Health Insurance: 8 బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ ఝలక్
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:16 AM
ఆరోగ్య బీమా పాలసీల సెటిల్‌మెంట్స్ లోపాలపై బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి ఐఆర్‌డీఏఐ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది.

ఆరోగ్య బీమా లోపాలపై గుస్సా
షోకాజ్ నోటీసులు జారీ
న్యూఢిల్లీ: ఆరోగ్య బీమా పాలసీల సెటిల్‌మెంట్స్ లోపాలపై బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఎనిమిది బీమా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీలన్నీ క్లెయిమ్స్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి గత ఏడాది మే నెలలో తాము జారీ చేసిన ‘హెల్త్ ఇన్సూరెన్స్ మాస్టర్ సర్క్యులర్’ నిబంధనలు తుంగలో తొక్కాయని పేర్కొంది. ప్రైవేట్ రంగంలోని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ అండ్ అల్లైడ్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, మణిపాల్‌సిగ్మా హెల్త్ ఇన్సూరెన్స్, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎ్‌ఫసీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ప్రభుత్వ రంగంలోని న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి కూడా ఈ నోటీసులు అందాయి.
వచ్చే వారం చర్చ: ఈ నోటీసులకు ఇప్పటి వరకు ఐసీఐసీఐ లొంబార్డ్, న్యూ ఇండియా అష్యూరెన్స్ మాత్రమే సమాధానం ఇచ్చాయి. మిగతా కంపెనీలు ఇంకా సమాధానం ఇవ్వాల్సి ఉంది. వచ్చే వారం జరిగే ఐఆర్‌డీఏఐ బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చకు రానుంది. బీమా కంపెనీలు ఇచ్చిన సమాధానాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. జరిమానాలు లేదా పాలసీదారులకు వడ్డీతో సహా క్లెయిమ్స్ రిఫండ్ చేయమని ఆదేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు
ఐఆర్‌డీఏఐ లేవనెత్తిన అభ్యంతరాలు
క్లెయిమ్స్ చెల్లింపుల నుంచి అనవసర తగ్గింపులు
అహేతుక కారణాలతో క్లెయిములను తిరస్కరించడం
నిర్ణీత కాలానికి మించి సెటిల్‌మెంట్స్ ఆలస్యం చేయడం