగ్లర్స్ హాషిష్ ఆయిల్ రవాణాకు మొగ్గు చూపుతున్నారు. కిలో హాషిష్ ఆయిల్‌ను తయారు చేయడానికి సుమారు 50 కిలోల గంజాయి మరపట్టాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అంటే ఒక కిలో హాషిష్ ఆయిల్ అర క్వింటాల్ గంజాయితో సమానం అన్నమాట. నగరంలో ఇటీవల పోలీసులకు చిక్కుతున్న ముఠాల్లో ఎక్కువగా హాషిష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న స్మగ్లర్స్ ఉండటం గమనార్హం.
మచ్చుకు కొన్ని..
- బీఎస్సీ చదివిన యువకుడు ఈజీ మనీకి అలవాటుపడి గంజాయి స్మగ్లర్‌గా మారాడు. స్నేహితుడితో కలిసి ముఠాగా ఏర్పడి హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు హాషిష్ ఆయిల్ (గంజాయి నూనె) సరఫరా చేస్తున్నాడు. ఇటీవల రాచకొండ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. ఇద్దరు స్మగ్లర్స్‌ను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి రూ. 80లక్షల విలువైన 4 కిలోల హాషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
- సీలేరు నుంచి హైదరాబాద్‌కు హాషిష్ ఆయిల్‌ను సరఫరా చేసి గుట్టుగా విక్రయిస్తున్న ముఠా ఆటకట్టించారు సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. వారి నుంచి 500 గ్రాముల హాషిష్ ఆయిల్ స్వా ధీనం చేసుకున్నారు.
- ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులో హాషిష్ ఆయిల్ (గంజాయి నూనె) సరఫరా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్స్‌ను రాచకొండ ఎస్‌వోటీ, పోచంపల్లి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 1.52 కోట్ల విలువైన 10.2 కిల్లో హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గోవిందరాజు, రాంబాబు అనే స్నేహితులు 10.2 కిలోల హాషిష్ ఆయిల్‌ను బ్యాగుల్లో పెట్టుకొని ఆర్టీసీ బస్సులో సిటీకి వచ్చారు. రాచకొండ శివారులో బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
- మరో కేసులో ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బార్డర్) నుంచి బెంగళూరుకు గుట్టుగా హాష్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. వారి వద్ద నుంచి రూ.1.08 కోట్ల విలువైన 13.5 కిలోల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ. 14 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
గంజాయిని మరపట్టి..
విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అరకు, ఒడిశా ఇలా అనేక ప్రాంతాల్లోని గంజాయి సరఫరా దారులు, స్మగ్లర్స్ విజ్ఞప్తి మేరకు గంజాయిని మరపట్టి తైలం తీస్తారు. దానికి పెట్రోలియం ఈథర్ అనే కెమికల్‌ను కలిపి హాషిష్ ఆయిల్‌గా తయారు చేస్తున్నారు. ఇది డ్రై గంజాయి కన్నా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. 50 కిలోల గంజాయితో సమానమైన కిలో హాషిష్ ఆయిల్‌ను రూ. 2 లక్షలకు స్మగ్లర్స్‌కు ఇస్తున్నారు. దాన్ని సిటీకి తరలిస్తున్న స్మగ్లర్స్.. 5 ఎంఎల్ డబ్బాల్లో నింపి ఒక్కో డబ్బాను రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇలా కిలో హాషిష్ ఆయిల్ ద్వారా రూ. 10 లక్షలు సంపాదిస్తున్నట్లు పోలీసులు తేల్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
ముగ్గురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య
ఫినాయిల్, సబ్బుల పైసలు నొక్కేశారు
Read Latest Telangana News and National News