CIBIL Score Issue: సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:45 AM
బ్యాంక్ లోన్‌కి సిబిల్ స్కోర్ (CIBIL Score Issue) చాలా ముఖ్యం. కానీ అదే స్కోరు మీ ఉద్యోగ భద్రతను కూడా ప్రభావితం చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకున్న ఓ సంచలన నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు లోన్స్ ఇవ్వవని చాలా మందికి తెలుసు. కానీ స్కోర్ తక్కువగా ఉండటంతో ఉద్యోగం పోయిందనే విషయం మీకు తెలుసా. అవును మీరు విన్నది నిజమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సిబిల్ స్కోరు తక్కువగా ఉందని ఓ ఉద్యోగిని తొలగించింది. తొలగించాలన్న SBI నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించింది. ఈ కేసు చెన్నైలోని SBIలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) నియామకం ద్వారా వెలుగులోకి వచ్చింది. సిబిల్ స్కోర్ (CIBIL Score Issue) తక్కువగా ఉండటం వల్ల నియామకాన్ని రద్దు చేశారని తొలగించబడిన ఉద్యోగి పి.కార్తికేయన్ పేర్కొన్నారు.
బ్యాంక్ నిర్ణయం
ఆ క్రమంలో తొలగింపు ఉత్తర్వును రద్దు చేసి, అతన్ని తిరిగి తీసుకోవాలని ఆదేశించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉందని మద్రాస్ హైకోర్టు తన ఉత్తర్వులో తెలిపింది. బ్యాంకింగ్ పనుల్లో ప్రజా ధనంతో వ్యవహరిస్తారని, అందువల్ల కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించాల్సిన అవసరం ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. రుణం చెల్లించడంలో డిఫాల్ట్ అయిన అభ్యర్థి సిబిల్ స్కోరు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో అనర్హులుగా ప్రకటించడానికి బ్యాంక్ నిర్ణయం తీసుకుందని చెప్పింది.
ఎక్కువ వాయిదాలు..
బ్యాంకు సమర్పించిన సిబిల్ నివేదికలో 2016 నుంచి 2021 మధ్య పిటిషనర్‌కు 9 క్రెడిట్ లావాదేవీలు, 10 కంటే ఎక్కువ రుణ దర్యాప్తులు జరిగాయని కోర్టు గుర్తించింది. దీంతో రుణ చెల్లింపులో డిఫాల్ట్ అయినట్లు పిటిషనర్ కూడా అంగీకరించారని కోర్టు తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థి వాదనను తిరస్కరించి, కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అర్హత ప్రమాణాలలోని క్లాజ్ 1(e) కింద అతను అనర్హుడని తేలిందని బ్యాంక్ తెలిపింది. పిటిషనర్ ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టారని, అందువల్ల ఉద్యోగం కొనసాగించాలని క్లెయిమ్ చేసే హక్కు అతనికి లేదని బ్యాంక్ వెల్లడించింది. పిటిషనర్ ఒకటి కంటే ఎక్కువ వాయిదాలు రుణం చెల్లించలేదని, కాబట్టి దీనిని ఇతర కేసులతో పోల్చలేమని బ్యాంక్ స్పష్టం చేసింది.
ఏం జరిగింది..
పిటిషనర్ జూలై 27, 2020న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం SBIలో CBO నియామకానికి దరఖాస్తు చేసుకున్నాడు. అతను రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత మెడికల్ టెస్ట్, ఇతర సర్టిఫికెట్లు, సిబిల్ స్కోర్ చూసిన తర్వాత, అతనికి మార్చి 12, 2021న నియామక లేఖను జారీ చేశారు. కానీ మార్చి 16న దానిపై పిటిషనర్ నుంచి బ్యాంక్ వివరణ కోరింది. పిటిషనర్ స్పష్టత ఇచ్చి ఉద్యోగాన్ని కొనసాగించమని అభ్యర్థించాడు. కానీ చివరకు సిబిల్ స్కోర్ తక్కువ నివేదిక ఆధారంగా అతని నియామక లేఖను రద్దు చేశారు.
ఇవీ చదవండి:
భారత్, ఇంగ్లాడ్ టెస్ట్‌ల మధ్య జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి..
జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి