Stock Markets Crash : రెండు సెషన్లలో రూ.8.67 లక్షల కోట్లు ఆవిరి
ABN , Publish Date - Jul 26 , 2025 | 01:23 AM
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలతో స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు భారీ పతనాన్ని నమోదు చేసింది...

ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలతో స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు భారీ పతనాన్ని నమోదు చేసింది. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో అమ్మకాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు మార్కెట్‌ను శుక్రవారం కుంగదీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 721.08 పాయింట్లు నష్టపోయి 81,463.09 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల కనిష్ఠ స్థాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 786.48 పాయింట్ల నష్టంతో 81,397.69 స్థాయికి దిగజారింది. నిఫ్టీ కూడా 225.10 పాయింట్ల నష్టంతో 24,837 వద్ద ముగిసింది. రెండు సెషన్లలో సెన్సెక్స్ 1263.55 పాయింట్లు నష్టపోయింది. దీంతో బీఎ్‌సఈలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ రూ.8,67,406.75 కోట్లు దిగజారి రూ.4,51,67,858.16 కోట్ల వద్ద స్థిరపడింది. కాగా వారం మొత్తం మీద సెన్సెక్స్ 294.64 పాయింట్లు, నిఫ్టీ 131.4 పాయింట్లు నష్టపోయాయి. స్టాక్ ఎక్స్ఛేంజిల వద్ద ఉన్న గణాంకాల ప్రకారం శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.1979.96 కోట్ల విలువ గల షేర్లు విక్రయించారు. ఆసియా, యూరోపియన్ మార్కెట్లలో బలహీన ట్రెండ్, నిరుత్సాహపూరితమైన కార్పొరేట్ ఫలితాలు ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయని విశ్లేషకులంటున్నారు. లార్జ్‌క్యాప్ షేర్ల అధిక విలువలు, ఎఫ్‌పీఐల వద్ద ఉన్న షార్ట్ పొజిషన్లు మార్కెట్లో ఒత్తిడిని పెంచాయని జియోజిత్ ఇన్వె్‌స్టమెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి అమెరికన్ డాలర్ మారకంలో మరో 12 పైసలు దిగజారి 86.52 వద్ద ముగిసింది. విదేశీ నిధుల తరలింపు, అమెరికన్ కరెన్సీ బలం పుంజుకోవడం ఇందుకు దోహదపడ్డాయి.
ఈ నెల 18వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 118.3 కోట్ల డాలర్ల మేరకు దిగజారి 68,548.9 కోట్ల డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.
ఎన్‌ఎస్‌డీఎల్ షేరు ధర శ్రేణి రూ.760-800
ఐపీఓకు రానున్న నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ షేరు ధర శ్రేణిని రూ.760-800గా నిర్ణయించింది. ఈ ఇష్యూ ద్వారా రూ.4011 కోట్లు సేకరించాలన్నది కంపెనీ లక్ష్యం. ఇష్యూ వచ్చే బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగుస్తుంది.
జీఎన్‌జీ ఎలక్ర్టానిక్స్ ఇష్యూ సూపర్ హిట్
జీఎన్‌జీ ఎలక్ర్టానిక్స్ ఇష్యూ సూపర్ డూపర్ హిట్ అయింది. శుక్రవారం ఇష్యూ ముగిసే సమయానికి 146.90 రెట్ల అధిక బిడ్లు దాఖలయ్యాయి. రూ.460.43 కోట్ల సమీకరణ లక్ష్యంగా కంపెనీ రంగంలోకి దిగింది. మొత్తం 1,41,88,644 ఈక్విటీలు జారీ చేయగా 208,43,32,446 బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 45.32 రెట్ల అధిక సబ్‌స్ర్కిప్షన్ సాధించింది.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News