Adani Group : అదానీ సంపదలో రూ.లక్ష కోట్లు ఫట్
ABN , Publish Date - Feb 22 , 2025 | 04:37 AM
భారత్‌లో రెండో అతి పెద్ద ధనవంతుడైన గౌతమ్ అదానీ సంపదకు భారీగా గండి పడింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం..

ఈ ఏడాదిలో అత్యధికంగా నష్టపోయిన బిలియనీర్లలో మస్క్ తర్వాత అదానీయే..
రూ.3 లక్షల కోట్లు తగ్గిన మస్క్ నెట్‌వర్త్
న్యూఢిల్లీ: భారత్‌లో రెండో అతి పెద్ద ధనవంతుడైన గౌతమ్ అదానీ సంపదకు భారీగా గండి పడింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు అదానీ వ్యక్తిగత ఆస్తి 1,190 కోట్ల డాలర్ల (రూ.1.03 లక్ష ల కోట్లు) మేర తగ్గి 6,680 కోట్ల డాలర్లకు (రూ.5.81 లక్షల కోట్లు) పడిపోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ ప్రస్తుతం 23వ స్థానానికి జారుకున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులకు 25 కోట్ల డాలర్ల (రూ.2,200 కోట్ల) లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై గత ఏడాదిలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మంది వ్యక్తులపై అమెరికాలో కేసు నమోదైంది. దాంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ గడిచిన కొన్ని నెలల్లో భారీగా తగ్గుతూ వచ్చింది. తత్ఫలితంగా గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద కూడా క్షీణించింది.
2025లో అత్యధికంగా సంపద నష్టపోయిన ప్రపంచ బిలియనీర్లలో టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ తర్వాత స్థానం అదానీదే. ప్రపంచంలో నం.1 ధనవంతుడైన మస్క్ నెట్‌వర్త్ ఈ ఏడాదిలో 3,520 కోట్ల డాలర్ల (రూ.3.06 లక్షల కోట్లు) మేర తగ్గి 39,700 కోట్ల డాలర్లకు (రూ.34.54 లక్షల కోట్లు) పడిపోయింది. కాగా, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఆస్తి కూడా కరిగిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 294 కోట్ల డాలర్ల (రూ.25,578 కోట్లు) మేర తగ్గి 8,770 కోట్ల డాలర్లకు (రూ.7.63 లక్షల కోట్లు) పడిపోయింది. బ్లూమ్‌బర్గ్ రిచ్ లిస్ట్‌లో అంబానీ ప్రస్తుతం 17వ స్థానంలో ఉన్నారు.