Financial Planning: రోజుకు 80 రూపాయలు సేవింగ్.. ఇలా చేస్తే కోటీశ్వరులవ్వడం ఖాయం..
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:02 PM
రోజుకు 80 రూపాయలు పొదుపు చేయడం చిన్న విషయంలా అనిపించవచ్చు (Financial Planning). కానీ దీని ద్వారా మీరు కొన్నేళ్లలోనే కోటీశ్వరులు కావచ్చు. అయితే దీని కోసం ఏం చేయాలి, ఎన్నేళ్లు పొదుపు చేయాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

మీరు రోజూ కేవలం 80 రూపాయలు పొదుపు చేస్తే (Financial Planning), ఒక రోజు కోటీశ్వరులవ్వొచ్చని తెలిస్తే ఆశ్చర్యపోతారా? అవును, ఇది నిజం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP Investment) ద్వారా రోజుకు 80 రూపాయలు, అంటే నెలకు 2400 రూపాయలు పెట్టుబడి పెడితే, 15 శాతం వార్షిక రిటర్న్‌తో మీరు కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇది ఎలా సాధ్యమవుతుంది, ఈ విధానం అందరికీ అనుకూలమేనా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
చిన్న సేవింగ్, పెద్ద మొత్తం
మనలో చాలామంది కోటీశ్వరులవ్వాలని కలలు కంటారు. కానీ, ఆ కల సాకారం కావాలంటే భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని అనుకుంటాం. కానీ, నిజం ఏంటంటే, చిన్న చిన్న పొదుపు అలవాట్లతో కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఉదాహరణకు మీరు రోజుకు 80 రూపాయలు అంటే, ఒక కూల్ డ్రింక్ లేదా ఫ్రైడ్ రైస్ తినడానికి అయిన ఖర్చు. ఈ చిన్న మొత్తాన్ని సిప్ ద్వారా పెట్టుబడి పెడితే, కాలక్రమేణా అది మీకు భారీ మొత్తాన్ని అందిస్తుంది.
కాంపౌండింగ్ మ్యాజిక్
ఈ విజయం వెనుక రహస్యం ఏమిటంటే, కాంపౌండింగ్ పవర్. కాంపౌండింగ్ అంటే మీ పెట్టుబడిపై వచ్చే వడ్డీ, మళ్లీ పెట్టుబడిగా మారి, దానిపై మరింత వడ్డీ సంపాదించడం. ఉదాహరణకు, మీరు నెలకు 2400 రూపాయలు సిప్‌లో పెట్టుబడి పెడితే, మొదటి సంవత్సరం తర్వాత మీ డబ్బు కొంత వడ్డీతో పెరుగుతుంది. రెండో సంవత్సరంలో, మీ మొత్తం పెట్టుబడి (మొదటి సంవత్సరం వడ్డీతో సహా) మీద వడ్డీ వస్తుంది. ఇలా, సంవత్సరాలు గడిచే కొద్దీ మీ సంపద వేగంగా పెరుగుతుంది.
ఎలా వస్తుందంటే..
ఉదాహరణకు మీరు 25 ఏళ్ల వయసులో రోజుకు 80 రూపాయలు (నెలకు 2400 రూపాయలు) సిప్‌లో పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే, 15% సగటు వార్షిక రిటర్న్‌తో, 28 సంవత్సరాల తర్వాత, అంటే మీరు 53 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, మీ పెట్టుబడి 1 కోటి రూపాయలకు (రూ.1,01,69,683) చేరుకుంటుంది. ఇది కాంపౌండింగ్ పవర్ అంటే ఏంటో చూపిస్తుంది. ఈ క్రమంలో మీరు చేసిన పెట్టుబడి రూ. 8,06,400 లక్షలు కాగా, మీకు వడ్డీ రూపంలోనే రూ. 93,63,283 లభిస్తాయి.
ఎందుకు సిప్?
సిప్ ఎందుకు ఎంచుకోవాలి. ఇది సామాన్యులకు అనుకూలమైన పెట్టుబడి మార్గం. మీరు ఒకేసారి పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న మొత్తాలతో మొదలు పెట్టవచ్చు. అంతేకాదు, సిప్ మార్కెట్ ఒడిదొడుకులను బ్యాలెన్స్ చేస్తుంది. దీన్ని రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. మార్కెట్ హై ఉన్నప్పుడు తక్కువ యూనిట్లు, లో ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు కొంటారు. దీనివల్ల సగటు కొనుగోలు ధర తగ్గుతుంది.
గమనిక: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం మంచిది.
ఇవీ చదవండి:
ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటాం..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి