Indian Companies Set to Launch IPOs: వేల కోట్ల విలువైన ఐపీవోల విడుదల.. ఎప్పుడంటే..?
ABN , Publish Date - Oct 31 , 2025 | 04:29 PM
దేశంలోని వివిధ సంస్థలు.. భారీగా ఐపీవోలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వేలాది కోట్ల విలువైన ఈ ఐపీవోల విడుదలకు ముహూర్తాన్ని ఆయా సంస్థలు నిర్ణయించాయి.
బిజినెస్ డెస్క్: దేశంలోని వివిధ కంపెనీలు తమ ఐపీవోలను స్టాక్ మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. వీటిని నవంబర్‌లో తీసుకురావాలని ఆయా కంపెనీలు నిర్ణయించాయి. దీంతో సుమారు రూ.76,000 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూలు రావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టెక్నాలజీ, రెన్యూవబుల్స్, కన్స్యూమర్ గూడ్స్, హెల్త్ కేర్ తదితర రంగాలకు చెందిన సంస్థల వస్తుండడంతో పెట్టుబడిదారుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ అక్టోబర్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు 5 శాతానికి పైగా పెరగడంతో మార్కెట్‌పై మదుపరులకు నమ్మకం పెరిగింది. ఈ ఉత్సాహాన్ని గమనించిన పలు కంపెనీలు.. తమ షేర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి తమ ప్రయత్నాలను ప్రారంభించాయి.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ.. రూ.10,000 కోట్లు
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ.. దేశంలోని అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థ. ఈ నవంబర్‌లో భారీ ఐపీవోకు సిద్ధమవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్ 51 శాతం వాటా, ప్రుడెన్షియల్ పీఎల్‌సీ 49 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇక ఈ సంస్థకు 1.46 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. అలాగే 93 శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. ఫైనాన్షియల్‌గా 80 శాతం పైగా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది. ఐపీవో ఆస్తి నిర్వహణ రంగంలో పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు.
గ్రో.. రూ.6,600 కోట్లు
గ్రో.. ఫిన్‌టెక్ దిగ్గజం. ఈ సంస్థ నవంబర్‌లో రూ. 6,000 నుంచి రూ.8,300 కోట్లు ఐపీవో తెస్తోంది. ఇక ఈ సంస్థ విలువ సుమారు 7 నుంచి 9 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సంస్థకు 5 కోట్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,819 కోట్ల నికర లాభాం సాధించింది. ఈ సంస్థ తాజాగా వెల్త్ మేనేజ్‌మెంట్, ఈటీఎఫ్‌లు, కార్పొరేట్ బాండ్లు తదితర కొత్త సేవలను ప్రారంభించింది.
పైన్ లాబ్స్.. రూ. 6,100 కోట్లు
పేమెంట్ సొల్యూషన్ సంస్థ పైన్ లాబ్స్. ఈ సంస్థ సుమారు రూ.6,664 కోట్ల ఐపీవోకు సిద్ధమవుతోంది. ఇందులో పీక్ ఎక్స్వీ పార్ట్‌నర్స్, మాస్టర్ కార్డ్, టెమాసెక్ వంటి ఇన్వెస్టర్లు నుంచి ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది. ఈ సంస్థ భారత్, సౌత్ ఈస్ట్ ఏషియా, యూఏఈల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.53 లక్షల కోట్ల లావాదేవీలను నిర్వహించింది.
బోట్.. రూ. 2000 నుంచి రూ.2,200 కోట్లు
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎలక్ట్రానిక్స్ బ్రాండ్.. బోట్ సెబీ అనుమతి పొందింది. దాంతో నవంబర్‌లో ఐపీవోకు రెడీ అయ్యింది. ఈ సంస్థకి ఆడియో మార్కెట్‌లో 32 శాతం, స్మార్ట్ వాచ్ మార్కెట్‌లో 15 శాతం వాటా ఉంది. ఆ క్రమంలో రూ.1,200 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, మిగిలిన భాగం ఆఫర్ ఫర్ సేల్‌గా ఉంటుంది. అయితే సేకరించిన నిధులను అప్పు తీర్చడంలో.. ఆఫ్ లైన్ విస్తరణలో.. ఆర్ అండ్ డీ పెట్టుబడులకు వినియోగించనుంది.
ఫిజిక్స్‌వాల్లా.. రూ.3820 నుంచి రూ. 4,600 కోట్లు
ఎడ్టెక్ సంస్థ ఫిజిక్స్‌వాల్లా సైతం సుమారు రూ.25 వేలు నుంచి రూ.40వేల కోట్ల వద్ద ఐపీవోకు సిద్ధమవుతోంది. ఈ సంస్థకు 6.4 కోట్ల యాప్ డౌన్‌లోడ్లు, 100కిపైగా నగరాల్లో ఆఫ్‌లైన్ సెంటర్లు ఉన్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.2,886 కోట్లు ఆదాయం పొందింది. దీంతో నష్టం తగ్గి.. లాభం వైపు అడుగులు వేసింది. ఈ ఐపీవో భారత ఎడ్టెక్ రంగానికి ఒక కొత్త దిశను చూపనుంది.
క్లీన్‌మ్యాక్స్ ఎన్వీరో ఎనర్జీ, జూనిపర్ గ్రీన్ ఎనర్జీ
రెండు రిన్యూవబుల్ ఎనర్జీ సంస్థలు కలిసి రూ.8,200కోట్ల వరకు నిధులు సమీకరించనున్నాయి. భారత గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు ఇవి మద్దతు ఇస్తాయి.
ఇక పార్క్ మెడివరల్డ్, ఇన్నోవాటివ్యూ ఇండియా, నెఫ్రోప్లస్, వీడా క్లినికల్ రీసెర్చ్, కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ తదితర మధ్య తరహా సంస్థలు సైతం తమ ఐపీవోలను తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Father Heartfelt Plea: ఓ తండ్రి ఆవేదన
Justice Suryakant: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్