ICICI Bank Charges: ఆగస్టు 1 నుంచి UPI లావాదేవీలపై పేమెంట్ అగ్రిగేటర్లకు ICICI బ్యాంక్ కొత్త ఛార్జీలు
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:51 PM
ఆగస్టు 1 నుంచి ICICI బ్యాంక్ UPI లావాదేవీలపై కొత్త ఛార్జీలు విధించబోతుంది. ఇప్పటి వరకు యూజర్లు UPI ద్వారా ఉచితంగా చెల్లింపులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు పేమెంట్ గేట్‌వేలు లేదా అగ్రిగేటర్లు నిర్దిష్ట ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

ప్రస్తుత డిజిటల్ చెల్లింపుల యుగంలో అనేక మంది కూడా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని వినియోగిస్తున్నారు. దీని సౌలభ్యం, వేగం, ఉచిత సేవల కారణంగా భారతీయుల దైనందిన జీవితంలో భాగమైపోయాయి. అయితే, ఈ వ్యవస్థను నిర్వహించే ఖర్చులు ఎవరు భరించాలనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆగస్టు 1, 2025 నుంచి, ICICI బ్యాంక్ UPI లావాదేవీలపై పేమెంట్ అగ్రిగేటర్లకు ఛార్జీలు విధించేందుకు సిద్ధమైంది. ఈ కొత్త నిర్ణయం డిజిటల్ చెల్లింపుల పరిశ్రమలో కీలక మార్పులను తీసుకురానుంది.
ICICI బ్యాంక్ ఛార్జీల వివరాలు
ICICI బ్యాంక్ తన ఎస్క్రో ఖాతా కలిగిన పేమెంట్ అగ్రిగేటర్లపై ప్రతి UPI లావాదేవీకి 2 బేసిస్ పాయింట్ల (bps) ఛార్జీ విధిస్తుంది. ఇది ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 6 వరకు ఉంటుంది. అయితే, ICICI బ్యాంక్‌లో ఎస్క్రో ఖాతా లేని అగ్రిగేటర్లకు ఈ ఛార్జీ రెట్టింపు, అంటే 4 బేసిస్ పాయింట్లతో గరిష్టంగా రూ. 10 వరకు ఉంటుంది. ICICI బ్యాంక్ ఖాతా కలిగిన వ్యాపారులకు ఈ ఛార్జీలు వర్తించవు. ఇవి ప్రత్యేకంగా పేమెంట్ అగ్రిగేటర్లకు, అంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వ్యాపారుల కోసం డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసే సంస్థలకు మాత్రమే విధించబడతాయి.
ఈ ఛార్జీలు ఎందుకు?
UPI లావాదేవీలను నిర్వహించడానికి బ్యాంకులు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వంటి సంస్థలు అనేక ఖర్చులను భరిస్తున్నాయి. UPI వ్యవస్థ ద్వారా లావాదేవీలను రూట్ చేయడానికి అవసరమైన సాంకేతిక టక్నాలజీ, సర్వర్లు, సాఫ్ట్‌వేర్ నిర్వహణకు ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు, ఈ ఖర్చులను ప్రభుత్వం సబ్సిడీల రూపంలో భరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల ఒక చర్చలో, UPI వ్యవస్థ ఆర్థిక స్థిరత్వం కోసం ఈ ఖర్చులను ఎవరైనా భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ICICI బ్యాంక్ ఈ కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టింది.
ఎవరిపై ప్రభావం పడుతుంది?
ఈ ఛార్జీలు ప్రధానంగా పేమెంట్ అగ్రిగేటర్లను ప్రభావితం చేస్తాయి. అగ్రిగేటర్లు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఈ-కామర్స్ సైట్‌లు లేదా ఆఫ్‌లైన్ వ్యాపారుల కోసం డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసే సంస్థలు. ICICI బ్యాంక్‌తో బ్యాంకింగ్ సంబంధం లేని అగ్రిగేటర్లు ఈ ఛార్జీల భారాన్ని ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, సామాన్య వినియోగదారులపై ఈ ఛార్జీలు నేరుగా ప్రభావం చూపవు. ఎందుకంటే ఈ ఛార్జీలు వ్యాపారులు లేదా అగ్రిగేటర్లకు మాత్రమే వర్తిస్తాయి.
భవిష్యత్తులో ఎలా ఉంటుంది..
UPI లావాదేవీల సంఖ్య, వాల్యూమ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పెరుగుదల వెనుక బ్యాంకులు, NPCI, ఇతర సర్వీస్ ప్రొవైడర్లు నిర్వహించే సాంకేతిక సౌకర్యాలపై ఒత్తిడి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానం కారణంగా, UPI లావాదేవీల నుంచి ఎలాంటి ఆదాయం లేకపోవడం పరిశ్రమకు ఆర్థికంగా సవాలుగా మారింది. ICICI బ్యాంక్ ఈ ఛార్జీలను ప్రవేశపెట్టడం ద్వారా ఈ ఖర్చులను కొంతవరకు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి