Share News

Bengaluru: జేడీఎస్ నేత హత్య వెనుక కొత్త ట్విస్ట్.. భార్యే సుపారీ ఇచ్చి..

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:21 PM

బెంగళూరు దక్షిణ జిల్లా చన్నపట్టణ తాలూకా మాకళి గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు, జేడీఎస్‌ నాయకుడు లోకేశ్‌(Lokesh) హత్య కేసు మలుపు తిరిగింది. భార్య చంద్రకళ సుపారీ ఇచ్చి ఆయనను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

Bengaluru: జేడీఎస్ నేత హత్య వెనుక కొత్త ట్విస్ట్.. భార్యే సుపారీ ఇచ్చి..

  • సుపారీ ఇచ్చి లోకేశ్‌ను చంపించిన చంద్రకళ

  • వివాహేతర సంబంధం, ఆస్తి గొడవలే కారణం

  • పోలీసు విచారణలో కుట్ర బట్ట బయలు

బెంగళూరు: బెంగళూరు దక్షిణ జిల్లా చన్నపట్టణ తాలూకా మాకళి గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు, జేడీఎస్‌ నాయకుడు లోకేశ్‌(Lokesh) హత్య కేసు మలుపు తిరిగింది. భార్య చంద్రకళ సుపారీ ఇచ్చి ఆయనను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను శుక్రవారం అరెస్ట్‌ చేశారు. లోకేశ్‌, చంద్రకళకు 18ఏళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. లోకేశ్‌ వ్యవసాయం చేసుకుంటూ, జేడీఎస్ లో క్రియాశీలకంగా ఉండేవారు. బెంగళూరు(Bengaluru)లోని రెండు మూడు ప్రాంతాల్లో కోళ్ల దుకాణాలను నిర్వహించేవారు.


చంద్రకళకు ఇటీవల పోస్టల్‌శాఖ ఉద్యోగి యోగేశ్‌తో ఏర్పడిన స్నేహం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇదే విషయమై లోకేశ్‌ ఇంట్లో గొడవపడేవారు. బెంగళూరులో ఉండే ఓ స్థలాన్ని విక్రయించేందుకు లోకేశ్‌ ప్రయత్నించడాన్ని భార్య చంద్రకళ వ్యతిరేకించారు. ఏడు నెలల క్రితం ఓసారి లోకేశ్‌ను హతమార్చేందుకు రూ.2 లక్షల సుపారీ ఇచ్చారు. కానీ ఆ డబ్బు తీసుకున్నవారు కనిపించకుండా పరారీ అయ్యారు. దీంతో రెండోసారి ప్రియుడు యోగేశ్‌తో కలసి రూ.3.5 లక్షల సుపారీ ఇచ్చారు. నేరాలతో సంబంధం ఉన్న సూర్య, శివలింగ, చందన్‌, శాంతరాజ్‌.. జూన్‌ 23న బెంగళూరు నుంచి మాకళి గ్రామంవైపు వెడుతున్న లోకేశ్‌ కారును అడ్డగించి కిడ్నాప్‌ చేశారు.


pandu1.2.jpg

అతడి కారులోనే నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా క్రిమిసంహారక ముందు తాగించారు. కారు పక్కనే లోకేశ్‌ మృతదేహాన్ని ఉంచి, క్రిమిసంహారక మందు బాటిల్‌ను కారులో ఉంచి పరారీ అయ్యారు. మరుసటి రోజు లోకేశ్‌ మృతదేహాన్ని గుర్తించారు. మొదట ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఎంకే దొడ్డి పోలీసులు భావించారు. కానీ, పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడాలని చంద్రకళ అందరికీ సలహాలు ఇచ్చింది.


లోకేశ్‌ మరణానంతరం చన్నపట్టణలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి, తన భర్తను హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఎందుకు హత్య చేశారో తేల్చాలని, తన భర్త ఆత్మకు శాంతి లభించాలని, దోషులకు కఠినశిక్ష పడాలని అన్నారు. హత్య పథకం అమలు కోసం చంద్రకళ కొత్త మొబైల్‌, ఓ సిమ్‌కార్డును సమకూర్చుకున్నారు. నిందితులు హత్య చేసేందుకు ఓ కారును కొనుగోలు చేశారు.


లోకేశ్‌ మృతదేహాన్ని పరిశీలించినప్పుడు పోలీసులకు కొన్ని అనుమానాలు కలిగాయి. క్రిమిసంహారక మందు బాటిల్‌ కనిపించకపోవడం, ఓ చెప్పు లేకపోవడం, చంద్రకళ సాధారణ ఫోన్‌ కాకుండా మరో నంబరును వాడటంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలుత చంద్రకళ, యోగేశ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైనశైలిలో విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్‌ ధర పెంపు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 26 , 2025 | 12:21 PM