Myntra: రూ. 1654 కోట్ల ఉల్లంఘన, మింత్రా ఫ్యాషన్స్ సంస్థపై ED కేసు
ABN , Publish Date - Jul 23 , 2025 | 05:07 PM
రూ. 1,654 కోట్ల మేర వ్యాపార ఉల్లంఘనలు జరిగాయని ఫ్యాషన్ ఈ కామర్స్ కంపెనీ మింత్రా పై దర్యాప్తు సంస్థ ED కేసు నమోదు చేసింది. వ్యాపార వ్యవహారాల్లో సదరు కంపెనీతోపాటు, అనుబంధ కంపెనీలు FDI గీత దాటాయని..

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ ఫ్యాషన్ ఈ-కామర్స్ కంపెనీ మింత్రా వార్తల్లోకెక్కింది. మింత్రా దాని అనుబంధ కంపెనీలు, ఇంకా సంస్థ డైరెక్టర్లపై రూ.1,654.35 కోట్ల విలువైన ఆరోపణలు వచ్చాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మింత్రా పై కేసు నమోదు చేసింది.
మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని సంబంధిత సంస్థలు మల్టీ-బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ (MBRT)లో నిమగ్నమై ఉన్నాయన్న ఈడీ, అయితే, సదరు సంస్థ భారతదేశ FDI విధానాన్ని ఉల్లంఘించి, 'హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ' మోడల్ కింద పనిచేస్తున్నట్లు ఈడీ చెప్పింది. దీంతో మింత్రా బెంగళూరు జోనల్ కార్యాలయంలో కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.
హోల్‌సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామనే నెపంతో మింత్రా రూ. 1,654.35 కోట్ల విలువైన FDIని పొందిందని ఈడీ చెబుతోంది. అయితే, స్టాక్ లో అధికభాగాన్ని ప్రత్యేకంగా M/s వెక్టర్ ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్(అదే సంస్థకు చెందిన కంపెనీ)కు విక్రయించినట్లు పేర్కొంది. ఆ తర్వాత వస్తువులను రిటైల్ వినియోగదారులకు అమ్మినట్టు వెల్లడించింది.
ఉద్దేశపూర్వకంగా మింత్రా ఇంకా, వెక్టర్ సంస్థలు B2C (బిజినెస్ టు కస్టమర్) లావాదేవీలను B2B (బిజినెస్ టు బిజినెస్)గా విభజించి, తరువాత వెక్టర్ ఇంకా, రిటైల్ వినియోగదారుల మధ్య B2C మోడల్‌ను అమలు చేశారని ED తెలిపింది. ఇది FDI నిబంధనల ప్రకారం విదేశీ-బ్రాండ్ రిటైల్‌పై ఉన్న పరిమితులను ఉల్లంఘించడమేనని దర్యాప్తు ఏజెన్సీ చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా, ఏప్రిల్ 1, 2010 - అక్టోబర్ 1, 2010 నాటి FDI విధాన సవరణల ప్రకారం, హోల్‌సేల్ మోడల్ కింద పనిచేసే కంపెనీలు, తమ వస్తువులను సంబంధిత గ్రూప్ కంపెనీలకు 25% వరకు మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంది. అయితే, మింత్రా తన అమ్మకాలలో 100 శాతం వెక్టర్ ఇ-కామర్స్‌కు చేసింది. తద్వారా ఈ పరిమితిని ఉల్లంఘించిందని ED తెలిపింది. తద్వారా మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ కంపెనీలు FEMA, 1999 లోని సెక్షన్ 6(3)(b) కన్సాలిడేటెడ్ FDI పాలసీ నిబంధనలను ఉల్లంఘించారని చెప్పింది.
దీంతో సదరు సంస్థలపై FEMA లోని సెక్షన్ 16(3) కింద తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంది. అయితే, ఈ విషయంపై మింత్రా ఇంకా స్పందించలేదు. కాగా, ఈడీ తాజా చర్య భారత ఇ-కామర్స్ రంగంపై పెరుగుతున్న నియంత్రణను తెలియజేస్తోంది.
Also Read:
గుడ్డు పగలకుండా ఎలా ఉడకబెట్టాలి?
For More Lifestyle News