Share News

India E-commerce: భారత ఈ-కామర్స్‌పైనా అమెరికా కన్ను

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:02 AM

భారత ఈ-కామర్స్‌ మార్కెట్లోకి ప్రవేశం కోసం అమెరికా తన అమెజాన్‌, వాల్‌మార్ట్‌లకు ఆంక్షలు తొలగించాలని ఒత్తిడి చేస్తోంది. దీనివల్ల దేశీయ కిరాణా వ్యాపారాలు, సంస్థలు ముప్పులోకి వస్తాయని వ్యాపార సమాఖ్య హెచ్చరిస్తోంది

India E-commerce: భారత ఈ-కామర్స్‌పైనా  అమెరికా కన్ను

  • అమెజాన్‌, వాల్‌మార్ట్‌లపై ఆంక్షలు తొలగించాలని ఒత్తిడి

  • వద్దంటున్న కిరాణా వ్యాపారులు

  • రిలయన్స్‌ రిటైల్‌, డీమార్ట్‌లకూ ముప్పే

న్యూఢిల్లీ: దాదాపు 12,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.10.65 లక్షల కోట్లు) స్థాయికి చేరిన దేశీయ ఈ-కామర్స్‌పైనా అమెరికా కన్నేసింది. తన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ కంపెనీలకూ భారత్‌ ఈ-కామర్స్‌ మార్కెట్‌ తలుపులు బార్లా తెరవాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలోనూ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఈ విషయాన్ని గట్టిగా ప్రస్తావించినట్టు సమాచారం. అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎ్‌సటీఆర్‌) జామీసన్‌ గ్రీర్‌ కూడా ఈ విషయంలో పట్టుదలతో ఉన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ సుంకాలు తగ్గించడంతో పాటు వివక్షాపూరితమైన ఆంక్షలనూ తొలగించాని డిమాండ్‌ చేశారు.


ఎందుకంటే ?

దేశీయ ఈ-కామర్స్‌ మార్కెట్‌ శరవేగంగా విస్తరిస్తోంది. క్విక్‌ కామర్స్‌ కంపెనీలైతే దేశంలోని దాదాపు 100 ప్రధాన నగరాల్లోకి చొచ్చుకుపోయాయి. ఈ మార్కెట్లో ప్రస్తుతం అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ భారత అనుబంధ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌దే హవా. మరో అమెరికా రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ కూడా ఈ రంగంలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ ఈ-కామర్స్‌ సంస్థలు ఇతర సంస్థల వస్తు,సేవలకు మార్కెట్‌ వేదికలుగా మాత్రమే పని చేయాలి. అవి నేరుగా వస్తువులను తయారు చేసి.. స్టోర్‌ చేసి తమ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు వీల్లేదు. వివక్షాపూరితమైన ఈ ఆంక్షలను ఎత్తివేయాలని అమెరికా ప్రస్తుతం మోదీ సర్కారుపై ఒత్తిడి చేస్తోంది.


కిరాణాకు ఉరితాడే!

ఈ విషయంలో ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి లొంగిపోతే దేశంలోని కిరాణా దుకాణాలకు అది ఉరితాడులా మారుతుందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) హెచ్చరిస్తోంది. ఈ-కామర్స్‌ సంస్థల అడ్డగోలు ధరలు, డిస్కౌంట్‌లకు తట్టుకోలేక గత రెండు మూడేళ్లలో దాదాపు 10 లక్షల కిరాణా దుకాణాలు మూతపడి లక్షల మంది ఉపాధిలేక రోడ్డున పడినవిషయాన్ని గుర్తు చేసింది. అమెరికా ఈ-కామర్స్‌ దిగ్గజాలకూ సమాన అవకాశాలు కల్పించడం అంటే రిలయన్స్‌ రిటైల్‌, డీమార్ట్‌ వంటి దేశీయ రిటైల్‌ దిగ్గజాలకూ ముప్పని హెచ్చరించింది.

Updated Date - Apr 23 , 2025 | 02:06 AM