Gold Price Record: బంగారం లకారం
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:32 AM
బంగారం ధర సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, డాలర్ బలహీనత వంటి కారణాల వల్ల బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి

రూ.లక్షకు చేరువైన పసిడి ధర.. ఆల్‌టైం రికార్డు గరిష్ఠానికి చేరిక
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, బలహీన డాలరే ప్రధాన కారణాలు
మున్ముందు ధరలు మరింత పైపైకే..!
ఏడాది చివరి నాటికి భారత్‌లో రూ.1.23 లక్షలకు చేరే చాన్స్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇంట్లో పెళ్లి పెట్టుకున్న వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే, బయట ఎండలు.. నగల షాపుల్లో బంగారం భగ్గుమంటున్నాయి. పసిడి ఽధరలు సోమవారం సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠానికి చేరాయి. 10 గ్రాముల బంగారం లకారాని (రూ.లక్ష)కి చేరువైంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం మరో రూ.1,650 పెరిగి రూ.99,800కు చేరింది. అంటే, రూ.లక్ష మైలురాయికి కేవలం రూ.200 దూరంలో ఉంది. 99.5 శాతం స్వచ్ఛత లోహం రేటు కూడా రూ.1,600 పెరుగుదలతో రూ.99,300 పలికింది. పన్నులతో కలిపి లక్ష దాటింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు తులం బంగారం రూ.20,850 లేదా 26.41 శాతం పెరిగింది. కాగా, పుత్తడితోపాటు వెండి కూడా ఎగబాకుతోంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.98,500 ధర పలికింది. అంతర్జాయ మార్కెట్లో వీటి ధరలు అమాంతం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని బులియన్ వర్గాలు వెల్లడించాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశీయంగానూ ఈ విలువైన లోహానికి డిమాండ్ పెంచింది.
గోల్డెన్ ర్యాలీ
ఇంటర్నేషనల్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి 3,397.18 డాలర్లకు ఎగబాకింది. గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు ధరైతే ఏకంగా 80 డాలర్లు (2.4 శాతం) పెరిగి బులియన్ చరిత్రలో తొలిసారిగా 3,400 డాలర్ల మైలురాయిని దాటేసింది. ఔన్స్ సిల్వర్ సైతం 32.85 డాలర్లకు ఎగబాకింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడంతో పాటు డాలర్ బలహీనపడుతుండటం, ఆర్థిక మాంద్యం భయాలు ఈ విలువైన లోహాల ధరలను మరింత ఎగదోశాయి. అంతర్జాతీయ అనిశ్చితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారంలోకి ఇన్వెస్టర్లు పెట్టుబడులను పెద్ద ఎత్తున మళ్లిస్తున్నారు. ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు సైతం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటుండటం ఈ గోల్డెన్ ర్యాలీకి మరో కారణం.
పసిడి పరుగు ఎందాకా..?
వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితులు, మాంద్యం, ధరల పెరుగుదల వంటి భయాందోళనల నేపథ్యంలో బంగారం మరింత పెరగనుందని యూబీఎస్, గోల్డ్‌మన్ శాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, మాక్వెరీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ గోల్డ్ 4,500 డాలర్ల వరకు పెరిగే అవకాశాల్లేకపోలేవని గోల్డ్‌మన్ శాక్స్, అంతర్జాతీయ ఆర్థిక సలహాల సంస్థ డెవేర్ గ్రూప్ అంచనా వేశాయి. అంటే, దేశీయంగా తులం బంగారం రూ.1.23 లక్షలకు చేరే అవకాశం ఉందన్నమాట. అయితే, దీర్ఘకాలికంగా గోల్డ్ బుల్లి్‌షగానే కన్పిస్తున్నప్పటికీ స్వల్ప, మధ్యకాలికంగా భారీ దిద్దుబాటుకు లోనుకావచ్చన్న అంచనాలూ ఉన్నాయి. వినియోగ డిమాండ్‌తో సంబంధం లేకుండా బంగారం ధర ఈ ఏడాదిలో అతివేగంగా పెరుగుతూ వచ్చిందని పేస్ 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ అన్నారు. వచ్చే 6-10 నెలల్లో ఔన్స్ గోల్డ్ ధర మళ్లీ 2,500 డాలర్ల వరకు పడిపోయే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేశారు.
