Income Tax Return: పన్ను చెల్లింపుదారుల కోసం ITR-2, ITR-3 ఫామ్స్ విడుదల..ఇవి ఎవరు ఉపయోగిస్తారంటే
ABN , Publish Date - Jul 11 , 2025 | 06:49 PM
ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు కీలక అలర్ట్ వచ్చేసింది. 2025-26 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ITR-2, ITR-3 ఆఫ్‌లైన్ రిటర్న్ ఫారమ్‌లను తాజాగా విడుదల చేశారు. అయితే ఈ ఫామ్స్ ఎవరి కోసం, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఆదాయపు పన్ను శాఖ 2025-26 అసెస్‌మెంట్ ఇయర్ (AY) కోసం ITR-2, ITR-3 ఆఫ్‌లైన్ ఫామ్‌లను విడుదల చేసింది. ఈ ఫామ్‌లు వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUFs), క్యాపిటల్ గెయిన్స్, విదేశీ ఆదాయం, వ్యాపారం, వృత్తి పరంగా ఆదాయం (Income Tax Return) ఉన్నవారికి రూపొందించబడ్డాయి. ITR-1, ITR-4 ఫామ్‌లు ఇప్పటికే విడుదల కాగా, ITR-2, ITR-3 ఫామ్‌ల విడుదల తాజాగా జరిగింది.
పలు రకాల మార్పులు..
2025-26 కోసం ITR ఫామ్‌లలో పలు రకాల మార్పులు చేయడం వల్ల ఈ ఆలస్యం జరిగింది. ఈ మార్పులకు బ్యాకెండ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు, యుటిలిటీ ప్రోగ్రామింగ్ ధ్రువీకరణ అవసరమైందని అధికారులు తెలిపారు. ఈ ఆలస్యానికి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS), ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (TIS)లో సమస్యలు, అంతర్జాతీయ రిపోర్టింగ్ ప్రమాణాలతో సమన్వయం, ప్రభుత్వ సర్క్యులర్‌లతో అనుసంధానం వంటివి కారణమన్నారు.
ITR-2, ITR-3లో కొత్త మార్పు ఏంటి..
ITR-2, ITR-3 ఫామ్‌లలో చేసిన మార్పులు ఫైనాన్స్ (నెంబర్ 2) చట్టం, 2024లోని సవరణలను ప్రతిబింబిస్తాయని ట్యాక్స్‌మాన్ సంస్థ ఉపాధ్యక్షుడు నవీన్ వాధ్వా తెలిపారు.
ఆస్తులు, బాధ్యతలను తప్పనిసరిగా రిపోర్ట్ చేయాల్సినవి రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటికి పెంచారు.
కొత్త ఫామ్‌లలో, ఆస్తి బదిలీ జులై 23, 2024కు ముందు లేదా తర్వాత జరిగిందా అనేది వెల్లడించాలి. ఇది పన్ను రేట్లపై, ముఖ్యంగా ఆస్తి అమ్మకాలపై ప్రభావం చూపిస్తుంది.
అక్టోబర్ 1, 2024 తర్వాత షేర్ బై బ్యాక్‌లపై క్యాపిటల్ లాసెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సంబంధిత డివిడెండ్ ఆదాయాన్ని రిపోర్ట్ చేయాలి.
TDS డిడక్ట్ చేయబడిన నిర్దిష్ట సెక్షన్‌ను రిపోర్ట్ చేయడానికి కొత్త ఫీల్డ్ చేర్చారు
80C, 80D వంటి డిడక్షన్స్, విదేశీ ఆస్తులు, వర్చువల్ డిజిటల్ ఆస్తులకు సంబంధించి మరింత వివరణాత్మక సమాచారం అవసరం. ఈ మార్పులు ఫైలింగ్‌ను సులభతరం చేస్తాయి.
ITR-2, ITR-3 ఎవరు ఫైల్ చేయాలి
ITR-2: జీతం, అనేక గృహ ఆస్తులు, క్యాపిటల్ గెయిన్స్ లేదా విదేశీ ఆస్తుల నుంచి ఆదాయం ఉన్న వ్యక్తులు, HUFs లకు ఉపయోగం. వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్నవారు ఈ ఫామ్‌ను ఉపయోగించకూడదు.
ITR-3: వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్న వ్యక్తులు దీనిని వినియోగించాలి. సెక్షన్ 44AD, 44ADA, 44AE కింద ట్యాక్సేషన్ స్కీమ్‌ల ద్వారా ఆదాయం ఉన్నవారు కూడా ఈ ఫామ్‌ను ఉపయోగించవచ్చు.
గడువు తేదీలు
నాన్-ఆడిట్ కేసుల కోసం ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 15, 2025. డిసెంబర్ 31 వరకు ఆలస్య రిటర్న్‌ను పెనాల్టీలు, వడ్డీతో ఫైల్ చేసుకోవచ్చు. ఆడిట్ వ్యాపారాల కోసం ఫైలింగ్ గడువు అక్టోబర్ 31, 2025. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఈ మార్పులను జాగ్రత్తగా పరిశీలించి ఫైలింగ్ కోసం సిద్ధం కావాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి