Share News

RBI: ఆర్బీఐ కొత్త రూల్.. ఈ లోన్స్ తీసుకున్న వారికి ఫైన్స్ నుంచి ఉపశమనం..

ABN , Publish Date - Jul 03 , 2025 | 06:56 PM

బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) ఇకపై ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ముందస్తు చెల్లింపు జరిమానాలు విధించకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆర్బీఐ తాజాగా ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

RBI: ఆర్బీఐ కొత్త రూల్.. ఈ లోన్స్ తీసుకున్న వారికి ఫైన్స్ నుంచి ఉపశమనం..
RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూక్ష్మ, చిన్న వ్యాపారులకు (MSEs) రుణాలు అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జనవరి 1, 2026 నుంచి కొత్తగా ఇచ్చే లేదా పునరుద్ధరించే ఫ్లోటింగ్ రేట్ రుణాలపై బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) ముందస్తు చెల్లింపు జరిమానాలు విధించకూడదని ఆర్‌బీఐ తెలిపింది. ఈ నిర్ణయం MSEలకు ఆర్థిక సౌలభ్యాన్ని, స్వేచ్ఛను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.


పర్యవేక్షణ సమీక్షల్లో..

ఈ నిర్ణయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్ (FISME) స్వాగతించింది. ఆర్‌బీఐ తన నోటిఫికేషన్‌లో సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు సౌకర్యవంతమైన రుణ సౌలభ్యం చాలా ముఖ్యమని పేర్కొంది. బ్యాంకులు, NBFCలు అనుసరిస్తున్న పద్ధతులను తమ పర్యవేక్షణ సమీక్షల్లో గుర్తించినట్లు తెలిపింది. ప్రధానంగా ముందస్తు చెల్లింపు జరిమానాలు రుణగ్రహీతలకు అసౌకర్యాన్ని కలిగించడమే కాక, ఒప్పంద వివాదాలకు కూడా దారితీస్తున్నాయని వెల్లడించింది.


తక్కువ వడ్డీ రేట్లు

కొన్ని బ్యాంకులు, NBFCలు రుణ ఒప్పందాల్లో పరిమితి కలిగించే నిబంధనలు చేర్చి, రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీ రేట్లు లేదా మెరుగైన సేవల కోసం ఇతర రుణదాతల వైపు మళ్లకుండా అడ్డుకుంటున్నాయని ఆర్‌బీఐ బుధవారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇలాంటి పద్ధతులు రుణ గ్రహీతల ఎంపిక స్వేచ్ఛను, మార్కెట్‌లో ఆరోగ్యకరమైన పోటీని దెబ్బతీస్తాయని హెచ్చరించింది.


ఓవర్‌ డ్రాఫ్ట్ విషయంలో..

ఈ ఆంక్షల నుంచి కొన్ని రకాల రుణదాతలకు మినహాయింపు ఇచ్చారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు, టైర్3 ప్రైమరీ (అర్బన్) కో ఆపరేటివ్ బ్యాంకులు, రాష్ట్ర, కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంకులు, మిడిల్ లేయర్ NBFCలు ఉన్నాయి. దీంతోపాటు ఇప్పటికే రూ.50 లక్షల వరకు రుణాలపై ముందస్తు చెల్లింపు జరిమానాలు విధించకుండా నిషేధించబడ్డాయి. క్యాష్ క్రెడిట్ లేదా ఓవర్‌ డ్రాఫ్ట్ సౌకర్యాల విషయంలో రుణ గ్రహీత ఒప్పందంలో నిర్దేశించిన వ్యవధిలో సౌకర్యాన్ని పునరుద్ధరించకూడదని బ్యాంకుకు ముందస్తు సమాచారం ఇస్తే, సౌకర్యం గడువు తేదీన రద్దు అయితే, ముందస్తు చెల్లింపు జరిమానాలు వర్తించవని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.


రుణ గ్రహీతలకు..

ఈ విధానం గతంలో రిటైల్ రుణాలపై ముందస్తు చెల్లింపు జరిమానాలను నిషేధించిన ఆర్‌బీఐ ఆదేశానికి అనుగుణంగా ఉంది. రుణ గ్రహీతల హక్కులను కాపాడడం, రుణ మార్కెట్‌లో ఆర్థిక చేరికను ప్రోత్సహించడం పట్ల ఆర్‌బీఐ తన నిబద్ధతను మరోసారి గుర్తు చేసింది. ఈ నిర్ణయం MSEలకు మరింత సౌలభ్యం, ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుందని, దీనివల్ల వ్యాపారులు తమ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మెరుగైన రుణ ఆప్షన్లను ఎంచుకుంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

చమురు తీసుకుంటే భారత్‎పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్


రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 06:56 PM