మధ్యతరగతిపై భారం
బంగారం మన ఆచార సంప్రదాయాల్లో భాగం. పండగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలప్పుడు ఎంతో కొంత పసిడి కొనుగోలు చేస్తుంటారు భారతీయులు. గడిచిన ఏడాదిన్నర కాలంలో ధర చాలా వేగంగా పెరుగుతూ వచ్చింది. 2020 నాటి స్థాయితో పోలిస్తే దాదాపు రెట్టింపైంది. దాంతో మధ్యతరగతి వారికి బంగారం కొనుగోలు భారంగా మారింది. తక్కువ గ్రాముల్లో కొనుగోలు చేస్తున్నారు. దాంతో తేలికపాటి ఆభరణాలకు గిరాకీ పెరిగిందని వర్తకులంటున్నారు. అలాగే, చాలా మంది కస్టమర్లు 24-22 క్యారెట్లకు బదులు 18, 14 క్యారెట్ గోల్డ్ జువెలరీకి మొగ్గుచూపుతున్నారు. పసిడి కొండెక్కడం చిన్న నగల షాపుల యజమానులకు సంకటంగా మారింది. ధర అనూహ్యంగా పెరగడంతో గిరాకీ బాగా తగ్గిందని, వ్యాపారం 20-25% వరకు తగ్గిందని వారన్నారు. ఇందుకు తోడు బడా జువెలరీ షోరూమ్‌లు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుండటంతో తమ వ్యాపారం మరింతగా దెబ్బతింటోందని వారు వాపోతున్నారు.
పాత బంగారం మార్చుకుంటున్నారు..
ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో చాలా మంది కస్టమర్లు తమ పాత బంగారు ఆభరణాలను కొత్త వాటితో మార్చుకుంటున్నారు. ప్రస్తుత కొనుగోళ్లలో 40-45 శాతం పాత బంగారం మార్పిడి ద్వారానే జరుగుతున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంటోంది.
భారత మహిళల వద్ద 249.50 లక్షల కోట్ల పసిడి
ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) డేటా ప్రకారం భారత నారీమణులు దాదాపు 25,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుత ధర ప్రకారం..ఆ బంగారం మొత్తం విలువ రూ.249.50 లక్షల కోట్లు. ప్రపంచవ్యాప్త స్వర్ణాభరణాల్లో 11% భారతీయ మహిళల వద్దే ఉన్నాయి. అంతేకాదు, మన మహిళల వద్ద ఉన్న బంగారం ఐదు అతిపెద్ద దేశాల వద్దనున్న మొత్తం నిల్వల కంటే అధికం. అగ్రరాజ్యం అమెరికా 8,000 టన్నులు, జర్మనీ 3,000 టన్నులు, ఇటలీ 2,450 టన్నులు, ఫ్రాన్స్ 2,400 టన్నులు, రష్యా 1,900 టన్నుల బంగారం నిల్వలను కలిగి ఉన్నాయి. భారత మహిళల్లో దక్షిణాది వారికి పసిడిపై అధిక ప్రీతి. దేశీయ స్వర్ణాభరణ నిల్వల్లో 40% దక్షిణాది మహిళలవే. తమిళనాడు వారి వాటా 28%. మన చట్టం ప్రకారం.. పెళ్లయిన ఆడవారు ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేకుండా 500 గ్రాముల వరకు బంగారం కలిగి ఉండవచ్చు. పెళ్లి కానివారు 250 గ్రాములు, మగవారు 100 గ్రాముల వరకు పసిడిని కలిగి ఉండవచ్చు.
2000-2025 మధ్యకాలంలో బంగారం ధరలు
సంవత్సరం (రూ.)
2025 99,800
2024 78,245
2023 63,203
2022 55,017
2021 48,099
2020 50,151
2015 24,931
2010 20,728
2005 7,638
2000 4,400